ఆలోచనొస్తే... పూర్తయ్యేదాకా నిద్రపోడు!

ABN , First Publish Date - 2021-06-13T05:30:00+05:30 IST

తెలంగాణ అమ్మాయి...పంజాబీ అబ్బాయి.. చదువుకునే రోజుల్లో నాగపూర్‌లో కలిశారు. నాగపూర్‌ ఆరెంజ్‌లంత తియ్యనైన ప్రేమవారిది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వారిద్దరే సోనూసూద్‌-సోనాలీ! మోడలింగ్‌ తర్వాత ఈ తెలంగాణ అల్లుడు హైదరాబాద్‌కొచ్చి

ఆలోచనొస్తే... పూర్తయ్యేదాకా నిద్రపోడు!

తెలంగాణ అమ్మాయి...పంజాబీ అబ్బాయి.. 

చదువుకునే రోజుల్లో నాగపూర్‌లో కలిశారు. నాగపూర్‌ ఆరెంజ్‌లంత తియ్యనైన ప్రేమవారిది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వారిద్దరే సోనూసూద్‌-సోనాలీ! మోడలింగ్‌ తర్వాత ఈ తెలంగాణ అల్లుడు హైదరాబాద్‌కొచ్చి సినిమాల్లో విలన్‌ అయ్యాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని రాటుదేలిన సోనూ.. కరోనా సమయంలో హైవేల్లో నడుస్తున్న కార్మికులనుంచి ఇప్పటికీ ఎందరో కష్టాలను చూసి సాయం చేస్తున్నాడు. సోనూసూద్‌ ‘సాయంలో కర్ణుడు’. మరి అంత మంచి మనసుండే సోనూసూద్‌ను వెనక నుంచి  నడిపించి.. అతని ప్రతి పనిలో చేదోడువాదోడుగా ఉండే..  తెలంగాణ బిడ్డ గురించి మీరు తెలుసుకోకుంటే ఎలా! 

సోనాలీతో ‘నవ్య’ ఎక్స్‌క్లూజివ్‌ మీ కోసం...


‘‘మా తాతగారిది తెలంగాణ. ఆయన పేరు రాజుల నాయుడు. ఆయన పుట్టినది, పెరిగింది తెలంగాణాలో. కానీ, ముంబైలో స్థిరపడ్డారు. అక్కడ వ్యాపారం చేసేవారు. నాన్న కూడా అక్కడే పుట్టారు. నాన్న పుట్టింది ముంబైలో అయినా- ఇంట్లో మాత్రం తెలుగే మాట్లాడేవారు. అలా నాకు కూడా కొంత తెలుగు వచ్చింది. ఇక నేను పుట్టింది.. పెరిగింది ముంబైలో కావటంతో బయట తెలుగు మాట్లాడే అవకాశమే ఉండేది కాదు. అందువల్ల నేను ధారాళంగా తెలుగు మాట్లాడలేకపోవచ్చు కానీ అర్థం చేసుకోగలను. నాన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఉద్యోగి కావటంతో ప్రతి మూడేళ్లకు బదిలీలు ఉండేవి. నేను కాలేజీలో చేరే సమయానికి నాన్నకు నాగపూర్‌ బదిలీ అయింది. నేను అక్కడ మీడియా కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేస్తున్న రోజుల్లో సోనూతో పరిచయమయింది. తను ఆ సమయంలో నాగపూర్‌లో ఇంజనీరింగ్‌ చదువుతూ ఉండేవాడు. మన సినిమాల్లో చూపిస్తారే... అలాంటి టీనేజ్‌ లవ్‌స్టోరీ మాది. తను నా టీనేజ్‌ స్వీట్‌హార్ట్‌. తను నా ఫ్రెండ్‌గా మా ఇంట్లో కూడా అందరికీ తెలుసు. వారు కూడా తనను ఇష్టపడేవారు.


సోను పంజాబీ.. నేను దక్షిణాది కాబట్టి మా కుటుంబాల నేపథ్యాలు వేరు. అయినా మా పెళ్లికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. తన చదువు పూర్తయి.. మోడలింగ్‌ చేయటానికి ముంబై వచ్చేశాడు. నేను కూడా ఒక కంపెనీలో ఉద్యోగం చూసుకొని వచ్చేశా. సోను స్ట్రగుల్‌ పడుతున్న దశ కాబట్టి ఆదాయం ఉండేది కాదు. ఇద్దరం నా ఆదాయంపైనే బతకాల్సి వచ్చేది. ముంబైలో మా ఫ్రెండ్‌ ఒకామె ఉండేది. వాళ్లది డబుల్‌ బెడ్‌రూమ్‌. మేము కూడా వాళ్లతో ఉండేవాళ్లం. దాదాపు రెండేళ్లు అలా గడిపాం. మా అమ్మానాన్నలు ఎగువ మధ్య తరగతి వారు. సోనుది కూడా సంపన్న కుటుంబమే. మేము అడిగితే తప్పనిసరిగా సాయం చేసేవారే! కానీ మాకు ఎవరినీ సాయం అడగటం ఇష్టం ఉండేది కాదు. ఇష్టపడి పెళ్లిచేసుకున్న తర్వాత ఎంత కష్టమైనా మేమే భరించాలనుకొనేవాళ్లం. 


