Abn logo
Oct 12 2021 @ 01:15AM

బెంగళూరు.. మరో‘సారీ’

క్వాలిఫయర్‌-2కు కోల్‌కతా

నరైన్‌ ఆల్‌రౌండ్‌ షో


ఎదుర్కొన్న తొలి మూడు బంతులను సిక్సర్లుగా బాదిన తొలి ఐపీఎల్‌ ఆటగాడిగా సునీల్‌ నరైన్‌

 ఓ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రావో సరసన హర్షల్‌ పటేల్‌ (32)


షార్జా: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కథ ముగిసింది. విరాట్‌ కోహ్లీ చివరి కెప్టెన్సీలోనూ ఈ జట్టు రాత మారలేదు. ఆరంభ మ్యాచ్‌ల్లో చూపిన జోరును అత్యంత కీలకమైన మ్యాచ్‌లో పునరావృతం చేయలేకపోయింది. అయితే వారి ఓటమికి ప్రధాన కారణం కోల్‌కతా స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ (4-0-21-4, 15 బంతుల్లో 3 సిక్సర్లతో 26) ఆల్‌రౌండ్‌ షో. ఆర్‌సీబీ ప్రధాన బ్యాటర్స్‌ భరత్‌, కోహ్లీ, డివిల్లీర్స్‌, మ్యాక్స్‌వెల్‌ వికెట్లను తీసిన నరైన్‌.. బ్యాటింగ్‌లోనూ చేసిన పరుగులే కీలకమయ్యాయి. దీంతో సోమవారం జరిగిన ఈ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. బుధవారం జరిగే రెండో క్వాలిఫయర్‌లో ఢిల్లీతో మోర్గాన్‌ సేన తలపడుతుంది. గెలిచిన జట్టు చెన్నైతో ఫైనల్లో తలపడుతుంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులు చేసింది. కోహ్లీ (39), దేవ్‌దత్‌ (21) ఓ మాదిరిగా రాణించారు. ఫెర్గూసన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో కోల్‌కతా 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 139 పరుగులు చేసి గెలిచింది. సిరాజ్‌, హర్షల్‌, చాహల్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నరైన్‌ నిలిచాడు.


గిల్‌, నరైన్‌ అండతో..:

స్వల్ప ఛేదనలో కోల్‌కతా ఆఖరి ఓవర్‌ వరకు ఆడాల్సి వచ్చింది. ఓపెనర్‌ గిల్‌ (29) క్రీజులో ఉన్నంత సేపు అదరగొట్టాడు. నాలుగో ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లు బాదిన అతడిని హర్షల్‌ అవుట్‌ చేశాడు. కానీ పవర్‌ప్లేలో కేకేఆర్‌ 48 పరుగులు చేసి ఆర్‌సీబీపై ఒత్తిడి పెంచింది. ఆ తర్వాత త్రిపాఠి (6) అవుటైనా మరో ఓపెనర్‌ వెంకటేశ్‌ (26) ఆచితూచి ఆడాడు. ఈసమయంలో రాణా (23) వేగం పెంచాడు. అయితే అయ్యర్‌ను కూడా హర్షల్‌ పెవిలియన్‌కు చేర్చడంతో 79/3తో తడబడినట్టు కనిపించింది. కానీ ఈ దశలో నరైన్‌ తన బ్యాటింగ్‌ పవర్‌ కూడా చూపించాడు. ఎదుర్కొన్న తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలచడంతో పేసర్‌ క్రిస్టియన్‌ 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ దెబ్బకు 12 ఓవర్లలోనే జట్టు వంద పరుగులు చేసింది. క్రీజులో కుదురుకున్న రాణాను చాహల్‌ అవుట్‌ చేయగా 18వ ఓవర్‌లో పేసర్‌ సిరాజ్‌.. నరైన్‌, దినేశ్‌ కార్తీక్‌ (10)ను పెవిలియన్‌కు చేర్చి ఉత్కంఠ పెంచాడు. ఇక చివరి ఓవర్‌లో 7 రన్స్‌ అవసరం కాగా.. షకీబ ల్‌ హసన్‌ (9 నాటౌట్‌) ఫోర్‌ తో కేకేఆర్‌ మరో రెండు బంతులుండగానే మ్యాచ్‌ను ముగించింది.


