సింహాద్రి దేవాలయంలో లాక్‌డౌన్‌లో అడ్డంగా... నివేదిక ‘వెలుగు’ చూసేనా ?

ABN , First Publish Date - 2020-06-04T18:56:54+05:30 IST

సింహాచలంలో అధికారులు అత్యంత రహస్యంగా పర్యటించి, జరిగిన అవినీతి, అక్రమాల గురించి ఓ సమగ్ర నివేదిక రూపొందించారు.

సింహాద్రి దేవాలయంలో లాక్‌డౌన్‌లో అడ్డంగా... నివేదిక ‘వెలుగు’ చూసేనా ?

అమరావతి : సింహాచలంలో అధికారులు అత్యంత రహస్యంగా పర్యటించి, జరిగిన అవినీతి, అక్రమాల గురించి ఓ సమగ్ర నివేదిక రూపొందించారు. 

ఆ నివేదికలో... సింహాచలం దేవస్థానం పరిధిలో లాక్‌ డౌన్‌ సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అక్రమ నిర్మాణాలపై ఇటీవల విచారణ చేసిన దేవాదాయశాఖ సంయుక్త కమిషనర్‌(ఎస్టేట్స్) చంద్రశేఖర్‌ ఆజాద్‌ బృందం తన నివేదికను దేవాదాయశాఖ కమిషనర్, రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (దేవాదాయశాఖ)కు సమర్పించింది.


ఆజాద్‌ బృందంలో రాజమహేంద్రవరం ప్రాంతీయ సంయుక్త కమిషనర్, విశాఖ ఉప కమిషనర్, సహాయ కమిషనర్‌‌లు ఉన్నారు. కిందటి నెల 18 వ తేదీన ఇక్కడ రహస్యంగా పర్యటించి అనేక అంశాలను పరిశీలించింది. ఈ క్రమంలో... పలు లోపాలు, తప్పిదాలను గుర్తించింది. దేవస్థాన భూముల్లో ఆక్రమణదారులు రెచ్చిపోవడానికి అధికారుల ఉదాసీన వైఖరే కారణమని కుండబద్దలు కొట్టింది. 


దేవస్థాన పాలనా ప్రక్రియకు భంగం కలగకుండా ఉండాలంటే ఈవోను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వానికి సూచించింది. దేవస్థాన భూ పరిరక్షణ విభాగ ఎస్డీసీ శేషశైలజను వెంటనే బదిలీ చేయాలని సిఫారసు చేసింది. 

నివేదికలోని ముఖ్యాంశాలు... సింహాచల దేవస్థానం పరిధిలో లాక్‌‌డౌన్‌ సమయంలో నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి పనులు చేశారు. ఘాట్‌ రోడ్డుకు 250  మీటర్ల దూరంలో భారీగా క్వారీయింగ్‌ చేశారు. గుట్టలను తొలిచేశారు. వీటికి ఎలాంటి అనుమతులూ లేవు. మాస్టర్ ప్లాన్‌లో లేనివాటిని చేయించారు. ప్రణాళిక లేని పనుల వల్ల ఏ క్షణంలోనైనా కొండపైనుంచి బండరాళ్లు జారిపడే ప్రమాదముందని స్థానికులు చెబుతున్నారు. పైగా అక్రమ మైనింగ్‌ను కప్పిపుచ్చేందుకు పాత తేదీలతో అనుమతి పత్రాలను తయారు చేశారని సమాచారం. 

సింహగిరులపై... సింహాచలం దేవస్థానానికి చెందిన సింహగిరులపై లాక్‌‌డౌన్‌ సమయంలో జరిగిన పనులన్నీ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్టు నివేదిక స్పష్టం చేసింది. సింహగిరి ఘాట్‌రోడ్డుకు 250 మీటర్ల దూరంలో భారీగా క్వారీయింగ్‌ జరిగినట్టు కమిటీ గుర్తించింది. కొండ దిగువన ఆంజనేయస్వామి విగ్రహం దాటిన తర్వాత కొత్త టోల్‌‌గేట్‌ నిర్మాణం పేరిట బైపాస్‌ రోడ్డుకు ఆనుకుని ఉన్న గుట్టను పూర్తిగా తొలిచేశారని పేర్కొంది.


గణేశ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ యజమాని కె. శ్రీనివాసరావును దాతగా పేర్కొంటూ గుట్టను చదును చేసేందుకు ఆలయ ఈఓ అనుమతినిచ్చారు. దీనికి కమిషనర్, ఇంజినీరింగ్‌ విభాగం నుంచి అనుమతులు లేవు. ఇక 500 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు, రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తున ఈ తవ్వకం జరిపి చదును చేశారు. చెత్త తొలగింపు పేరిట దాతగా పేర్కొన్న కె. శ్రీనివాసరావు గ్రావెల్‌ మొత్తాన్నీ తరలించారు.


