అదిగదిగో.. రీజినల్‌ రింగ్‌ రోడ్‌!

ABN , First Publish Date - 2021-01-16T09:00:22+05:30 IST

చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారని ఒక నానుడి. అవసరాల కోసం అలా చేయడం పరిపాటే.. కానీ అసలు చెట్టే లేకున్నా కాయలు కూడా అమ్ముకోవచ్చు. అందుకు అస్త్రంగా మారింది రిజినల్‌ రింగ్‌ రోడ్‌.

అదిగదిగో.. రీజినల్‌ రింగ్‌ రోడ్‌!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బూచీగా భూముల ధరలకు రెక్కలు

అందమైన బ్రోచర్లతో వల

వాటిని చూస్తే స్థలాలు కొనాల్సిందే

ట్రిపుల్‌ ఆర్‌పై కోట్లలో వ్యాపారం

సొమ్ము చేసుకుంటున్న రియల్టర్లు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై స్పష్టతనివ్వని కేంద్రం


హైదరాబాద్‌ సిటీ, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారని ఒక నానుడి. అవసరాల కోసం అలా చేయడం పరిపాటే.. కానీ అసలు చెట్టే లేకున్నా కాయలు కూడా అమ్ముకోవచ్చు. అందుకు అస్త్రంగా మారింది రిజినల్‌ రింగ్‌ రోడ్‌. అదిరిపోయే గ్రాఫిక్‌ డిజైన్లు, ఆకట్టుకునేలా లొకేషన్‌ మ్యాప్‌లు.. వాటిని చూస్తే.. ఇక స్థలం కొనాల్సిందే అన్నట్లుగా.. మాయాజాలం చేస్తున్నారు  కొందరు రియల్టర్లు, డెవలపర్లు. ప్రతిపాదనలో ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌ వచ్చేస్తోందంటూ ఆశలు చూపుతూ భూముల ధరలను అమాంతంగా పెంచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ సరిహద్దున ఉన్న జిల్లాల్లో ఈ భూ బాగోతం యథేచ్ఛగా సాగుతోంది. 


మహబూబ్‌నగర్‌ జిల్లాలో

గ్రీన్‌ ఎకరాస్‌ పేరుతో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల నుంచి 8 కిలోమీటర్ల దూరంలో భారీ లే అవుట్‌ను చేసింది. మారుమూల ప్రాంతంలో ఉన్న ఆ స్థలాల విలువ పెంచడానికి, వినియోగదారులకు ఓ అనుభూతి కల్పించడానికి వేసిన బ్రోచర్‌లో ఏకంగా ఆర్‌ఆర్‌ఆర్‌ను దించేసింది. నిమ్జ్‌, పోలేపల్లి సెజ్‌, సాబ్స్‌ టెక్స్‌టైల్‌ పార్కు, బాలానగర్‌ ఇండస్ర్టియల్‌ ఏరియా, ఎన్‌ఆర్‌ఎ్‌ససీ, అమెజాన్‌, టిస్‌, ఎయిర్‌పోర్టు ఇలా ఒక్కటేమిటీ? హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఇప్పటికే  ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రీజినల్‌ రింగ్‌ రోడ్డు కూడా వస్తుందని చూపిస్తూ..  సదరు సంస్థ చదరపు గజం విలువను వేలల్లో పెంచేసింది. మరోవైపు, ప్యూచర్‌ సిటీ పేరుతో మరో ప్రముఖ రియల్‌ ఏస్టేట్‌ సంస్థ సంగారెడ్డి జిల్లాలోని మారుమూల గ్రామంలో లేఅవుట్‌ను చేసింది. ప్రతిపాదిత ఆర్‌ఆర్‌ఆర్‌కు సమీపంలోనే అనేవిధంగా లోకేషన్‌ ప్లాన్‌ను రూపొందించింది. 


