బెదరం.. వదలం!

ABN , First Publish Date - 2021-06-06T05:55:55+05:30 IST

ముఖ్యమంత్రిగా జగన్‌ రెడ్డి బెయిల్‌ షరతులను ఉల్లంఘిస్తున్నందున ఆయనకు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని రఘురాజు దాఖలు చేసిన పిటిషన్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ పిటిషన్‌ వేసినందునే రఘురాజును....

బెదరం.. వదలం!

ముఖ్యమంత్రిగా జగన్‌ రెడ్డి బెయిల్‌ షరతులను ఉల్లంఘిస్తున్నందున ఆయనకు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని రఘురాజు దాఖలు చేసిన పిటిషన్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ పిటిషన్‌ వేసినందునే రఘురాజును అరెస్టు చేసి కస్టడీలో కొట్టించారన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. బెయిలు షరతులను జగన్‌ రెడ్డి ఉల్లంఘిస్తున్నారనడానికి తనకు ఎదురైన అనుభవమే ఉదాహరణ అని రేపు సీబీఐ కోర్టులో రఘురాజు చెప్పుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా సీబీఐ కేసుల్లో సహ నిందితులుగా ఉన్నవారికి జగన్‌ తన ప్రభుత్వంలో ఎలా పెద్ద పీట వేసిందీ, గతంలో ఈ కేసులలో ఆదాయపు పన్ను శాఖ అధికారిగా విచారణ జరిపిన జాస్తి కృష్ణ కిషోర్‌ను ముఖ్యమంత్రి అయ్యాక జగన్‌ రెడ్డి ఎలా వేధించిందీ కోర్టుకు వివరించడానికి న్యాయవాదులు సిద్ధపడుతున్నారు.ఈ నేపథ్యంలో జగన్‌ రెడ్డికి బెయిలు రద్దవుతుందా? లేక రఘురాజు పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.


జగన్‌ ప్రభుత్వ దుర్నీతి గురించి ఇప్పుడు జాతీయస్థాయిలో కూడా అందరికీ తెలిసొచ్చింది. ఫలితంగానే ఏబీఎన్‌ దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. జగన్‌ ప్రభుత్వం మాపై పెట్టిన కేసును ఇవాళ కాకపోయినా రేపైనా కొట్టేయొచ్చు. జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పు తర్వాత మాపై పెట్టిన కేసు ఇప్పటికే చెల్లకుండా పోయిందని భావించవచ్చు. కేసు కొట్టివేసినంత మాత్రాన మేం సంతృప్తి చెందబోవడం లేదు. మాపై తప్పుడు కేసు పెట్టిన సీఐడీ అధికారులతో పాటు వారి వెనుక ఉన్న వారినీ న్యాయస్థానం ముందు నిందితులుగా నిలబెడతాం. తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై కేసు పెట్టడానికి చట్టంలో కల్పించిన వెసులుబాటును నేను ఉపయోగించుకోబోతున్నాను. పై నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పి అడ్డమైన కేసులు పెట్టి వేధించే అధికారులకు ఈ చర్య ఒక గుణపాఠం కావాలి. ఏబీఎన్‌పై కేసు పెట్టిన ప్రతి అధికారినీ, వారిని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి సహా ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా బాధ్యులను చేసి కేసు పెట్టబోతున్నాం.


నియంతల చర్యల వల్ల అనర్థాలతో పాటు అప్పుడప్పుడూ మంచి కూడా జరుగుతుందేమో! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నియంతృత్వ పోకడల పుణ్యమా అని మీడియాకు ఇంతకాలానికి గొప్ప ఉపశమనం లభించింది. పాత్రికేయులపై ఎడాపెడా రాజద్రోహం కేసులు పెట్టడం ఇకపై చెల్లబోదని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజుతో పాటు ఏబీఎన్‌, టీవీ5 చానళ్లపై జగన్‌ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టడంతో, ఈ చర్యను నిరసిస్తూ ఏబీఎన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సెక్షన్‌ 124–ఏ సంగతి తేలుస్తామని జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన రెండు రోజులకే జస్టిస్‌ యుయు లలిత్‌ నేతృత్వంలోని మరో ధర్మాసనం వినోద్‌ దువా దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు ఇస్తూ 124–ఏ కింద జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు పెట్టడం చెల్లదని విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. దీంతో పాత్రికేయ ప్రపంచానికి ఎంతో ఊరట లభించింది.


