Abn logo
Dec 4 2020 @ 20:31PM

దేశీయ విమాన రంగానికి రూ. 21 వేల కోట్ల నష్టాలు

న్యూఢిల్లీ : ఈ(2020-21) ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ రూ. 21 వేల కోట్లకు పైగా నష్టాలను నమోదు చేసే అవకాశముందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా లిమిటెడ్ వెల్లడించింది. కరోనా నేపధ్యంలో మార్చి చివరి వారం నుండి దాదాపు రెండు నెలలు విమాన ప్రయాణాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే... ఆ తర్వాత ప్రారంభమైనప్పటికీ పరిమితులున్నాయి. ఈ నేపధ్యంలో ఈ రంగానికి భారీ నష్టం వాటిల్లనుందని పేర్కొంది. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి ఇండియన్ ఎయిర్ లైన్స్‌కు 2021-2023 ఆర్ధిక సంవత్సరాల మధ్య రూ. 37 వేల కోట్లకు పైగా ఫండ్ అవసరమని అభిప్రాయపడింది.


కార్యకలాపాలపై ప్రభావం...

కరోనా కారణంగా భారత విమానరంగంపై భారీ ప్రభావం పడిందని ఇక్రా వెల్లడించింది. మార్చి 23 నుండి అంతర్జాతీయ ప్రయాణాలు నిలిచిపోయాయని, మార్చి 25 నుండి దేశీయ విమానయానం  నిలిచిపోయిందని గుర్తు చేసింది. కాగా... 2020 మే 25 నుండి పరిమితంగా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని, ఆ తర్వాత 45 శాతం సామర్ధ్యంతో మాత్రమే అనుమతించారని, సెప్టెంబరు నుండి 60 శాతం అమల్లోకి వచ్చిందని గుర్తు చేసింది. నవంబరు 11 వ తేదీ నుండి 70 శాతం, డిసెంబరు 3 నుండి 80 శాతం అనుమతించారని వెల్లడించింది. 


రూ. 50 వేల కోట్లకు రుణం...

కరోనా కారణంగా కార్యకలాపాలు నిలిచిపోవడం, ప్రయాణాలు తగ్గడం వంటి వివిధ కారణాలతో భారీగా నష్టం వాటిల్లనుందని ఇక్రా తెలిపింది. ఈ(2020) ఏడాదిలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ రూ. 12,700 కోట్ల మేర నష్టాలను నమోదు చేసుకుంది. ఇక 2022 ఆర్థిక సంవత్సరానికి లీజు బాధ్యతలను మినహాయించి మొత్తం విమాన పరిశ్రమ రుణం దాదాపు రూ. 50 వేల కోట్లకు పెరిగే అవకాశముందని ఇక్రా పేర్కొంది. ఇండిగో, స్పైస్ జెట్ విమాన సంస్థలు 2021 ఆర్ధిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో రూ. 31 కోట్ల నష్టాలను రిపోర్ట్ చేశాయి.


ఇదిలా ఉంటే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రయాణీకుల రద్దీ 62-64 శాతం మేర తగ్గవచ్చునని అంచనా వేసింది. అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య 88-89 శాతం వరకు తగ్గవచ్చని పేర్కొంది. 


Advertisement
Advertisement
Advertisement