సూపర్ ఓవర్‌లో ఇషాన్ కిషన్‌ను అందుకే బ్యాటింగ్‌కు పంపలేదు: రోహిత్

ABN , First Publish Date - 2020-09-29T22:42:07+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ నరాలను తెంపేసింది.

సూపర్ ఓవర్‌లో ఇషాన్ కిషన్‌ను అందుకే బ్యాటింగ్‌కు పంపలేదు: రోహిత్

దుబాయ్: ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ నరాలను తెంపేసింది. ఐపీఎల్‌లోని అసలైన మజాను అందించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌ సూపర్ ఓవర్‌కు దారితీసింది. చివరికి కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు జట్టు విజయం సాధించింది. భారీ హిట్టర్లు ఉన్న ముంబై జట్టు సూపర్ ఓవర్‌లో ఏడు పరుగులు మాత్రమే సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 


ఈ మ్యాచ్‌లో 58 బంతుల్లో 99 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్సయిన ఇషాన్ కిషన్‌ను సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దింపి ఉంటే ముంబై పరిస్థితి మరోలా ఉండేదంటూ వస్తున్న వార్తలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. మ్యాచ్‌ను మలుపుతిప్పిన ఇషాన్ కిషన్ చివరి ఓవర్‌లో అవుటయ్యాడు. అతడు బాగా అలసిపోయి ఉండడంతోనే  బ్యాటింగ్‌కు పంపలేదని రోహిత్ పేర్కొన్నాడు. దీంతో హార్దిక్ పాండ్యాను పంపామని, అతడైతే బంతులను బౌండరీలకు తరలించగలడని భావించినట్టు చెప్పాడు. అదో గొప్ప మ్యాచ్ అని పేర్కొన్నాడు. తాము బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఆశలు లేవని, అయితే, చేజారిందనుకున్న ఆటను ఇషాంత్ మళ్లీ నిలెబట్టాడని రోహిత్ ప్రశంసించాడు. 

Updated Date - 2020-09-29T22:42:07+05:30 IST