చదువు లాక్‌డౌన్‌!

ABN , First Publish Date - 2021-01-09T07:17:34+05:30 IST

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది! లాక్‌డౌన్‌ కారణంగా కొంతమంది జీతాలు తగ్గిపోయాయి! మరికొంతమంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది! ఇంకొందరు ఉపాధి కోల్పోయారు! వెరసి, నిరుపేద కుటుంబాలకు మాత్రమే కాదు..

చదువు లాక్‌డౌన్‌!

జూనియర్‌ కాలేజీలకు విద్యార్థులు దూరం..

ప్రభుత్వ కాలేజీల్లో 57 శాతం సీట్లే భర్తీ

ప్రైవేటు కాలేజీల్లో ఫస్టియర్‌ ప్రవేశాలు 62 శాతమే

ఫస్టియర్లో మిగిలిపోయిన సీట్లు 3 లక్షలకు పైనే 

ఆర్థికంగా దెబ్బ తీసిన కరోనా, లాక్‌డౌన్‌ అమలు

ఫీజులు కట్టలేక ప్రైవేటు కాలేజీల నుంచి ‘డ్రాప్‌’

కనీసం స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వలేని స్థితిలో నిరుపేదలు

అఫిలియేషన్‌, ఫైర్‌ ఎన్వోసీపై సర్కారు జాప్యం


భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడుకు చెందిన బందు కృష్ణవేణిది నిరుపేద కుటుంబం. తండ్రి రాములు రోజుకూలి చేస్తేనే జీవనం. కృష్ణవేణిని చదివించడమే భారంగా భావించే రాములుకు ఆమెకు స్మార్ట్‌ ఫోన్‌ కొనిచ్చే స్తోమత లేదు. దాంతో, ఆమె టీవీ తరగతులకే పరిమితం కావాల్సి వస్తోంది. కేబుల్‌, కరెంట్‌ సక్రమంగా ఉంటే క్లాసు ఉంటుంది. కరెంట్‌ లేకపోతే కృష్ణవేణి కూడా పత్తి తీసే కూలి పనికి వెళ్లి.. కుటుంబానికి చేదోడుగా ఉంటోంది. ‘‘గతంలోలా కాలేజీలు తెరిస్తే బాగుండేది. ఫోన్‌ లేకపోవడంతో ఆన్‌లైన్‌ చదువు సాగడం లేదు. అర్థం కాని చదువులతో చదువెట్లా సాగుతుందో భయంగా ఉంది’’ అని రాములు ఆవేదన చెందారు. 


ఫోన్‌ లేక చదువు ఆగింది

నేను పదో తరగతిలో 9.3 జీపీఏ సాధించాను. ఉన్నత చదువులు చదవాలని ఉంది. ఎస్సై కావాలనేది నా కోరిక. కానీ, ఈ ఏడాది కరోనాతో ఇంటర్‌ క్లాసులు నడవడం లేదు. టీవీల్లో, స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ క్లాసులు వినాల్సి ఉంది. అమ్మా, నాన్నలు కూలి పని చేసి మమ్మల్ని పోషిస్తున్నారు. మా ఇంట్లో టీవీ లేదు. నా కోసం స్మార్ట్‌ఫోన్‌ కొనే స్థోమత లేదు. అందువల్ల నేను ఇంటర్‌ చదవలేకపోతున్నాను.

- బి.శిరీష, అలంపూర్‌


హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది! లాక్‌డౌన్‌ కారణంగా కొంతమంది జీతాలు తగ్గిపోయాయి! మరికొంతమంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది! ఇంకొందరు ఉపాధి కోల్పోయారు! వెరసి, నిరుపేద కుటుంబాలకు మాత్రమే కాదు.. మధ్య తరగతి వర్గాల్లోనూ ఆర్థిక నష్టం తప్పలేదు. పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితి. దాంతో, చాలామంది విద్యార్థులు చదువుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రైవేటులోనే కాదు.. ప్రభుత్వ కాలేజీల్లోనూ సీట్లు భర్తీ కాలేదు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఈ ఏడాది కేవలం 57 శాతం సీట్లు భర్తీ అయితే.. ప్రైవేటు కాలేజీల్లో ఇది కేవలం 62 శాతం మాత్రమే. కొంతమంది ప్రైవేటు కాలేజీల్లో చేరినా.. ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. ఇంకా దారుణం ఏమిటంటే, సెల్‌ఫోన్‌ కొనుక్కోలేని కారణంగా చాలామంది ప్రభుత్వవిద్యకు దూరమయ్యారు.