స్పిన్‌కు విలవిల:

భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచాలనే ఆలోచనతో టాస్‌ గెలవగానే ఆర్‌సీబీ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కానీ వారి వ్యూహాన్ని దెబ్బతీస్తూ స్పిన్నర్‌ నరైన్‌ బెంగళూరును వణికించాడు. ఆరంభంలో ఓపెనర్లు కోహ్లీ, దేవ్‌దత్‌ చకచకా పరుగులు సాధించారు. రెండో ఓవర్‌లో కోహ్లీ, నాలుగో ఓవర్‌లో దేవ్‌దత్‌ రెండేసి ఫోర్లు బాదారు. ఆ తర్వాత దేవ్‌దత్‌ను ఫెర్గూసన్‌ బౌల్డ్‌ చేసినా పవర్‌ప్లేలో జట్టు 53 పరుగులు సాధించింది. ఆ తర్వాత ఆర్‌సీబీ ఆట పూర్తిగా నెమ్మదించింది. కోహ్లీ, భరత్‌ క్రీజులో ఉన్నా 6 నుంచి 10 ఓవర్ల మధ్య ఒక్క ఫోర్‌ కూడా నమోదు కాలేదు. అటు స్పిన్నర్‌ నరైన్‌ వరుస ఓవర్లలో భరత్‌ (9), విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిల్లీర్స్‌ (11), మ్యాక్స్‌వెల్‌ (15)ను అవుట్‌ చేయడంతో ఆర్‌సీబీ షాక్‌లో మునిగింది. ఇందులో విరాట్‌, ఏబీని నరైన్‌ బోల్తా కొట్టిస్తూ కళ్లు చెదిరే బంతులతో బౌల్డ్‌ చేయడం అబ్బురపరిచింది. అటు టెయిలెండర్ల నుంచి కూడా నామమాత్ర ప్రదర్శన రావడంతో చివరి 5 ఓవర్లలో బెంగళూరు 30 పరుగులు మాత్రమే చేయగలిగింది. 


స్కోరుబోర్డు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (బి) ఫెర్గూసన్‌ 21; కోహ్లీ (బి) నరైన్‌ 39; భరత్‌ (సి) వెంకటేశ్‌ (బి) నరైన్‌ 9; మ్యాక్స్‌వెల్‌ (సి) ఫెర్గూసన్‌ (బి) నరైన్‌ 15; డివిల్లీర్స్‌ (బి) నరైన్‌ 11; షాబాజ్‌ (సి) మావి (బి) ఫెర్గూసన్‌ 13; క్రిస్టియన్‌ (రనౌట్‌) 9; హర్షల్‌ (నాటౌట్‌) 8; గార్టన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 138/7. వికెట్ల పతనం: 1-49, 2-69, 3-88, 4-102, 5-112, 6-126, 7-134. బౌలింగ్‌: షకీబల్‌ హసన్‌ 4-0-24-0; శివమ్‌ మావి 4-0-36-0; వరుణ్‌ చక్రవర్తి 4-0-20-0; ఫెర్గూసన్‌ 4-0-30-2; సునీల్‌ నరైన్‌ 4-0-21-4.


కోల్‌కతా నైట్‌రైడర్స్‌:

శుభ్‌మన్‌ గిల్‌ (సి) ఏబీ డివిల్లీర్స్‌ (బి) హర్షల్‌ 29; వెంకటేష్‌ (సి) భరత్‌ (బి) హర్షల్‌ 26; రాహుల్‌ త్రిపాఠి (ఎల్బీ) (బి) చాహల్‌ 6; నితీష్‌ రాణా (సి) డివిల్లీర్స్‌ (బి) చాహల్‌ 23; సునీల్‌ నరైన్‌ (బి) సిరాజ్‌ 26; దినేశ్‌ కార్తీక్‌ (సి) భరత్‌ (బి) సిరాజ్‌ 10; మోర్గాన్‌ (నాటౌట్‌) 5; షకీబల్‌ హసన్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 19.4 ఓవర్లలో 139/6. వికెట్ల పతనం: 1-41, 2-53, 3-79, 4-110, 5-125, 6-126. బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-19-2; జార్జ్‌ గార్టన్‌ 3-0-29-0; హర్షల్‌ పటేల్‌ 4-0-19-2; చాహల్‌ 4-0-16-2; మాక్స్‌వెల్‌ 3-0-25-0, క్రిస్టియన్‌ 1.4-0-29-0.