సహకార వ్యవస్థకు పునర్వైభవం

ABN , First Publish Date - 2021-01-01T06:14:40+05:30 IST

సహకార విభాగం ప్రభుత్వంలో అత్యంత కీలక విభాగం. ఈ వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో అపెక్స్ బ్యాంక్ ఉంటుంది...

సహకార వ్యవస్థకు పునర్వైభవం

సహకార వ్యవస్థను పటిష్టం చేసేందుకే మోదీ ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలకు శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‍లు (ఎఫ్‌పిఒ) అత్యంత నిర్ణయాత్మకం కాబోతున్నాయి.


సహకార విభాగం ప్రభుత్వంలో అత్యంత కీలక విభాగం. ఈ వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో అపెక్స్ బ్యాంక్ ఉంటుంది. దిగువ స్థాయిలో అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీలు (ప్రాథమిక సహకార సమితులు) ఉంటాయి. మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 4523 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు రైతులకు ఋణాలు, ఎరువుల పంపిణీ, ధాన్య సేకరణ చేస్తాయి. సహకార వ్యవస్థ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి రైతునూ ప్రభావితం చేస్తుంది. రైతు కూడా ఈ వ్యవస్థమీద ఆధారపడి ఉంటాడు. పలు రాష్ట్రాల్లో ఈ సహకార వ్యవస్థ ద్వారా రైతులు సంపన్నులైనారు. మహారాష్ట్రలో చక్కెర సహకార వ్యవస్థ ద్వారా మరాఠా సమాజం అత్యధికంగా లబ్ధి పొందింది. మహారాష్ట్ర రాజకీయ వ్యవస్థను శాసించే విధంగా అక్కడి సహకార వ్యవస్థ తయారయింది. అదేవిధంగా గుజరాత్‌లో ఆనంద్ మిల్క్ యూజర్స్ అసోసియేషన్ (అమూల్) అనే పాల సహకార వ్యవస్థ దేశానికి ఒక ఆదర్శవంతమైన సహకార వ్యవస్థగా రూపొందటం మనందరికీ తెలుసు.


సహకార వ్యవస్థ మూడు అంచెలుగా పనిచేస్తుంది. ప్రాథమిక సహకార సంస్థలు, వాటిపైన జిల్లా సహకార బ్యాంకు, వీటిన్నిటికీ పైన రాష్ట్ర స్థాయిలో అపెక్స్ బ్యాంకు పని చేస్తాయి. ఈ మూడు అంచెలలో కింద స్థాయిలో వుండే ప్రాథమిక సహకార సంస్థలు మొత్తం వ్యవస్థకు అత్యంత కీలకం. ప్రాథమిక సహకార సంఘాలు ఎంత దృఢమైతే మొత్తం సహకార వ్యవస్థ అంత పటిష్టం అవుతుంది. కానీ కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో సహకార సంఘాలు నిర్మాణాత్మకంగా పనిచేయకపోవడం వల్ల, వాటిని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకోడం వల్ల, బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోయి సహకార వ్యవస్థ కుంటుపడుతోంది. ఎక్కడైతే బ్యాంకులు బయటపడలేని అప్పుల్లో కూరుకుపోయాయో- అక్కడ ప్రాథమిక సహకార సంఘాలు కూడా సరిగ్గా పనిచేయక మొత్తం సహకార వ్యవస్థ నిర్వీర్యమవుతుంది.


భవిష్యత్తులో ఎఫ్.పి.ఒ అంటే- ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‍లు అత్యంత నిర్ణయాత్మకం కాబోతున్నాయి. ఈ ఎఫ్‌పిఒ ప్రాథమిక సహకార సంఘాల కంటే ఆధునికత కలిగిన సంఘాలు. రానున్న మూడేళ్ళలో భారత ప్రభుత్వం 3500 ఎఫ్‌పిఒలను నిలబెట్టబోతోంది. వీటి ద్వారా సహకార వ్యవస్థలో ఎన్నో గొప్ప సంస్కరణలు సాధ్యమవుతాయి. సహకార వ్యవస్థలో ఇప్పటిదాకా ఉన్న లోటుపాట్లను వీటి ద్వారా సరిదిద్దుకోవచ్చు. భారత ప్రభుత్వం ఎఫ్‌పిఒలను ప్రోత్సహించే విధంగా కొత్త ప్యాకేజీలు తీసుకువచ్చింది. రైతులు ఎఫ్‌పిఒల ద్వారా ప్రైవేటు సంస్థలతో, కార్పొరేట్లతో సమిష్టి బేరసారాలు జరుపుకొని తమ ఉత్పత్తిని అత్యధిక ధరకు అమ్ముకోవచ్చు. 


ఇదే దిశలో ప్రభుత్వం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎఐఎఫ్) తీసుకువచ్చింది. ఇది వ్యవసాయరంగ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‍‍ను అభివృద్ధి చేయటానికి పెద్దపీట వేస్తుంది. ఎఐఎఫ్ ద్వారా మోదీ ప్రభుత్వం ఫైనాన్సింగ్ సౌకర్యం, వ్యవసాయ-గేట్ & అగ్రిగేషన్ పాయింట్ల వద్ద వ్యవసాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి లక్ష కోట్లను మంజూరు చేస్తుంది. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎ.ఐ.ఎఫ్ను ప్రోత్సహిస్తున్నాయి.


మినీ ప్రజాస్వామ్యం వంటి సహకార వ్యవస్థను పటిష్టం చేసేందుకే మోదీ ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలకు శ్రీకారం చుట్టింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ (SHGs), ఎఫ్‌పి.ఒ వంటి నవీన ఆలోచనలు సహకార వ్యవస్థని మరింత పటిష్టం చేస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తుల కంటే పరస్పర సహకారపు ఆలోచనలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వ్యక్తులు ఎన్నడూ వ్యవస్థకు పరిపూర్ణత తీసుకురాలేరు. కానీ వ్యక్తుల సమూహం అయినటువంటి సహకార వ్యవస్థ మార్పు తీసుకురాగలదు. ఒక వ్యక్తి నిర్ణయం కంటే వ్యక్తుల సమూహమే సరియైన నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. సమూహ సహకార నిర్ణయాలు తప్పక సమాజానికి దిక్సూచి అవుతాయి. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు తప్పక చరిత్ర సృష్టిస్తాయి.

పరికిపండ్ల నరహరి

మేనేజింగ్ డైరెక్టర్‌, మధ్యప్రదేశ్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్

Updated Date - 2021-01-01T06:14:40+05:30 IST