రిలయన్స్... ఫలితాలు ఏం చెబుతున్నాయి ?

ABN , First Publish Date - 2021-10-25T04:23:34+05:30 IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం ఈ ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 13,680 కోట్లుగా నమోదైన విషయం తెలిసిందే. అంచనాలను కూడా తలకిందులు చేసి మరీ ఈ స్థాయిలో లాభాలను ఆర్ఐఎల్ సాధించడం గమనార్హం.

రిలయన్స్... ఫలితాలు ఏం చెబుతున్నాయి ?

ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం ఈ ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో  రూ. 13,680 కోట్లుగా నమోదైన విషయం తెలిసిందే. అంచనాలను కూడా తలకిందులు చేసి మరీ ఈ స్థాయిలో లాభాలను ఆర్ఐఎల్ సాధించడం గమనార్హం.  కాగా... కేవలం షేరు ధర పెరగడం కాకుండా... అంతకి మించి రిలయన్స్ సాధించబోతోందన్న అంశాన్ని పరిశీలిస్తే... సంస్థ మూడు నెలల ఆదాయం దాదాపు 2లక్షల కోట్లు... అంటే ఓ రాష్ట్ర బడ్జెట్‌తో సమానం. షేరు ధర రూ. 2,600. ఇక ఇతర స్టాక్స్ విషయానికొస్తే... 


  ఫేస్‌బుక్ షేరు ధర రూ.  24 వేల పైమాటే. ఆదాయం 992 బిలియన్ డాలర్లు. ఆపిల్ కంపెనీ షేరు విలువ 148 డాలర్లు(మన కరెన్సీలో రూ. 11,249. అయితే... ఆపిల్ ఆదాయం  2.4 ట్రిలియన్ డాలర్లు. మైక్రోసాఫ్ట్ షేర్ విలువ 310 డాలర్లు(రూ. 23,247). ఆదాయం  2.14 ట్రిలియన్ డాలర్లు. అమెజాన్ 1.48 ట్రిలియన్ డాలర్ల కంపెనీ. వీటితో రిలయన్స్ ఇండస్ట్రీని పోల్చడం సరికాకపోయినప్పటికీ... వీటిలో ఒకటి ప్రొడక్ట్ బేస్డ్ కాగా, మరొకటి టెక్ దిగ్గజం. ఇంకొకటి టెక్ ప్లాట్‌ఫామ్. మరొకటి  ఆగ్రిగేటర్ టెక్ కంపెనీ. మరి రిలయన్స్ ? ఈ క్రమానికి సమాధానం కనుక్కునే ప్రయత్నమే ఇప్పుడు ముకేశ్ అంబానీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. 


భారత్ జనాభా 137 కోట్లు. ఇంత పెద్ద దేశంలో రిటైల్ షాపుల రివల్యూషన్ ఇప్పుడే పీక్ స్టేజ్‌కి చేరుకుంది. అలానే స్మార్ట్ ఫోన్ల వాడకం కూడా. వీటికి తోడు డిజిటల్ పేమెంట్ల వ్యవస్థ విజృంభిస్తోంది. ఇక ప్రపంచానికి పెద్ద ఆక్సిజన్‌గా ఉన్న మరో రంగం... ఇంధనం. ఈ నాలుగు రంగాల్లో విస్తరించేందుకు  రిలయన్స్ మరింతగా సన్నాహాలు చేస్తోంది. ప్రపంచంలోనే అన్ని దేశాలకు తెలిసిన కంపెనీలంటే..ఇందాక పైన చెప్పిన పేర్లే విన్పిస్తాయి. మన దేశం నుంచి యోగా, ఆయుర్వేదం, దేవతలు, పూజలు, దేవాలయాలు, సంస్కృతి మాత్రమే చెప్పుకోవాలి. సేవాభావం అనేది మనలో జీర్ణించుకుపోయిన అంశం. ఈ క్రమంలో... ఏ ఉత్పత్తి కొత్తగా తయారు చేయలేదు. ఈ క్రమంలో... ఐటీ ప్రొడక్ట్స్ ఇతర దేశాలు చేస్తే, వాటి సర్వీస్‌ను మనం అందిస్తున్నాం. ఇక పర్యాటకం, ఆతిధ్యం, వైద్య రంగాల్లోనూ ఇదే రకమైన 