కొడుకు కోసం ఉద్యోగం మానేశా!

రెండేళ్లు గడిచిన తర్వాత సోనుకు నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు రావటం మొదలుపెట్టాయి. ఒక వైపు మోడలింగ్‌.., మరో వైపు సినిమాలు - ఇలా నెమ్మదిగా ఆదాయం కూడా పెరిగింది. ఆ సమయంలో మా అబ్బాయి ఇషాన్‌ పుట్టాడు. అప్పటికే మా అమ్మానాన్న నాగపూర్‌లో స్థిరపడ్డారు. మాకు ముంబైలో ఎటువంటి అండ లేదు. దీనితో నేను ఇషాన్‌ చూసుకోవటానికి ఉద్యోగం మానేశా.. అప్పటికే తనకు స్థిరమైన ఆదాయం వచ్చేది కాబట్టి ఇబ్బంది ఉండేది కాదు. సోను కూడా సినిమాల్లో స్థిరపడ్డాడు. మంచి నటుడిగా పేరు వచ్చింది. ఇలా అంతా బావుందనుకొనే సమయంలో- అందరి జీవితాల్లో మాదిరిగానే మాకు కూడా కొవిడ్‌ ఒక బ్రేక్‌ వేసింది. ఎక్కడికి ఎవరూ బయటకు కదలలేని పరిస్థితి. కొన్ని లక్షల మంది వలస కూలీలకు అన్నం కూడా దొరకని పరిస్థితి. రోజు టీవీల్లో ఆ దృశ్యాలే!


సాయం చేయాలనే ఆలోచన అలా...

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చిన్నప్పటి నుంచి సోను ఎవరైనా కష్టాల్లో ఉంటే తట్టుకోలేడు. తనకు చేతనైనంత సాయం చేస్తాడు. మా కాలేజీ రోజుల్లో కూడా అంతే! తను సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా అంతే! అది తనకు పుట్టుకతో వచ్చిన గుణం. గత ఏడాది కొవిడ్‌ లాక్‌డౌన్‌లో అందరం ఇంట్లోనే ఉండేవాళ్లం. ఒక రోజు నేను, తను కూర్చుని టీవీ చూస్తుంటే- వేల మంది వలస కూలీలు తమ స్వస్థలాలకు కాలి నడకన బయలు దేరిన దృశ్యాలు కనిపించాయి. వారిలో వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ‘వారి స్థితిలో మేము ఉంటే..? మా పిల్లలే అలా నడవాల్సి వస్తే.. ?’ ఇలాంటి ఆలోచనలు రావటం మొదలుపెట్టాయి. ఆ రోజంతా మేము ఆ దృశ్యాల గురించే మాట్లాడుకున్నాం.


ఏదో చెయ్యాలి.. కానీ ఏం చేయాలి తెలియదు. సోనుకు ఒక ఆలోచన వచ్చిందంటే.., అది కార్యరూపం దాల్చేవరకూ నిద్రపోడు. ఆ సమయంలో తనకు అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎవరో పూనినట్టు... ఆ పని పూర్తయ్యే దాకా అదే ఆలోచనతో ఉంటాడు. వలస కార్మికుల కష్టాలన్నీ తీర్చలేకపోవచ్చు కానీ వారికి వెంటనే కావాల్సింది ఆహారం... వెళ్లటానికి అవసరమైన రవాణా సౌకర్యం. వెంటనే ఈ రెండింటినీ ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ లాక్‌డౌన్‌లో వాహనాలకు పర్మిషన్స్‌ దొరికేవి కావు. సోను, నేను నితిష్‌ అనే స్నేహితుడు... ఇలా కొంతమంది మిత్రులం కలిసి వలస కూలీలకు సాయం చేయటం మొదలుపెట్టాం. నేను ఇంట్లో ఉండి వారికి కావాల్సిన లాజిస్టికల్‌ సపోర్టు అందించేదాన్ని.