ఏబీఎన్‌ దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు న్యాయ కోవిదులందరూ మద్దతు ప్రకటించారు. దీన్నిబట్టి సెక్షన్‌ 124–ఏను వివిధ ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయన్న అభిప్రాయం అందరిలోనూ ఉందని భావించాల్సి ఉంది. జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం మరో అడుగు ముందుకేసి ఈ రాజద్రోహం కేసుల నుంచి జర్నలిస్టులకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో మీడియా సంస్థలను, జర్నలిస్టులను లొంగదీసుకోవాలనుకునే ప్రభుత్వాలకు ముకుతాడు వేసినట్టయింది. చరిత్రాత్మకమైన ఈ రెండు ఆదేశాలను జారీ చేసిన న్యాయమూర్తులు ఇరువురూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులు కాబోయే వారే కావడం విశేషం. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ పదవీ విరమణ తర్వాత జస్టిస్‌ యుయు లలిత్‌ ప్రధాన న్యాయమూర్తి అవుతారు. అయితే ఆయన మూడు నెలలు మాత్రమే ఈ పదవిలో ఉంటారు.


జస్టిస్‌ లలిత్‌ తర్వాత జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ ప్రధాన న్యాయమూర్తి అవుతారు. ఆయన దాదాపు రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. జగన్‌ ప్రభుత్వం రెండు చానళ్లపై రాజద్రోహం కేసు పెట్టి ఉండకపోతే సెక్షన్‌ 124–ఏ ఇప్పుడు సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చి ఉండేది కాదేమో! రాజ్యాంగాన్ని ఆమోదించుకుని దేశాన్ని గణతంత్ర దేశంగా ప్రకటించుకున్న 1950లోనే ఈ సెక్షన్‌ కింద కేసులు పెట్టడం విశేషం. తెల్ల కుక్కలు(బ్రిటిష్‌ వాళ్లు) పోయి ఇప్పుడు సీఐడీ కుక్కలు మనల్ని చుట్టుముడుతున్నాయని విమర్శలు చేసినందుకు ఉత్తరప్రదేశ్‌లో అప్పట్లోనే ఈ కేసు పెట్టారు. సెక్షన్‌ 124–ఏను తీవ్రంగా ఆక్షేపించిన జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఈ సెక్షన్‌ దుర్వినియోగం కావడం గమనార్హం. కాలం గడిచేకొద్దీ ఆ సెక్షన్‌ను దుర్వినియోగం చేయడం పెరిగిపోయింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమను విమర్శించే వారిపై కేసులు పెట్టడం ఫ్యాషన్‌గా మారింది.


వ్యక్తి పూజ మూలంగానే!

ప్రజాస్వామ్యంలో నియంతలు అధికారంలోకి వచ్చినప్పుడల్లా సెక్షన్‌ 124–ఏ మరింతగా దుర్వినియోగం అవుతూనే ఉంది. ప్రజాస్వామ్యంలో వ్యక్తి ఆరాధన చొరబడినప్పుడు అది నియంతృత్వ పాలనకు దారితీస్తుందని అంబేద్కర్‌ ఎప్పుడో హెచ్చరించారు. ఇందిరాగాంధీ హయాంలో వ్యక్తిపూజ పరాకాష్ఠకు చేరింది. ఫలితంగా దేశ ప్రజలు ఎమర్జెన్సీ చీకటి రోజులను అనుభవించారు. ఆ తర్వాత ఇన్నాళ్లకు కేంద్రంలో మళ్లీ వ్యక్తి ఆరాధన ఛాయలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతాపార్టీని ప్రధాని నరేంద్ర మోదీ జాతీయస్థాయి ప్రాంతీయపార్టీగా మార్చేశారు. అధికారాలన్నీ మోదీ వద్ద కేంద్రీకృతం కావడంతో మంత్రులు డమ్మీగా మారిపోయారు. తెలుగు రాష్ర్టాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి తమను తాము నియంతలుగా భావించుకుంటున్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులూ తమ మనసులో ఏమనుకుంటే అదే ప్రభుత్వ నిర్ణయం అయిపోతోంది. మంత్రులు, ఇతర వ్యవస్థలు నిమిత్తమాత్రంగా మిగిలిపోవడం వాస్తవం. ముఖ్యమంత్రులు నంది అంటే నంది, పంది అంటే పంది అని ప్రభుత్వ యంత్రాంగం తలూపాల్సిన పరిస్థితి ఏర్పడింది.


