‘గౌరవం’ మరో 30%

ABN , First Publish Date - 2021-06-16T09:06:13+05:30 IST

రాష్ట్రంలో గౌరవ వేతనం పొందుతున్న వారందరికీ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది.

‘గౌరవం’ మరో 30%

  • జడ్పీ, ఎంపీటీసీ సభ్యులు, 
  • సర్పంచ్‌లకు వేతన పెంపు
  • కాంట్రాక్టు అధ్యాపకులకు రూ.48,230కు
  • 26వేలకు పెరిగిన హోంగార్డుల వేతనం
  • వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, ఆశావర్కర్లు, అంగన్‌వాడీలు, సెర్ప్‌ సిబ్బందికీ వర్తింపు
  • కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, రోజువారీ కూలీలకూ తీపి కబురు
  • సర్క్యులర్‌ జారీ చేసిన ఆర్థికశాఖ 

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో గౌరవ వేతనం పొందుతున్న వారందరికీ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. వారి వేతనాలను 30 శాతం పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. గౌరవ వేతనాలు పొందుతున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కూడా శుభవార్త చెప్పింది. ప్రస్తుతం పొందుతున్న గౌరవ వేతనాలను 30 శాతం పెంచడానికి ప్రతిపాదనలు పంపించాలని కోరుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం సర్క్యులర్‌ జారీ చేశారు. తదనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సర్పంచ్‌ లు, ఎంపీటీసీ సభ్యులకు రూ.5వేలు, జడ్పీటీసీ సభ్యులకు రూ.10వేలు గౌరవ వేతనంగా ప్రతినెలా అందిస్తున్నారు. ఇవి 30 శాతం మేర పెరగనున్నాయి. కాగా, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంచడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావులకు.... స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇక హోంగార్డ్‌లు, అంగన్‌వాడీ వర్కర్లు /అసిస్టెంట్లు, వీఆర్‌ఏ, వీఓఏ, ఆశా వర్కర్లు, సెర్ప్‌ సిబ్బందికి కూడా 30 శాతం వేతన పెంపును అమలు చేయాలని సూచించారు. వీరికి చెల్లించే వేతనాలకు సంబంధించి ఈ ఫిట్‌మెంట్‌ను అమలుపరుస్తూ బిల్లులను సమర్పించాల్సిందిగా ఆయా విభాగాలకు ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీచేసింది. అలాగే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల 30 శాతం పెంపునకు సంబంధించి కూడా ఉత్తర్వులను జారీ చేశారు. 


పార్ట్‌ టైం వర్కర్లకు.. 

ప్రభుత్వపరమైన పనుల్లో పాల్గొనే రోజువారీ కూలీల వేతనాన్ని కూడా పెంచారు. ఇప్పటివరకు రోజు వారీ కూలీలకు రోజు రూ.300ను చెల్లించే విధానం ఉంది. తాజా నిర్ణయం ప్రకారం ఇక నుంచి ఒక రోజుకు వారికి రూ.390 చెల్లించనున్నారు. అలాగే ఫుల్‌ టైం వర్కర్లకు నెలకు చెల్లించే వేతనం రూ.8వేల నుంచి రూ.10,400కు, పార్ట్‌టైం వర్కర్లకు ప్రస్తుతం ఇస్తున్న వేతనాన్ని రూ.4,000 నుంచి రూ. 5,200కు పెంచారు. పెంచిన భత్యాల నిర్ణయం జూన్‌ నెల నుంచి అమల్లోకి రానుంది. కాగా, స్థానిక సంస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌ ల గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇక 2018 జూలై 1 తర్వాత చేరిన ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేల్‌పై కొత్త పీఆర్సీలో స్పష్టత లేదని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరారు. 



Updated Date - 2021-06-16T09:06:13+05:30 IST