పెరగాల్సింది పోయి..తగ్గాయి.

రాష్ట్రవ్యాప్తంగా 404 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఏటా ప్రథమ సంవత్సరంలో 70-80 శాతం వరకు సీట్లు భర్తీ అవుతూ ఉంటాయి. గత ఏడాది పదో తరగతితోపాటు ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులను కూడా పరీక్షలు నిర్వహించకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించారు. దాంతో, ఎస్సెస్సీ బోర్డు పరీక్షలకు దరఖాస్తు చేసిన 5,34,908 మందితోపాటు తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌, ఇతర దూర విద్యా విధానంలో చదివిన దాదాపు 70 వేల మంది కూడా ఉత్తీర్ణులయ్యారు. వెరసి, పదో తరగతి ఉత్తీర్ణులైన వారి సంఖ్య 6 లక్షలకుపైనే ఉంటుంది. దీంతో ఈసారి ఇంటర్లో ప్రవేశాలు 90ు దాటుతాయని అధికారులు అంచనా వేశారు. అవసరమైతే సీట్లను పెంచాలని నిర్ణయించారు. కానీ, అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి.


పదో తరగతి ఉత్తీర్ణుల్లో పాలిటెక్నిక్‌, ఐటీఐ వంటి కోర్సుల్లో గరిష్ఠంగా 50వేల మంది ప్రవేశాలు పొందినా.. 5.50 లక్షల సీట్లు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో భర్తీ కావాల్సి ఉంది. కానీ, ఈసారి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఫస్టియర్‌లో కేవలం 86 వేల సీట్లు (57ు) భర్తీ కాగా.. 64 వేల సీట్లు మిగిలిపోయాయి. గత ఏడాది ఫస్టియర్‌లో 75ు వరకు ప్రవేశాలు జరిగాయి. ఈసారి ఉత్తీర్ణులు పెరిగినా.. దాదాపు 20ువరకూ ప్రవేశాలు తగ్గాయి. ఇక, ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ప్రవేశాలు భారీగా తగ్గిపోయాయి.  అన్ని ప్రైవేటు కాలేజీల్లో ఫస్టియర్‌లో దాదాపు 6.75 లక్షల సీట్లు ఉండగా, ఈసారి 4.20లక్షల వరకూ మాత్రమే భర్తీ అయ్యాయి. దాదాపు 2.55 లక్షల సీట్లు మిగిలిపోయాయి. గత ఏడాది దాదాపు ఐదు లక్షల సీట్లు భర్తీ అయ్యాయి. ఇందుకు ఒక కారణం లాక్‌డౌన్‌ కాగా.. మరొక కారణం ప్రభుత్వ నిర్ణయంలో జాప్యం. నిజానికి, ఏటా పదో తరగతి ఉత్తీర్ణులయ్యే వారిలో దాదాపు 98 శాతం మంది పైచదువులకు ప్రవేశాలు తీసుకుంటారు.


ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు, ఇతర కారణాలతో 2-3 శాతం చదువుకు స్వస్తి చెప్పేస్తారు. కానీ, ఈసారి వీరి సంఖ్య భారీగానే ఉంది. 3-4 నెలలపాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమలవడంతో కూలీలు, చిరు వ్యాపారులు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. హైదరాబాద్‌, ఇతర నగరాల్లోని వేలాదిమంది పనుల్లేక వారి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. గతంలో ఎలాగోలా పనులు చేస్తూ పిల్లలను చదివించేవారు. ఈసారి పిల్లలను కూడా పనులకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వ్యాపార సంస్థలు, కూలి పనులు కొనసాగుతున్నా.. ఆ నష్టం నుంచి వేలాది కుటుంబాలు ఇంకా తేరుకోలేదు. ఈ కారణాలతో ఈ ఏడాది అనేకమంది తమ పిల్లలను చదువులు మాన్పించి కూలి పనులకు పంపిస్తున్నారు.