‘‘మెజారిటీ ప్రజలు ఆమోదించారని చెప్పినంత మాత్రాన అబద్ధం నిజం కాబోదు. తప్పు ఒప్పు కాబోదు. చెడు మంచి కాదు’’ అని రిక్‌ వారెన్‌ ఎప్పుడో చెప్పారు. ప్రజలు తమకు అధికారం అప్పగించారు కనుక తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని కేసీఆర్‌, జగన్‌ రెడ్డి నమ్ముతున్నారు. తమ నిర్ణయాలను, విధానాలను విమర్శించే వారిపై పగబడుతున్నారు. ఈ విషయంలో జగన్‌ రెడ్డికి వేరెవరూ సాటిరారు. రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు వల్ల బెయిలు మీద విడుదలై తాను ముఖ్యమంత్రి కాగలిగానన్న విషయాన్ని కూడా విస్మరిస్తున్న జగన్‌ రెడ్డి, తనకు బెయిలు ఇచ్చిన న్యాయ వ్యవస్థపైనే దాడికి తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసు వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని తనను విమర్శించే వారిని కేసుల్లో ఇరికిస్తున్నారు. ప్రత్యర్థులను జైలుకు పంపడానికి తహతహలాడుతున్నారు.


అహం హద్దులు దాటడంతో తనకు కంట్లో నలుసుగా మారిన ఎంపీ రఘురామకృష్ణంరాజుతో పాటు ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాలను ప్రసారం చేసిన ఏబీఎన్‌ సహా మరో చానల్‌పై రాజద్రోహం కేసులు పెట్టారు. సీఐడీ అధికారులు తమంతట తాముగా నమోదు చేసిన ఈ కేసుతో తనకేమి సంబంధం అని ముఖ్యమంత్రి జగన్‌ అడగొచ్చుగానీ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్టుగా, ఆయన అనుమతి లేకుండానే సీఐడీ అదనపు డిజి సునీల్‌ కుమార్‌ ఈ విషయంలో చొరవ తీసుకోగలరా? రఘురాజుపై కేసు పెట్టి అరెస్టు చేయడం ఒక ఎత్తయితే పోలీసు కస్టడీలో ఆయనను కొట్టడం ప్రభుత్వ దమనకాండకు పరాకాష్ఠ. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో ఆంధ్రా ప్రాంతంలో బలంగా ఉండిన కమ్యూనిస్టు పార్టీని అణచివేయడానికి మలబార్‌ పోలీసులను అప్పటి ప్రభుత్వాలు రంగంలోకి దించాయి. కమ్యూనిస్టులు, వారి సానుభూతిపరులపై ఈ మలబార్‌ పోలీసులు దాడులు చేసి దొరికినవారిని దొరికినట్టు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సీఐడీ పోలీసులు నాటి మలబార్‌ పోలీసులను తలపిస్తున్నారు.


బోనెక్కిస్తాం!

