రిలయన్స్‌ గ్రీన్ మంత్ర

ABN , First Publish Date - 2021-06-25T06:06:10+05:30 IST

ఐదేళ్ల క్రితం రిలయన్స్‌ జియోను ప్రకటించి టెలికాం రంగంలో విప్లవం సృష్టించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌

రిలయన్స్‌ గ్రీన్ మంత్ర

  •  పునరుత్పాదక ఇంధన వ్యాపారంలోకి అడుగు  జూమూడేళ్లలో రూ.75,000 కోట్ల పెట్టుబడులు  
  •  5 వేల ఎకరాల్లో ధీరూభాయ్‌ అంబానీ గ్రీన్‌ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ 
  •  సెప్టెంబరులో 4జీ స్మార్ట్‌ఫోన్‌ జియో నెక్ట్స్‌ విడుదల 
  •  రిలయన్స్‌ రిటైల్‌లో కొత్తగా 10 లక్షల ఉద్యోగాలు 
  •  ఆర్‌ఐఎల్‌ బోర్డులోకి సౌదీ అరామ్కో చీఫ్‌
  •  44వ ఏజీఎంలో సంస్థ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ 


ఐదేళ్ల క్రితం రిలయన్స్‌ జియోను ప్రకటించి టెలికాం రంగంలో విప్లవం సృష్టించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌).. తాజాగా పునరుత్పాదక ఇంధన రంగంలో సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా రూ.75,000 కోట్ల పెట్టుబడులతో సౌర విద్యుదుత్పత్తి వంటి గ్రీన్‌ ఎనర్జీ విభాగాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ఆర్‌ఐఎల్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ.. కంపెనీ 44 ఏజీఎంలో ప్రకటించారు. ఇందులో భాగంగా ఐదు వేల ఎకరాల్లో ప్రత్యేకంగా గ్రీన్‌ ఎనర్జీ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 2030 నాటికి లక్ష మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తిని చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సెప్టెంబరులో టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌తో కలిసి చౌక 4జీ స్మార్ట్‌ఫోన్‌ జియో నెక్ట్స్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు  వెల్లడించారు.  


ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) మరోసారి తన మెగా వ్యాపార విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. కొత్తగా పెద్ద ఎత్తున సౌర విద్యుత్‌ వంటి హరిత ఇంధన రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో రూ.75,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌, ఎండీ ముకేశ్‌ అంబానీ గురువారం జరిగిన 44వ అసాధారణ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ప్రకటించారు.

]

ఇందులో  రూ.66,000 కోట్లు ప్లాంట్ల ఏర్పాటు కోసం, మరో రూ.15,000 కోట్లు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల మౌలిక వసతుల మీద ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిధులను పూర్తిగా అంతర్గత వనరుల ద్వారానే సమకూర్చుకోను న్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న రిఫైనింగ్‌, పెట్రో కెమికల్స్‌,  టెలికాం, రిటైల్‌ వ్యాపారాల్ని మరింతగా విస్తరించనున్నట్లు ప్రకటించారు. 2035 నాటికి కార్బన్‌ డయాక్సైడ్‌ రహిత ఇంధ న కంపెనీగా అవతరిస్తామని ప్రకటించారు. అంబానీ ఇంకా ఏమన్నారంటే..




నాలుగు గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు 


సౌర విద్యుత్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టులపై ఆర్‌ఐఎల్‌ పెద్దఎత్తున దృష్టి పెట్టబోతోంది. ఇందులో భాగంగా వచ్చే మూడేళ్లలో భారీ పెట్టుబడులతో 4 ప్లాంట్లను నెలకొల్పుతున్నట్లు ముకేశ్‌ అంబానీ వెల్లడించారు.  


 జామ్‌నగర్‌లో 5000 ఎకరాల్లో ధీరూభాయ్‌ అంబానీ గ్రీన్‌ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ పేరుతో.. ప్రపంచంలోనే అతి పెద్ద పునరుత్పాదక ఇంధన వనరుల సమగ్ర ప్రాజెక్టు


 ఈ కాంప్లెక్స్‌లో సోలార్‌ సెల్స్‌, ఎనర్జీ స్టోరేజీ బ్యాటరీలు, ఫ్యూయల్‌ సెల్స్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీ కోసం నాలుగు భారీ ప్లాంట్ల ఏర్పాటు


 రూఫ్‌టాప్‌ సోలార్‌, గ్రామీణ ప్రాంతాల్లో సౌర విద్యుదుత్పత్తి కేం ద్రాల ఏర్పాటు ద్వారా 2030 నాటికి లక్ష మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి సామర్ధ్యం