ఎకరాలకు ఎకరాలే కొనుగోలు

హైదరాబాద్‌ సరిహద్దున ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాలో ఐదారేళ్ల నుంచే పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయి. ఎకరం, నాలుగైదు ఎకరాలే కాకుండా.. 50 నుంచి 100 ఎకరాల వరకు గంపగుత్తగా ఒకే మొత్తంలో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. కొన్ని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు షాద్‌నగర్‌, చౌటుప్పల్‌, బీబీనగర్‌, భువనగిరి, యాదాద్రి, సంగారెడ్డి, తాండూరు, తదితర ప్రాంతాల్లో వందలాది ఎకరాలను కొనుగోలు చేశాయి. షాద్‌నగర్‌ ప్రాంతంలో మారుమూల గ్రామంలో ఓ డెవలపర్‌ ఏకంగా వెయ్యి ఎకరాలకు కొనుగోలు చేయడం గమనార్హం. హైదరాబాద్‌ నగరానికి 70, 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేఅవుట్లలోనైనా కొన్ని ఓపెన్‌ ప్లాట్లకు సంబంధించి కాగా, మరికొన్ని గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలు ఉన్నాయి. కొందరు రియల్టర్లు ఫామ్‌హౌ్‌సల పేరుతో ఎకరం, రెండు ఎకరాల విస్తీర్ణంతో ఒక్కో ప్లాట్‌ను చేసి అందులో ఫామ్‌హౌ్‌సను తీర్చిదిద్దుతున్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డును చూపిస్తూ రూ.కోట్ల వ్యాపారానికి తెర లేపారు. హైదరాబాద్‌ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉండే జడ్చర్ల వైపు ప్లాట్లను చేసి మరీ చదరపు గజాన్ని రూ.5 వేలకు తగ్గకుండా విక్రయించేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ ఓ అస్త్రంగా మారింది.


నేటికీ స్పష్టత కరువు

హైదరాబాద్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డు తరహాలోనే వివిధ జిల్లాల్లోనూ రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారం పరుగులు తీసేందుకు అనువుగా, మెరుగైన ప్రజా రవాణా మార్గం కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం రీజినల్‌ రింగ్‌ రోడ్డు కోసం ప్రతిపాదనలు చేసింది. నిధుల కోసం ఆ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి  అందజేసింది.  ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం భూసేకరణకు అయ్యే ఖర్చు రూ.3వేల కోట్లలో సగం రూ.1500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరించగా, మిగతా భూసేకరణ ఖర్చు రూ.1500 కోట్లు, ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయ్యే రూ.9వేల కోట్లు మొత్తం రూ.10,500 కోట్లు కేంద్రం భరించాలంటూ ప్రతిపాదనలు చేశారు. రెండేళ్ల క్రితమే ఆర్‌ఆర్‌కు కేంద్రం అనుమతి వచ్చిందంటూ ప్రచారం జరిగింది. కానీ రీజినల్‌ రింగ్‌ రోడ్డుపై చర్చించాలని నేషనల్‌ హైవే ఆథారిటీ అధికారులకు అప్పట్లో ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి భరోసా వచ్చిందో స్పష్టత లేదు. 


బ్రోచర్లతో ఆకట్టుకునే ప్రయత్నాలు

రియల్టర్లు, డెవలపర్లు తమ లేఅవుట్లలోని ప్లాట్లను విక్రయించడానికి అదిరిపోయే విధంగా బ్రోచర్లను సిద్ధం చేస్తున్నారు. లేఅవుట్‌లో కల్పిస్తున్న మౌలిక వసతులను గ్రాఫిక్స్‌ ద్వారా డిజైన్లు చేసి చూపించడంతో పాటు.. లోకేషన్‌ మ్యాప్‌ కూడా ఆకర్షణీయంగా ఉండేవిధంగా తయారు చేస్తున్నారు. లోకేషన్‌ మ్యాప్‌ చూస్తే చాలు.. లేఅవుట్‌ ఎక్కడా ఉన్నదో నిరాక్షరాస్యులకు కూడా అర్థమయ్యే విధంగా మ్యాప్‌లను రూపొందిస్తున్నారు.  ఆర్‌ఆర్‌ఆర్‌ పక్కనే లేఅవుట్‌ అంటూ కొంతమంది రియల్టర్లు, డెవలపర్లు జనాలకు కుచ్చు టోపి పెడుతున్నారు.

Updated Date - 2021-01-16T09:00:22+05:30 IST