ఏది ఏమైనా జగన్‌ ప్రభుత్వ దుర్నీతి గురించి ఇప్పుడు జాతీయస్థాయిలో కూడా అందరికీ తెలిసొచ్చింది. ఫలితంగానే ఏబీఎన్‌ దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. జగన్‌ ప్రభుత్వం మాపై పెట్టిన కేసును ఇవాళ కాకపోయినా రేపైనా కొట్టేయొచ్చు. జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పు తర్వాత మాపై పెట్టిన కేసు ఇప్పటికే చెల్లకుండా పోయిందని భావించవచ్చు. కేసు కొట్టివేసినంత మాత్రాన మేం సంతృప్తి చెందబోవడం లేదు. మాపై తప్పుడు కేసు పెట్టిన సీఐడీ అధికారులతో పాటు వారి వెనుక ఉన్న వారినీ న్యాయస్థానం ముందు నిందితులుగా నిలబెడతాం. తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై కేసు పెట్టడానికి చట్టంలో కల్పించిన వెసులుబాటును నేను ఉపయోగించుకోబోతున్నాను. పై నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పి అడ్డమైన కేసులు పెట్టి వేధించే అధికారులకు ఈ చర్య ఒక గుణపాఠం కావాలి.


ఏబీఎన్‌పై కేసు పెట్టిన ప్రతి అధికారినీ, వారిని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి సహా ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా బాధ్యులను చేసి కేసు పెట్టబోతున్నాం. దీంతో అయినా అమాయకులపై కేసులు పెట్టి వేధించే విధానానికి ముగింపు వస్తుందని ఆశిస్తున్నాం. రాజద్రోహం కేసులో సుప్రీంకోర్టు తీర్పులు జగన్‌ అధీనంలోని నీలి మీడియాలో ప్రసారానికీ, ప్రచురణకూ నోచుకోలేదు. జాతీయస్థాయిలో ప్రధాన పత్రికలన్నీ ప్రధాన శీర్షికలుగా ప్రచురించిన వార్తలకు కనీస చోటు కల్పించని వారు ఇతర మీడియాను ‘ఎల్లో’ అని నిందించడం దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది. నిరంకుశ పోకడలకు ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్‌ వేస్తారు. ఇప్పుడు జగన్‌ రెడ్డి ప్రభుత్వ అరాచకాలకు, వాటికి వత్తాసు పలుకుతున్న అధికారులకు బ్రేకులు పడే సమయం ఆసన్నమైంది. ప్రజలు అధికారం ఇచ్చేది ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి కాదని జగన్‌ అండ్‌ కో త్వరలోనే గుర్తిస్తారని ఆశిద్దాం. తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ రెడ్డి ఇప్పటికే జాతీయ రాజకీయాలలో పలుచనైపోయారు. జాతీయస్థాయిలో బీజేపీని ఎదిరించడం కోసం ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానని చెప్పి వివిధ రాష్ర్టాలు తిరిగి వచ్చిన కేసీఆర్‌ ఆ తర్వాత ఇకపై ‘కేంద్రంతో యుద్ధమే’ అని ప్రకటించి ఇప్పుడు తనకేమీ గుర్తులేనట్టు నటిస్తున్నారు. దీంతో జాతీయస్థాయిలో ఆయన నవ్వులపాలయ్యారు. ఇక జగన్‌ రెడ్డి విషయానికి వస్తే, ఆయనపై ఉన్న కేసుల కారణంగా జాతీయస్థాయి నాయకుల్లో ఇప్పటికే సదభిప్రాయం లేదు. ఈ నేపథ్యంలోనే ఆ మధ్య జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను తప్పుబట్టడానికి ప్రయత్నించి జగన్‌ రెడ్డి చివాట్లు తిన్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ల విషయంలో ముఖ్యమంత్రులు అందరూ కేంద్ర ప్రభుత్వంతో కలసి నడవాలని సూచించడం ద్వారా మరోమారు నవ్వులపాలయ్యారు.


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అండగా నిలబడే ప్రయత్నం చేసిన ప్రతిసారీ ఆయనకు పరాభవం ఎదురవుతోంది. బెయిలు రద్దవుతుందన్న భయంతో కేంద్రానికి జగన్‌ రెడ్డి మద్దతు ఇస్తున్నారని పలువురు వ్యంగ్యాస్ర్తాలు విసురుతున్నారు. ఫలితంగా జాతీయస్థాయిలో నేనున్నానని చెప్పుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఆయన అభాసుపాలు అవుతున్నారు. జగన్‌ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థిస్తారా? అని ఒక జాతీయ ఆంగ్లప్రతిక గతంలో పెట్టిన ఆన్‌లైన్‌ పోల్‌లో 80 శాతం మంది వ్యతిరేకించారు. అయినా ‘నా ఓటర్లు’ వేరు అని భావించే జగన్‌ రెడ్డికి ఇలాంటి ప్రజాభిప్రాయాలు పట్టకపోవచ్చు.