‘‘మాది నిరుపేద కుటుంబం. నాన్న లేడు. అమ్మ కూలి పని చేసి మమ్మల్ని పోషిస్తోంది. మద్దూరు కాలేజీలో ఇంటర్‌లో చే రినా స్మార్ట్‌ఫోన్‌ గానీ, టీవీ గానీ లేకపోవడంతో ఆన్‌లైన్‌ క్లాసులకు వెళ్లలేకపోతున్నా. మా అమ్మకు వాటిని సమకూర్చే స్తోమత లేదు. దీంతో ఈ ఏడాది నా చదువు ఆగిపోయింది’’ అని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మద్దూరుకు చెందిన శరత్‌ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. స్మార్ట్‌ ఫోన్‌ కొనే స్తోమత లేక చాలా మంది ప్రభుత్వ చదువుకు దూరమయ్యారంటే ఇక ప్రైవేటులో వేలు, లక్షల ఫీజులు కట్టలేక ఎంతమంది చదువు మానేశారో అర్థం చేసుకోవచ్చు. ‘‘కేవలం ఫీజులు కట్టని కారణంగా ఇప్పటి వరకూ దాదాపు 20 శాతం మంది విద్యార్థులను మా కాలేజీ నుంచి మధ్యలోనే ఇంటికి పంపించేశారు. కాలేజీలో చేరినా.. ఫీజులు కట్టని కారణంగా బయటకు వెళ్లిపోయిన వారి సంఖ్య ప్రైవేటు కాలేజీల్లో ఎక్కువగానే ఉంది. ఎంతోమంది మట్టిలో మాణిక్యాలను లాక్‌డౌన్‌ చదువుకు దూరం చేసింది’’ అని ఓ ప్రముఖ కార్పొరేట్‌ కాలేజీ అధ్యాపకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి జూనియర్‌ కాలేజీల్లో సీట్ల సంఖ్య తగ్గటం వెనక ప్రధాన కారణం లాక్‌డౌన్‌తో తలెత్తిన ఆర్థిక నష్టమని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు.


ఇంకా కొనసాగుతున్న ప్రవేశాలు

ఇంటర్‌ విద్యపై అనేక రాష్ట్రాలు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తుండగా.. తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ ప్రైవేటు జూనియర్‌ కాలేజీల అఫిలియేషన్‌, ఫైర్‌ ఎన్వోసీ, కాంప్లెక్స్‌ కాలేజీల విషయమై నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఇప్పటికీ వంద వరకూ కాంప్లెక్స్‌ కాలేజీలకు అనుమతి నిర్ణయం పెండింగ్‌లోనే ఉంది. దీంతో, ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రవేశాలకు గడువు ఈనెల 12తో ముగియగా.. దీనిని డిసెంబరు-31 వరకు పొడిగించారు. అయినా, వేలాది సీట్లు మిగిలిపోయాయి.


స్మార్ట్‌ ఫోన్‌ కూడా లేక...

కాలేజీలు లేకపోవడంతో ఈసారి టీవీలు, స్మార్ట్‌ ఫోన్ల ద్వారానే తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అవి కూడా కొనలేని స్థితిలో ఉన్న పేద విద్యార్థులు ఈ ఏడాది చదువుకు దూరమయ్యారు. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం సోమారానికి చెందిన పిల్లుట్ల ఉష సిద్దిపేట జిల్లా రాఘవాపురం కాస్తూర్బా బాలికల విద్యాలయంలో ఇంటర్‌ చదువుతోంది. పాఠాలు వినడానికి ఆమె వద్ద సెల్‌ఫోన్‌ లేదు. కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత తల్లిదండ్రులకు లేదు. ఆమెకు స్థానికులు సాయం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మర్కోడుకు చెందిన బందు కృష్ణవేణి తండ్రి రాములు రోజుకూలి చేస్తేనే జీవనం. ఆమెకు స్మార్ట్‌ ఫోన్‌ కొనిచ్చే స్తోమత లేదు. దాంతో, ఆమె టీవీ తరగతులకే పరిమితం కావాల్సి వస్తోంది. కరెంట్‌ లేకపోతే కృష్ణవేణి కూడా పత్తి తీసే కూలి పనికి వెళుతోంది. ‘‘గతంలోలా పాఠశాలలు తెరిస్తే బాగుండేది. ఫోన్‌ లేకపోవడంతో ఆన్‌లైన్‌ చదువు సాగడం లేదు’’ అని రాములు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-01-09T07:17:34+05:30 IST