భూమాయ !

ABN , First Publish Date - 2020-07-03T10:25:51+05:30 IST

ఆళ్లపల్లి మండలంలో కొందరు రెవెన్యూ అధికారుల భూమాయ పలువురిని నివ్వెరపరిచేలా చేస్తోంది.

భూమాయ !

అటవీశాఖ టేకు ప్లాంటేషన్‌కు పట్టా జారీ

284 ఎకరాల్లో గిరిజనేతరులకు పట్టాలిచ్చిన ఓ అధికారి

రూ.2 కోట్ల, 54 లక్షల రైతుబంధు నిధులు స్వాహా

ఆళ్లపల్లి మండలంలో రెవెన్యూ లీలలు 


గుండాల/ఆళ్లపల్లి, జూలై 2: ఆళ్లపల్లి మండలంలో కొందరు రెవెన్యూ అధికారుల భూమాయ పలువురిని నివ్వెరపరిచేలా చేస్తోంది. 284 ఎకరాల భూమికి దొంగ సర్వే నెంబర్లు సృష్టించి పట్టాలు జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పట్టా ఆధారంగా ఈ ఏడాది రూ.2 కోట్ల, 54 లక్షల రైతుబంధు సాయాన్ని కూడా సదరు రైతులు పొందినట్లు సమాచారం. ఆళ్లపల్లి-వెంకటాపురం మార్గంలో లక్ష్మీపురం వద్ద అటవీశాఖాధికారులు వందేళ్ల కిందట టేకు ప్లాంటేషన్‌ చేశారు. అయితే ఆళ్లపల్లికి చెందిన ఓ వ్యాపారి ఆ ఆ భూమిలో టేకు చెట్లను నరికి పోడు వ్యవసాయం చేస్తుండగా అటవీశాఖాధికారులు కేసు పెట్టేందుకు ప్రయత్నించగా సదరు వ్యాపారి తన వద్ద పనిచేసేవారిపై(గిరిజనుల) కేసు నమోదు చేయించినట్లు సమాచారం. తరువాత సదరు వ్యాపారి ఓ రెవెన్యూ అధికారి సాయంతో తన భార్య పేరుతో ఖాతా నెంబరు 4, తండ్రి పేరుతో ఖాతా నెంబరు 3ను తయారు చేయించి పట్టాలు తయారు చేయించాడు. ఆళ్లపల్లి మండలంలో ఓ రిపోర్టర్‌కు ఖాతా నెంబర్‌ 43 సృష్టించి ఐదెకరాలకు పట్టా ఇచ్చారు. టేకు ప్లాంటేషన్‌ నరికిన వ్యాపారికి 368 ఖాతా నెంబర్‌లో 13 ఎకరాల భూమికి పట్టా ఇచ్చారు.


ఆళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన అనేక మంది భూమి లేని వారికి భూమిని సృష్టించిన రెవెన్యూ అధికారి అటవీశాఖ అనుమతులు లేకుండా గిరిజనేతరులకు పట్టా ఏలా ఇచ్చారో నిగ్గు తేల్చాలని గిరిజన రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మరో బడా వ్యాపారి కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులకు సైతం 9ఎకరాలకు పట్టా ఇచ్చారు. ఆళ్లపల్లిలో 2019లో పనిచేసిన తహసీల్దార్‌ అడ్డగోలుగా గిరిజనేతరులకు పట్టాలిచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా సదరు భూములకు కూడా రైతుబంధు వస్తున్నట్లు సమాచారం. టేకు ప్లాంటేషన్‌కు పట్టా ఇచ్చినందుకు సదరు అధికారికి భారీగానే నజరాన ముట్టినట్లు సమాచారం. 484 సర్వే నెంబర్‌లోని భూమి ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ 484 సర్వే నెంబర్‌ను తెలంగాణ మన భూమి వెబ్‌సైట్‌లో పరిశీలిస్తే మాత్రం ఆ భూమి ఆళ్లపల్లి-గుండాల రహదారి పక్కన రిజర్వుడు ఫారెస్టులో ఉన్నట్లు చూపిస్తోంది. 


ఆ భూ వివాదం హైకోర్టులో ఉంది 

ఆళ్లపల్లి మండలంలోని 484 సర్వే నెంబర్‌లోని భూమి రిజర్వుడు ఫారెస్టులో ఉందని, ఆళ్లపల్లి వ్యాపారికి చెందిన భూమి టేకు ప్లాంటేషన్‌కు చెందిందని ఆళ్లపల్లి అటవీశాఖాధికారి నర్సింహరావు స్పష్టం చేశారు. ఆ భూమి రెవెన్యూది అంటూ సదరు వ్యాపారి హైకోర్టులో కేసు వేయగా, ఆ భూమి రిజర్వుడ్‌ ఫారెస్టుకు చెందిందని తాము సైతం హైకోర్టులో కేసు పెట్టినట్లు రేంజర్‌ వివరించారు. ఆళ్లపల్లి మండలంలోని అనేక గ్రామాల్లోని రైతులకు రిజర్వుడు ఫారెస్టు భూమికి, జాయింట్‌ సర్వే నిర్వహించకుండానే రెవెన్యూ అధికారులు విచ్చలవిడిగా పట్టాలు జారి చేసినట్లు తెలిపారు. టేకు ప్లాంటేషన్‌ నరికినందుకు వ్యాపారిపై అటవీశాఖ సైతం కేసు నమోదు చేసిందన్నారు. హైకోర్టులో  భూవివాదం కేసు నడుస్తుండగా, 2019లో పట్టా ఎందుకు ఇచ్చారో పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే విషయమై కొత్తగూడెం ఆర్‌డీవో స్వర్ణలతను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె ఫోన్‌ కట్‌ చేశారు. 

Updated Date - 2020-07-03T10:25:51+05:30 IST