అందుకే కాళ్లబేరం!

నేనేం చేసినా చెల్లుబాటు అవుతుందని భావిస్తున్న జగన్‌ రెడ్డికి ఇప్పుడు మొదటిసారిగా రెబల్‌ ఎంపీ రఘురామరాజు, ఏబీఎన్‌ కారణంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ‘కుయుక్తులతో, రాజకీయ వ్యూహాలతో చంద్రబాబునే ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నాకు రఘురాజు ఒక లెక్కా’ అని అనుకుంటున్న జగన్‌ రెడ్డికి ఇప్పుడు తత్వం బోధపడుతుండవచ్చు. ఢిల్లీలో కూర్చుని జగన్‌ ప్రభుత్వ పరువు ప్రతిష్ఠలను రఘురాజు దెబ్బతీస్తున్నారు. సీఐడీ అధికారులు కస్టడీలో ఉన్నప్పుడు తనను ఎలా చిత్రహింసలకు గురిచేసిందీ వివరిస్తూ రఘురాజు వివిధ పార్టీల ఎంపీలందరికీ లేఖలు రాశారు. దీనిపై పలువురు ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ ట్వీట్లు చేశారు. జగన్‌ పాలన హిట్లర్‌ పాలనను మరపిస్తున్నదని కాంగ్రెస్‌ ఎంపీ మాణికం ఠాగూర్‌ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా జగన్‌ రెడ్డి బెయిల్‌ షరతులను ఉల్లంఘిస్తున్నందున ఆయనకు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని రఘురాజు దాఖలు చేసిన పిటిషన్‌ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ పిటిషన్‌ వేసినందునే రఘురాజును అరెస్టు చేసి కస్టడీలో కొట్టించారన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది.


బెయిలు షరతులను జగన్‌ రెడ్డి ఉల్లంఘిస్తున్నారనడానికి తనకు ఎదురైన అనుభవమే ఉదాహరణ అని రేపు సీబీఐ కోర్టులో రఘురాజు చెప్పుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా సీబీఐ కేసుల్లో సహ నిందితులుగా ఉన్నవారికి జగన్‌ తన ప్రభుత్వంలో ఎలా పెద్ద పీట వేసిందీ, గతంలో ఈ కేసులలో ఆదాయపు పన్ను శాఖ అధికారిగా విచారణ జరిపిన జాస్తి కృష్ణ కిషోర్‌ను ముఖ్యమంత్రి అయ్యాక జగన్‌ రెడ్డి ఎలా వేధించిందీ కోర్టుకు వివరించడానికి న్యాయవాదులు సిద్ధపడుతున్నారు. తన బెయిలు రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌కు సమాధానం ఇవ్వవలసిన జగన్‌ రెడ్డి, పిటిషన్‌ దాఖలు చేసిన రఘురాజుపై ఎన్ని కేసులు ఉన్నాయో పేర్కొంటూ మాత్రమే అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్‌ రెడ్డికి బెయిలు రద్దవుతుందా? లేక రఘురాజు పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. సాక్షులను మాత్రమే కాదు, కేసులతో సంబంధం ఉన్న ఎవరినీ ప్రభావితం చేయకూడదని బెయిలు మంజూరు సందర్భంగా నాటి న్యాయమూర్తి షరతు విధించడం గమనార్హం.


ఈ వ్యవహారంలో సీబీఐ అధికారులు తటస్థ వైఖరి తీసుకున్నారు. ఢిల్లీ పెద్దల సహకారంతో జగన్‌కు ఈ మేరకు ఉపశమనం లభించిందని పలువురు భావిస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు కాళ్ల బేరానికి దిగి బెయిలు పొందిన జగన్‌ రెడ్డి ఇప్పుడు ఆ బెయిలును రద్దు చేయాలని సీబీఐ కోరకుండా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పెద్దలకు గులాంగిరీ చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు సోనియాగాంధీని విమర్శించే సాహసం చేయని జగన్‌ రెడ్డి, ఇప్పుడు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలను విమర్శించే సాహసం చేయలేకపోతున్నారు. 