ముందంజలో ఉన్నాం. మరి మన దేశపు కంపెనీల గురించి విదేశాల్లో ఉన్నవారికి ఎలా తెలుస్తుంది ? దీనికి సమాధానంగానా అన్నట్లుగా... రిలయన్స్ ఆయిల్ 2 కెమికల్ బిజినెస్‌లో సౌదీ ఆరామ్‌కోతో జట్టు కట్టింది. ఆ చైర్మన్‌ని కూడా బోర్డులోకి తీసుకుంది. ఇదే క్రమంలో... ఆయిల్ రంగంలో ఆర్‌ఐఎల్ తన సామ్రాజ్యాన్ని ఇతర దేశాలకు విస్తరించనుంది. రిటైల్ ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తం చేయడానికే రిలయన్స్ అధినేత ఈ మధ్య వరసగా టేకోవర్లు చేస్తున్నారు. 7లెవన్ అందులో భాగమే, దీనికి ముందు ఫ్యూచర్ రిటైల్ ఈ పాటికి రిలయన్స్ పరం కావాల్సింది. ఇప్పుడా స్థానంలో ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్‌ ఉన్న సెవెన్ లెవన్‌ను ఫ్రాంచైజీ రూపంలో నిర్వహించడం ద్వారా తన విస్తృతి పెంచుకుంది రిలయన్స్. అలానే మనీష్ మల్హోత్రా డిజైనర్ వేర్‌లో వాటా కొనుగోలుతో తమ ఫ్యాషన్ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను  పెంచుకుంది. రీతూ కంపెనీ విషయం కూడా ఇదే జాబితాలోకి వస్తుంది. ఇక... రిటైల్ వస్తువులకు మార్కెటింగ్ విషయానికొస్తే...  40 కోట్లమంది జియో యూజర్లే దానికి పెద్ద బేస్. ఓ వైపు వరల్డ్ టాప్ టెల్కోలలో ఒకటిగా జియో ఆవిర్భవించడం, మరోవైపు తమ ఉత్పత్తులకు ఓ వేదిక ఏర్పాటు చేయడం... జియో ప్లాట్‌ఫామ్ ద్వారా సాధ్యపడుతుంది. అంతేకాకుండా... జస్ట్ డయల్‌ కొనుగోలుతో కస్టమర్ల డేటా బేస్ కూడా అందుబాటులోకి తెచ్చుకుంది. ఈ క్రమంలోనే... ముకేశ్ అంబానీ ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ కంపెనీగా రిలయన్స్ రిటైల్‌ను నిలబెట్టడంలో సఫలమవుతారా ? లేదా ? అన్న విషయం చర్చనీయాంశమైంది.  ఇక డిజిటల్ పేమెంట్ల కోసం ఇప్పటికే అటు రిలయన్స్ రిటైల్, వాట్సాప్ భాగస్వామ్యంతో తమ ఫోన్లపై పేమెంట్ సర్వీస్ కూడా ప్రారంభించిన విషయం తెలిైసిందే. ఈ పరిణామాలన్నీ వ్యాపారంలో భాగమైతే... లండన్ సహా యూకే లోని ఇతర ప్రాంతాల్లో ఖరీదైన విల్లాలు, రిసార్ట్‌లు కొనుగోలుతో ఆతిధ్యరంగంలోనూ రిలయన్స్ తన ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో... ప్రపంచంలో దిగ్గజ కంపెనీలుగా ఉన్న వాల్‌మార్ట్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్‌లకు పోటీగా కాకపోయినా, వాటి సరసన నిలబడగల ఏకైక భారతీయ  కాంగ్లోమెరేట్ కంపెనీగా రిలయన్స్‌ రంగంలో ఉంది. ఈ స్థాయిలో  ఉన్న రిలయన్స్ షేర్లు ఇప్పుడు రూ. పది వేల రేటుకు చేరడం పెద్ద విషయం కాకపోయినప్పటికీ... దీనికి ఎంత సమయం పడుతుందన్నదే  ఇన్వెస్టర్ల ఆసక్తిగా ఉంది. ఎందుకంటే... ఇప్పటివరకు ఇండియన్ కార్పొరేట్ కంపెనీలు ఎదిగిన తీరు వేరు, ఇక్కడినుంచి అవి దూసుకుపోయే వేగం వేరు మరి అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-10-25T04:23:34+05:30 IST