 గ్రీన్‌ హైడ్రోజన్‌, కార్బన్‌ డయాక్సైడ్‌ ద్వారా ఎరువులు, పర్యావరణానికి హాని చేయని రసాయనాలు, ఎలక్ట్రిక్‌ వాహనాలకు అవసరమయ్యే ఇంధనాల తయారీ




 చౌక 4జీ స్మార్ట్‌ఫోన్‌.. గూగూల్‌తో జట్టు 


రిలయన్స్‌ జియోకి సంబంధించీ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. గూగుల్‌తో కలిసి అభివృద్ధి చేసిన కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించారు. జియోఫోన్‌ నెక్స్ట్‌ పేరుతో ఆవిష్కరించిన ఈ ఫోన్‌ ధరను మాత్రం అంబా నీ వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్‌ ధర రూ.5,000 లోపే ఉంటుందని అంచనా. 


 సెప్టెంబరు 10 (వినాయక చవితి) నుంచి అందుబాటులోకి


 గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌


 అందుబాటు ధరల్లోనే జియోఫోన్‌ నెక్ట్స్‌ 


 ఫోన్‌లో అనువాదం, వాయిస్‌ అసిస్టెంట్‌, అత్యాధునిక కెమెరా వంటి ఫీచర్లు


 భారత వినియోగదారుల కోసమే ఈ ఫోన్‌ అభివృద్ధి


 భారత్‌ తర్వాత ఇతర దేశాల్లోనూ విడుదల చేసే యోచన


 కొత్త ఫోన్‌తో 2జీ వినియోగదారుల్లో ఎక్కువ మంది రిలయన్స్‌ జియోకు మారతారని అంచనా




రిటైల్‌లోనూ దూసుకుపోతాం 


 వచ్చే మూడేళ్లలో రిలయన్స్‌ రిటైల్‌లో కొత్తగా 10 లక్షల కొలువులు

 ఈ ఏడాది మార్చి నాటికి రెండు లక్షల మంది ఉద్యోగులు 

   గత ఏడాది కొత్తగా చేరిన ఉద్యోగులు 65,000 మంది

 వచ్చే 3-5 ఏళ్లలో మూడు రెట్లు పెరగనున్న కంపెనీ ఆదాయం

 టాప్‌-10 గ్లోబల్‌ రిటైల్‌ కంపెనీల్లో ఒకటిగా ఎదగాలని లక్ష్యం

 ఇతర రిటైల్‌ కంపెనీల కొనుగోళ్ల ద్వారానూ వ్యాపార విస్తరణ

 వచ్చే మూడేళ్లలో జియోమార్ట్‌లో కోటి మంది వ్యాపారులకు చోటు

 2020-21లో కొత్తగా 1,500 స్టోర్ల ఏర్పాటు. 12,711కు చేరిన మొత్తం స్టోర్లు 




5జీ ట్రయల్స్‌ సక్సెస్‌ 


 రిలయన్స్‌ జియో 5జీ ప్రయోగాత్మక పరీక్షల వివరాలనూ అంబానీ వివరించారు. దేశీయంగా తమ కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ ద్వారా 1 జీబీపీఎ్‌సకుపైగా స్పీడ్‌ సాధించినట్లు ప్రకటించారు.

 మిగతా ఆపరేటర్ల కంటే ముందే జియో 5జీ సేవలు

 జియో ద్వారా 2జీ నుంచి ముక్తి.. 5జీ సాధికారత

 పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన క్లౌడ్‌ ఆధారిత 5జీ టెక్నాలజీ

 ఇతర దేశాలకూ 5జీ టెక్నాలజీ ఎగుమతి చేసే యోచన

 5జీ ఫోన్లు, ఇతర పరికరాల తయారీ కోసం అంతర్జాతీయ సంస్థలతో చర్చలు




 సౌదీ అరామ్కోకు వాటా !


కంపెనీ ఆయిల్‌ టు కెమికల్స్‌ (ఓ2సీ) వ్యాపారానికి సంబంధించి అందరూ ఊహించినట్టే రిలయన్స్‌ డైరెక్టర్ల బోర్డులో సౌదీ అరామ్కో చైర్మన్‌ యాసిర్‌ ఓత్‌మాన్‌ అల్‌ రుమయ్యాన్‌కు చోటు కల్పిస్తున్నట్టు అంబానీ వెల్లడించారు. దీంతో రిలయన్స్‌ ఓ2సీ వ్యాపారంలో సౌదీ అరామ్కోకు వాటా విక్రయం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విభాగంలో ఆరామ్కోకు 20 శాతం వాటా విక్రయించేందుకు 2019 ఆగస్టులో రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ధరపై అంగీకారం కుదరక పోవడంతో దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఏడాదే ఈ చర్చలు ఒక కొలిక్కి వస్తాయని అంబానీ ప్రకటించారు. 


Updated Date - 2021-06-25T06:06:10+05:30 IST