తమిళనాడు తరహా ప్రయోగం!?

జగన్‌ రెడ్డికి ప్రస్తుత పరిస్థితి కల్పించిన ఖ్యాతి మాత్రం రఘురాజుకే దక్కుతుంది. కొరివితో తల గోక్కున్నట్టుగా ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే జగన్‌ రెడ్డి పెట్టుకున్నారు. నిజానికి జగన్‌, రఘురాజు మధ్య విభేదాలు ఈనాటివి కావు. 2014 ఎన్నికలకు ముందే నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలనుకున్న తన నుంచి జగన్‌ రెడ్డి భారీ మొత్తం తీసుకున్నాడని, ఆ తర్వాత తమ మధ్య విభేదాలు రావడంతో ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని తాను కోరినా జగన్‌ పట్టించుకోలేదని ఒక దశలో రఘురాజు ఆరోపించారు. ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాలు జరిగి అదే రఘురాజుకు నర్సాపురం టికెట్‌ను 2019లో అదే జగన్‌ రెడ్డి కేటాయించారు. ఎంపీగా ఎన్నికైన ఏడాదికే జగన్‌తో విభేదాలు రావడంతో రఘురాజు విమర్శలు మొదలెట్టారు. ఒక ఎంపీగా ఉన్న తనకు జగన్‌ రెడ్డి కనీస గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదన్నది ఆయన వాదన. ఈ విభేదాలు చినికిచినికి గాలివానగా మారి జగన్‌పై ప్రతిరోజూ విమర్శలకు రఘు పూనుకున్నారు. తాను టికెట్‌ ఇస్తే గెలిచిన వ్యక్తి తనను విమర్శించడం ఏమిటన్న అహంతో గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్న జగన్‌ రెడ్డి ఇప్పుడు జాతీయ స్థాయిలో అభాసుపాలు అవుతున్నారు.


రఘురాజు శక్తి సామర్థ్యాలను ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి మాత్రమే కాదు సీఐడీ అధికారులు కూడా తక్కువగా అంచనా వేశారు. ఫలితంగానే ఏబీఎన్‌, టీవీ5 చానళ్లపై కూడా రాజద్రోహం కేసు పెట్టారు. రాజద్రోహానికి పాల్పడే వ్యక్తికి జగన్‌ రెడ్డి పార్టీ టికెట్‌ ఎలా ఇచ్చారు? ఎందుకిచ్చారు? రఘురాజు ఆరోపించినట్టుగా గతంలో ఆయన దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించని విషయం వాస్తవమా కాదా? ఈ ప్రశ్నలకు జగన్‌ రెడ్డి జవాబు చెప్పవలసి ఉంటుంది. చేతిలో అధికారం ఉంది కదా అని విర్రవీగితే ఏం జరుగుతుందో సుప్రీంకోర్టు తీర్పులే చెబుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇరుక్కున్న సునీల్‌ కుమార్‌ అండ్‌ కోను జగన్‌ రెడ్డి కాపాడతారా? బెయిలు రద్దయితే మళ్లీ జైలుకు వెళ్లే జగన్‌ రెడ్డి కళ్లలో ఆనందం చూడ్డానికి అడ్డమైన పనులు చేసే అధికారులకు ఈ కేసు ఒక గుణపాఠం కాదా? సుప్రీంకోర్టు తాజా తీర్పు తర్వాత నీలిమూక నోళ్లు కూడా మూతపడ్డాయి. అణచివేత హద్దులు మీరినప్పుడు ప్రతిఘటన తప్పదు. ఆంధ్రప్రదేశ్‌ అనేది ఒక స్వతంత్ర రాజ్యమని, తాను ఒక రాజునని భావిస్తున్న జగన్‌ రెడ్డికి ‘నీది ఒక రాష్ట్రం. నువ్వు ముఖ్యమంత్రి అయినా వ్యవస్థలో భాగం మాత్రమే’ అని న్యాయవ్యవస్థ పదే పదే గుర్తుచేస్తూ ఉండటం ఆయనకు చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. అయినా ‘నా ఓటర్లు వేరు– నా అధికారాన్ని ఎవరూ అడ్డుకోలేరు’ అన్నట్టుగా సాగుతూ వచ్చిన జగన్‌ రెడ్డికి ఇపుడు బెయిల్‌ రద్దు గండం పొంచి ఉంది. అసత్యాలను సత్యాలుగా నమ్మిస్తూ ఇంతకాలం ఎదురులేనట్టుగా సాగిన జగన్‌కు చెక్స్‌ అండ్‌ బేలన్స్‌ కోసం ఇతర వ్యవస్థలు కూడా ఉన్నాయని గుర్తుకువస్తున్నది ఇప్పుడు. ఎంతటి బలమైన నాయకుడికైనా పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగా ఉండవు. ప్రస్తుతానికి జగన్‌కు సహకరిస్తున్న ఢిల్లీ పెద్దలు అదను కోసం ఎదురుచూస్తున్నారు.


