బెజవాడలో ‘రియల్‌’ గ్యాంగ్‌ వార్‌!

ABN , First Publish Date - 2020-06-01T08:28:50+05:30 IST

బెజవాడ నడిబొడ్డున పటమటలో ఆదివారం పట్టపగలు.. గ్యాంగ్‌ వార్‌ చోటు చేసుకుంది.

బెజవాడలో ‘రియల్‌’ గ్యాంగ్‌ వార్‌!

కత్తిపోట్లతో ఒకరు మృతి 

ప్రాణాపాయంలో మరొకరు 

అపార్ట్‌మెంట్‌ పెట్టుబడి వివాదంలో సెటిల్‌మెంట్‌ బ్యాచ్‌ల జోక్యం

పెరిగిన ఆధిపత్య పోరు.. సినీ ఫక్కీలో పరస్పర దాడులు

దాడుల్లో పాల్గొన్న వారిపై రౌడీషీట్‌


విజయవాడ/పటమట/గుణదల, మే 31(ఆంధ్రజ్యోతి): బెజవాడ నడిబొడ్డున పటమటలో ఆదివారం పట్టపగలు.. గ్యాంగ్‌ వార్‌ చోటు చేసుకుంది. రెండు వర్గాలకు చెందిన పదుల సంఖ్యలో యువకులు కత్తులు, రాడ్లు, సీసాలతో దాడి చేసుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి చెందిన ఇద్దరు భాగస్వాముల మధ్య చోటు చేసుకున్న వివాదంలో తలదూర్చిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన ‘గ్యాంగ్‌ వార్‌’ తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ దాడుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వివరాలు.. ధనేకుల శ్రీధర్‌, ప్రదీప్‌రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో భాగస్వాములు. పెనమలూరులో ఓ ఖాళీ స్థలాన్ని డెవల్‌పమెంట్‌కు తీసుకున్నారు. దీనిలో మొత్తం 14 ఫ్లాట్లు నిర్మించాలి. ప్రదీప్‌రెడ్డి  రూ.40 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత తన వల్ల కాదని చేతులెత్తేశాడు.


శ్రీధర్‌ మరికొంత మందిని భాగస్వాములుగా చేసుకుని అపార్ట్‌మెంట్‌ నిర్మాణాన్ని పూర్తిచేశాడు. కొద్దిరోజుల తర్వాత తన వాటా గురించి ప్రదీప్‌రెడ్డి అడగడం మొదలు పెట్టాడు. శ్రీధర్‌ అందుకు సిద్ధపడలేదు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 14 ఫ్లాట్లలో ఏడింటిని స్థల యజమానికి ఇచ్చి, మిగిలిన ఏడింటిని శ్రీధర్‌, ప్రదీప్‌రెడ్డి చెరో సగం తీసుకోవాలి.ప్రదీప్‌రెడ్డి రూ.40 లక్షలు ఇచ్చి చేతులెత్తేయడంతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం చెడిపోయింది. చివరకు ఈ పంచాయితీ పోలీసు కమిషనరేట్‌లో స్పందన ఫిర్యాదు వరకు వెళ్లింది. సివిల్‌ వివాదం కావడంతో కోర్టులో తేల్చుకోవాలని పోలీసులు చెప్పి అర్జీని తిరస్కరించారు. 


మధ్యవర్తుల మధ్య ఆధిపత్య పోరు

ఈ పంచాయితీ తెగకపోవడంతో వీరిలో ఒకరు నాగబాబు అనే వ్యక్తిని ఆశ్రయించి పరిష్కరించాలని కోరారు. దీంతో డీల్‌ కుదుర్చుకున్న నాగబాబు తన స్నేహితులైన తోట సందీప్‌, మణికంఠ అలియాస్‌ పండులను రంగంలోకి దింపాలకున్నాడు. ముందుగా సందీప్ను రంగంలోకి దించాడు. అయితే, సందీప్కి తెలియకుండా పండును కూడా తెచ్చాడు. ఇది సందీప్కు నచ్చలేదు. నాగబాబును నిలదీయడంతోపాటు, సందీప్‌ తన అనుచరులతో పండు ఇంటికి వెళ్లి బెదిరించాడు. ఆ సమయంలో పండు ఇంట్లో లేడు. ఇంటికి వచ్చిన తర్వాత విషయం తెలిసి తన అనుచరులతో కలిసి పటమటలో సందీప్‌ నిర్వహించే ఐరన్‌ షాపు వద్దకెళ్లి గలాట సృష్టించాడు. ఆ సమయంలో సందీప్‌ లేడు. దీంతో ఫోన్‌లోనే ఇద్దరూ పరస్పరం వార్నింగ్‌లు ఇచ్చుకున్నారు. అనంతరం, సందీప్‌ షాపు సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో పండు 20 మంది యువకులతో, సందీప్‌ 25 మందితో పరస్పరం తలపడ్డారు. అప్పటికే గాజు సీసాలు, కారం, కత్తులతో సిద్ధంగా ఉన్న పండు తన వద్దకొచ్చిన సందీప్‌ కళ్లలో కారం కొట్టి, కత్తితో దాడి చేశాడు. తర్వాత పండు అనుచరులు గాజు సీసాలతో సందీప్‌ తలపై బలంగా కొట్టారు. తీవ్ర గాయాలతో సందీప్‌ కింద పడిపోగానే రాళ్లను అతడిపైకి విసిరారు.


ఈ క్రమంలో సందీప్‌ గ్యాంగ్‌ దాడిలో పండు గాయపడ్డాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సందీప్‌ ఆదివారం రాత్రి చనిపోయాడు. పండు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సందీప్‌ ఏడాదిన్నర క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడని సమాచారం. అతడికి చిన్నపాప ఉంది. సందీప్పై పటమట స్టేషన్‌లో 13 కేసులు న్నాయి. రౌడీషీట్‌ను ఇటీవలే మూసివేశారని సమాచారం. 


తల్లే రెచ్చగొట్టిందా?

సందీప్‌ను అంతం చేయాలన్న కసి పండులో పెరగడానికి అతడి తల్లే కారణమని ప్రచారం జరుగుతోంది. సందీప్‌ ఇంటికి వెళ్లి వార్నింగ్‌ ఇచ్చిన విషయాన్ని పదేపదే చెబుతూ ఎంత ఖర్చయినా అతడి అంతు చూడాలని రెచ్చగొట్టినట్టు సమాచారం. పండుపై పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో సుమారుగా 13 కేసులు ఉన్నట్టు సమాచారం. అతడిని తల్లే ప్రతి కేసు నుంచీ బయటకు తీసుకొచ్చేదని చెబుతున్నారు. కాగా, ఈ ఘర్షణకు సంబంధించి ఇప్పటి వరకు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ గ్యాంగ్‌వార్‌లో ఉన్న ప్రతి ఒక్కరిపైనా రౌడీషీట్‌ తెరుస్తామని డీసీపీ హర్షవర్థన్‌ తెలిపారు.

Updated Date - 2020-06-01T08:28:50+05:30 IST