కొవిడ్‌ టీకాకు ని‘బంధనాలు’

ABN , First Publish Date - 2021-04-05T07:59:22+05:30 IST

కొవిడ్‌ టీకా కార్యక్రమాన్ని వేగంగా నిర్వహిద్దామంటే.. కేంద్ర నిబంధనలు అడ్డుగా మారుతున్నాయని రాష్ట్ర సర్కారు భావిస్తోంది.

కొవిడ్‌ టీకాకు ని‘బంధనాలు’

  • కేంద్రం చర్యలతో వ్యాక్సినేషన్‌ వేగానికి అడ్డుకట్ట
  • ఇలా అయితే లక్షిత ప్రజలకు టీకా కష్టమే
  • అందరికీ ఇవ్వాలంటే 7-8 నెలలు పడుతుంది
  • మార్చిలో రోజుకు సగటున 31 వేల మందికి టీకా

పేరడీ పాటలతో టీకా ప్రచారం

టీకా తీసుకుంటే ఏదో అవుతుందన్న భయాందోళనలు ఇప్పటికీ చాలా మందిలో ఉన్న నేపథ్యంలో.. ఆ అపోహలను పోగొట్టేందుకు వ్యాక్సిన్‌పై మరింత విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్రవైద్యశాఖ నిర్ణయించింది. ఇందుకోసం.. ఇప్పటికే టీకా తీసుకున్న వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులున్న వారి అభిప్రాయాలను వీడియో రూపంలో సేకరిస్తోంది. వాటితోపాటు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న పాపులర్‌ జానపద పాటలను టీకా పేరడీ గీతాలుగా రూపొందించే యోచన చేస్తోంది. టీకా తీసుకున్న వారి అభిప్రాయాలతో పాటు జానపద పేరడీ పాటలతో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని భావిస్తోంది.

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ టీకా కార్యక్రమాన్ని వేగంగా నిర్వహిద్దామంటే.. కేంద్ర నిబంధనలు అడ్డుగా మారుతున్నాయని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య పథకాలు అమలు చేసే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నిర్వహించాలని కేంద్రం నిబంధన పెట్టింది. మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులను మినహాయిస్తే ఆరోగ్యశ్రీ, సీజీహెచ్‌ఎస్‌, ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేసే ప్రైవేటు ఆస్పత్రులన్నీ కలిపి 300 దాకా మాత్రమే ఉన్నాయి. ప్రజలేమో ప్రభుత్వ ఆస్పత్రుల కంటే ప్రైవేటు ఆస్పత్రుల్లోనే టీకా వేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అవి తక్కువగా ఉన్నందున వ్యాక్సినేషన్‌ వేగంగా సాగట్లేదు. దీంతో.. రాష్ట్రంలో 20 పడకలు దాటిన ఆస్పత్రులు ఆరు వేల దాకా ఉన్నాయని, వాటన్నింటిలోనూ టీకాలు వేయడానికి అనుమతి ఇవ్వాలని  రాష్ట్ర సర్కారు కేంద్రానికి లేఖ రాసింది.


అలాగే.. కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయులు, బ్యాంకు ఉద్యోగులు, న్యాయవాదులు, డ్రైవర్లు తమకు కూడా వీలైనంత త్వరగా టీకా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని కూడా రాష్ట్ర సర్కారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీంతోపాటు.. తాము ఒకే చోట వేలాది మంది ఉంటాం కాబట్టి తమ వద్దకే వచ్చి వ్యాక్సిన్‌ ఇవ్వాలని గేటెడ్‌ కమ్యూనిటీలు, కాలనీల వారు వైద్యశాఖకు లేఖలు రాస్తున్నారు. మెయిల్స్‌ పెడుతున్నారు. ఇటువంటి వాటి విషయంలో కేంద్రం అనుమతి అవసరం. అయితే కేంద్రం మాత్రం ఈ విషయంలో స్పష్టతనివ్వడం లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి.


లక్ష్యం కన్నా తక్కువగా..

కేంద్రం నిర్ణయించిన టీకా లక్ష్యిత ప్రజల సంఖ్య మన రాష్ట్రంలో కోటి వరకూ ఉంది. కానీ.. మార్చి 1 నుంచి 31 వరకు ఇచ్చింది వారిలో కేవలం 9,79581 మందికే. అంటే రోజుకు సగటున 31 వేలమందికి టీకా ఇచ్చినట్టు. ఈ లెక్కన లక్ష్యిత ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలంటే కనీసం 7-8 నెలలు పడుతుందని వైద్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అన్ని నెలల పాటు వ్యాక్సిన్‌ ఇచ్చే పరిస్థితి లేదని.. కనీసం రోజుకు 2 లక్షల మందికి టీకా వేయగలిగితేనే లక్ష్యాన్ని రెండు నెలల్లో చేరుకోగలమని, వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలమని అంటున్నారు.

 

మొబైల్‌ వ్యాక్సినేషన్‌కూ..

ఇప్పటికీ చాలామందికి వ్యాక్సిన్‌ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల ద్వారా ప్రతి గ్రామంలో ఒక నిర్ణీత రోజు వ్యాక్సినేషన్‌ ఇవ్వాలి. దీనివల్ల ఎక్కువ మంది టీకా తీసుకునే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కంటివెలుగు కార్యక్రమం తరహాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టాలని వారు కోరుతున్నారు.


ఈ నెలలో జోరుగా..

ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రంలో టీకా కార్యక్రమం కాస్త జోరందుకుంది. మార్చిలో రోజుకు సగటున 31 వేలమంది తొలి డోసు తీసుకోగా, ఏప్రిల్‌లో అది 52 వేలకు పెరిగింది. ఏప్రిల్‌ 1 నుంచి అన్ని పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. అలాగే 45 పైబడిన వారందరికీ టీకా అనడంతో టీకా కార్యక్రమం ఊపందుకుంది. శనివారం 867 ప్రభుత్వ, 184 ప్రైవేటు కేంద్రాల్లో 43532 మంది తొలిడోసు తీసుకున్నారు. దీంతో తొలి డోసు తీసుకున్న వారి సంఖ్య రాష్ట్రంలో 11,82,020కు పెరిగింది. రెండో డోసు మరో 10,872 మంది తీసుకోవడంతో ఆ సంఖ్య 2,56,808కి చేరింది.

Updated Date - 2021-04-05T07:59:22+05:30 IST