ఈయన సీనరేజీ ఛార్జీలను మైనింగ్‌ శాఖకు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక 1,500 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, మూడు మీటర్ల ఎత్తున ఘాట్ రోడ్డును చదును చేసేందుకు ఈఓ అనుమతించారని కమిషనర్‌కు శ్రీనివాసరావు లేఖ రాశారు. దీనిపై కమిషనర్‌ కార్యాలయం నుంచి సమగ్ర ప్రతిపాదనలు పంపాలని కోరినా ఈఓ స్పందించకుండా ఏకపక్షంగా వ్యవహరించి పనులు జరిపించారని ఆరోపణలున్నాయి. 


గ్రానైట్ తరలిపోయింది... సుమారు రూ. 9 లక్షల విలువైన ఎనిమిది వేల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ తరలిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఇక... 'మాస్టర్‌ ప్లాన్‌'లో లేని పనిని దాతతో ఎలాంటి ఒప్పందం లేకుండా చేయించి, విలువైన గ్రావెల్‌ తరలిపోవడానికి ఈఓనే కారణమని కమిటీ ఎత్తి చూపింది. దీంతో... ఏ క్షణంలోనైనా కొండ చరియలు విరిగిపడే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వెనుకటి తేదీలతో అక్రమ మైనింగ్‌కు అనుమతి ఇచ్చినట్లు ఈఓ రికార్డులను తయారు చేయిస్తున్నారన్న ఆరోపణలకు కొదవే లేదు.


అనాలోచితంగా... సింహగిరిపై ఆలయం వెనుక భాగంలో ఉన్న గిరిజనుల కాటేజీలకు బహిరంగ వేలం వేయాలని, అందుకు రహదారి అవసరమని ఈఓ భావించారు. ఈ క్రమంలోనే... పర్యావరణాన్ని నాశనం చేస్తూ కొండను చదును చేసే పనులు చేపట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటికి అనుమతుల్లేవు. ఇకచిన్న వర్షానికే కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని,  భక్తులు, అర్చకుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని స్థానికులు చెబుతున్నారు. 


రూ.6లక్షల విలువ... హైటెన్షన్‌ విద్యుత్తు లైన్ల కోసం సింహగిరులపై పెద్ద చెట్లను తొలగించేందుకు, మట్టి తవ్వుకునేందుకు ఏపీ ట్రాన్స్‌ కో కాంట్రాక్టరును ఈఓ అనుమతించారు. ఈ క్రమంలో... రూ. 6 లక్షల విలువైన గ్రావెల్‌ తరలిపోయిందని కమిటీ పేర్కొంది. ఆ మొత్తాన్ని సంబంధిత కాంట్రాక్టరు నుంచి దేవస్థానం వసూలు చేయాల్సి ఉంది. 


టెండర్లు ఎలా పిలిచారు ?... కొండపైన కొన్ని ప్రదేశాలను చదును చేసేందుకు కిందటి నెల 16 వ తేదీన టెండర్లను పిలిచారు. ప్రస్తుతం 50 శాతం జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న దేవస్థానం ఈ టెండర్లను ఎలా పిలిచిందన్న సందేహాలు స్థానికుల్లో వెల్లువెత్తుతున్నాయి. 


ఇన్ని అక్రమ నిర్మాణాలా ?... సింహాచల దేవస్థానానికి చెందిన భూముల ఆక్రమణల వివరాలిలా ఉన్నాయి. మారుతి కల్యాణ మంటపం వద్ద 300 గజాల్లో షెడ్డు, ఆరోగ్య కేంద్రం వెనుక 60 గజాల్లో పక్కా భవనం, సాయినగర్‌ కాలనీలో దుకాణ సముదాయం, వేపగుంట దుర్గానగర్, వరలక్ష్మీనగర్, చీమలాపల్లి, వరాహగిరికాలనీ, చింతలగ్రహారం పశువుల ఆసుపత్రి వెనుక, బంగారమ్మ గుడి వద్ద, అక్రమ నిర్మాణాలు జరిగినా దేవస్థానం అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం గతంలో కబ్జా చేసిన ఐదెకరాల స్థలాన్ని గత ఈఓ ఖాళీ చేయించి ఫెన్సింగ్‌ వేయించినా కూడా... దానిని పరిరక్షించడంలో  అధికారులు విఫలమయ్యారన్న విమర్శలకు కొదవే లేదు. 


ఇష్టారాజ్యంగా... తొలిపావంచా వద్ద గత ఈఓ తొలగించిన దుకాణాల స్థానంలో ఇప్పుడు పన్నెండు దుకాణాలను తిరిగి నిర్మించుకునేందుకు ప్రస్తుత ఈఓ అనుమతించారు. దీనికి కమిషనర్‌ అనుమతి లేదు. 'మాస్టర్‌ ప్లాన్‌'కు వ్యతిరేకంగా దేవస్థానం అధికారులు వ్యవహరించారు. ఈ దుకాణాల నుంచి నెలకు రూ. 10 వేల కనీస అద్దెను వసూలు చేయాల్సి ఉందని దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 


Updated Date - 2020-06-04T18:56:54+05:30 IST