జగన్‌కు అవినీతి కేసులో శిక్ష పడితే తమిళనాడు తరహా ప్రయోగాన్ని అమలు చేయాలన్న ఆలోచనతో కమలనాథులు ఉన్నారని చెబుతున్నారు. జగన్‌తో ఆయన సోదరి షర్మిల తీవ్రంగా విభేదించి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఢిల్లీ పెద్దలు ఆమెను చేరదీసే అవకాశం లేకపోలేదు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వస్తే భార్య భారతిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడతానని జగన్‌ రెడ్డి తన సన్నిహితులకు చెబుతున్నారు. అయితే కమలనాథుల ఆలోచన మరో రకంగా ఉందంటున్నారు. అన్నాడీఎంకేను శశికళ చేతుల్లోంచి తప్పించినట్టుగానే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని కూడా జగన్‌ రెడ్డి కోరుకుంటున్నట్టుగా కాకుండా షర్మిలకు అప్పగించడానికి వ్యూహరచన చేస్తున్నారని ఢిల్లీ వర్గాల భోగట్టా. ధిక్కారమును సైతునా అని భావించే జగన్‌ రెడ్డి నిజంగా అటువంటి పరిస్థితి ఏర్పడితే పార్టీని ఎలా కాపాడుకుంటారో వేచిచూడాలి. నియంతృత్వ పోకడలతో దారితప్పిన నాయకులను కట్టడి చేయడానికి సొంత ఇంట్లోనే కుంపట్లు వెలియడం అసాధారణం ఏమీ కాదు.


రెండేళ్ల అధికారం తర్వాత జగన్‌ రెడ్డికి ఇంటా బయటా శత్రువులు పెరిగిపోతున్నారు. ఇవాళ రఘురాజు వంతు. రేపు మరొకరి వంతు రావొచ్చు. ఇలాంటి సందర్భాలలోనే ప్రతిఘటన ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది. చట్టాలు, నిబంధనలతో నిమిత్తం లేకుండా పైనుంచి వచ్చే ఆదేశాలను శిరసావహిస్తూ కేసులు పెడుతున్న పోలీసు అధికారులపై ఎదురు కేసులు పెట్టడానికి ఏబీఎన్‌ మాత్రమే కాదు, ఇంకెందరో సమాయత్తమవుతున్నారు. సొంత పార్టీ నాయకులలో పలువురు ఇప్పటికే జగన్‌ రెడ్డి పోకడలను అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఎప్పుడైనా వికటించవచ్చు. గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా ఎదురుతిరుగుతుంది. రఘురాజును ఇప్పుడు హింసించామని ఆనందపడుతూ ఉండొచ్చు. రేపు మరొకరిని టార్గెట్‌ చేయవచ్చు. అయితే ఇవాళ కాకపోయినా రేపైనా అందరి లెక్కలూ సెటిలవుతాయి. జగన్‌ అండ్‌ కో ఇందుకు సిద్ధంగా ఉంటుందా!



ఆర్కే


యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం

QR Code scan చేయండి

Updated Date - 2021-06-06T05:55:55+05:30 IST