సోను- ఒక సినిమా నటుడిగా అందరికీ తెలుసు కాబట్టి పర్మిషన్ల కోసం తను అందరితోను మాట్లాడేవాడు. మిగిలిన వారు బయటకు వెళ్లేవారు. మేము చేస్తున్న పని చూసి- మా బంధువులందరూ తలో చేయి వేయటం మొదలుపెట్టారు. ‘ఇంతింతై వటుడింతై...’ అన్నట్లు ఈ కార్యక్రమం రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే- ‘ఇన్ని వేల మందికి సాయం చేశామా?’ అనిపిస్తుంది. ఈ మొత్తం కార్యక్రమంలో ఒక్క నిమిషం కూడా అలసిపోకుండా.. ఒక వైపు తన నట జీవితాన్ని.. మరో వైపు ఈ సేవా కార్యక్రమాలను నడుపుతున్న క్రెడిట్‌ను మాత్రం సోనూకే ఇవ్వాలి. 


సహాయం కోసం రోజూ ఫోన్‌ కాల్స్‌...

మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ క్రమబద్ధీకరించటానికి ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాం. ఈ ఫౌండేషన్‌లో అందరూ వాలంటీర్లే ఉంటారు. ఎవరికీ ఎలాంటి అధికారిక పదవులు లేవు. మా ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటికే కొన్ని వేల మందికి సాయం అందింది. రోజు రోజుకు ఫౌండేషన్‌కు సాయం చేసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. కొందరు బహిరంగంగా సాయం చేస్తుంటే... మరి కొందరు అజ్ఞాతంగా సాయం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి రోజు కొన్ని వేల కాల్స్‌ వస్తున్నాయి. వారికి మాకు చేతనైనంత సాయం చేయటానికి ప్రయత్నిస్తున్నాం. మూడు రోజుల క్రితం- రాత్రి 2.30 గంటలకు నాకు వైజాగ్‌ నుంచి ఒక కాల్‌ వచ్చింది. ఆ కాల్‌ చేసిన వ్యక్తి కుటుంబ సభ్యుడికి వెంటనే ఆక్సిజన్‌ కావాలి. లేకపోతే అతను చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పారట! గుజరాత్‌లో ఎవరో స్నేహితుడు ఉంటే... అతని దగ్గర నుంచి నా నెంబర్‌ తీసుకొని నాకు కాల్‌ చేశాడు.


నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సోనును లేపి పరిస్థితి చెప్పా. తను వైజాగ్‌లో ఉన్న తన స్నేహితులకు కాల్‌ చేశాడు. కొందరు డాక్టర్లకు ఫోన్‌ చేసి సాయం చేయమని అర్థించాడు. మొత్తానికి ఆ వ్యక్తికి ఆక్సిజన్‌ దొరికింది. ‘నాకు కాల్‌ రాకపోతే.. వెంటనే డాక్టర్లు స్పందించకపోతే.. ఆ వ్యక్తి చనిపోయేవాడే!’ అనే ఆలోచన ఇప్పటికీ నన్ను వెంటాడుతూ ఉంటుంది. అలాంటి వారు మన దేశంలో ఎంతో మంది ఉన్నారనే విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా- ‘ఏదో ఒకటి చేయాలి’ అనిపిస్తుంది. 




పిల్లలు కూడా..

మాకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడు ఇషాన్‌. రెండోవాడు అయాన్‌. వీరిద్దరూ కూడా మా ఫౌండేషన్‌ అందిస్తున్న సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరిద్దరూ కూడా చాలా సెన్సిటివ్‌. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే వెంటనే సాయం చేయాలనుకుంటారు. ఆ విషయాన్ని వెంటనే మా దృష్టికి తీసుకువస్తారు. వారి స్నేహితుల నుంచి కూడా రిక్వెస్ట్‌లు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం మాకు చేతనైనంత సాయం చేస్తున్నాం. ఇది ఇక్కడితో ఆగిపోదు. ప్రస్తుతం కొవిడ్‌ వల్ల ఇబ్బందులు పడుతున్నవారికి సాయం అందిస్తున్నాం. కానీ మన సువిశాలమైన భారతదేశంలో సాయం అవసరమైన వారు ఎంతో మంది ఉన్నారు. వీరందరికీ మనం నేరుగా సాయం చేయలేకపోవచ్చు. కానీ మనం చేస్తున్న కార్యక్రమాలను చూసి స్ఫూర్తి పొందితే అంతకన్నా ఏం కావాలి?


‘‘మేము ముంబైలో స్థిరపడ్డా మా చుట్టాలందరూ హైదరాబాద్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నారు. వారి పెళ్లిళ్లకు ఇతర ఫంక్షన్లకు హైదరాబాద్‌ వస్తూనే ఉంటాం. ఈ విధంగా చూస్తే నేను తెలంగాణ అమ్మాయిని. సోను తెలంగాణ అల్లుడు. కొవిడ్‌ వల్ల గత ఏడాదిన్నర నుంచి నేను హైదరాబాద్‌ రాలేదు. కానీ షూటింగ్‌ కోసం సోనూ వస్తూనే ఉన్నాడు.’’

Updated Date - 2021-06-13T05:30:00+05:30 IST