Abn logo
Jul 28 2021 @ 02:35AM

ప్రభుత్వంతో తాడో..పేడో

ఆర్టీసీ సంఘాల ఉమ్మడి కార్యాచరణ సిద్ధం

ప్రతి వినతికీ ప్రభుత్వమే అంటే ఎలా?

విలీనంతో రెంటికీ చెడ్డ రేవడి అయ్యాం

మొదట ఎండీకి వినతి.. చివరికి కోర్టుకైనా..

ఏకమైన ఈయూ, ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌

బెజవాడలో తొలి సమావేశం నిర్వహణ

సమావేశమైన నేతలకు 

చుక్కలు చూపిన పోలీసులు

నాలుగు హోటళ్లు మార్చి చివరికి ఓ లాడ్జిలో భేటీ


అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): ‘విలీనం తర్వాత నిర్వీర్యం అయ్యాం. కార్మిక హక్కులను కోల్పోయాం. పోనీ ప్రభుత్వ ఉద్యోగుల వసతులు దక్కాయా అంటే అదీ లేదు. మొత్తం మీద ఆర్టీసీ సిబ్బంది రెంటికీ చెడ్డ రేవడి అయినట్టే. ఏ చిన్న వినతిపత్రం ఇచ్చినా అధికారులు ప్రభుత్వం అంటున్నారు. ప్రభుత్వ పెద్దలను కలిసినా స్పందన కనిపించడంలేదు. ఈ విషయంలో ఐక్యంగా పోరాటం చేయకుంటే అంతే’ అని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు నిర్ణయానికి వచ్చాయి. దశల వారీగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి చివరికి ఉద్యమబాటకు రెడీ అయ్యాయి. ప్రభుత్వం దిగి రాకుండా ఇబ్బంది పెడితే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సైతం వెనుకాడరాదని నిర్ణయించాయి. ఏపీఎ్‌సఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన జగన్‌ హామీ మేరకు కార్మికులను మాత్రమే 2020 జనవరి 1 నుంచి ప్రజా రవాణా శాఖ(పీటీడీ)లోకి ప్రభుత్వం మార్చింది. ఇక తమకు తిరుగులేదనుకున్న కార్మికులకు అతి తక్కువ కాలంలోనే అసలు విషయం అర్థమైంది. కేవలం జీతం వరకే ప్రభుత్వ ఖజానా నుంచి వస్తోంది. మిగతా సౌకర్యాలన్నీ ప్రభుత్వ ఉద్యోగుల్లా లేవు. ఆర్టీసీ కార్మికులకు ఉన్న అపరిమిత వైద్య సదుపాయంతోపాటు ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ తదితర సదుపాయాలన్నీ పోయాయి. 

జగన్‌ చెప్పిన విధంగా పెన్షన్‌ వస్తుందా? అంటే సీపీఎస్‌ విధానంపై ఇప్పటికీ స్పష్టతలేదు. దీంతో ఏడాది కాలంగా కార్మిక సంఘాలు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఏ విషయంలో వినతిపత్రం ఇచ్చినా ‘ప్రభుత్వానికి పంపాం. అక్కడే నిర్ణయం తీసుకోవాలి’ అంటున్నారు. రవాణాశాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శికి వినతులు ఇచ్చినా తీసుకోవడం తప్ప స్పందన లేదు. విసిగిపోయిన నేతలు ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమయ్యారు. బలమైన ఈయూ, ఎన్‌ఎంయూ సంఘాలతోపాటు ఎస్‌డబ్ల్యూఎఫ్‌, కార్మిక పరిషత్‌ కూడా కలిసింది. విజయవాడలో మంగళవారం తొలి సమావేశం నిర్వహించి చర్చించాలనుకున్న నేతలకు పోలీసులు ఉదయం నుంచే చుక్కలు చూపించారు. సమావేశమైన హోటల్‌ వద్దకు ఇంటెలిజెన్స్‌ పోలీసులు చేరుకుని కార్మిక సంఘాల నేతలతో మాట్లాడారు. సమావేశంలో చర్చించే విషయాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అక్కడి నుంచి మరో చోటుకు మార్చగా అక్కడా పోలీసుల ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి నాలుగు హోటళ్లు తిరిగి ఒక లాడ్జిలో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అడ్డంకులను అధిగమించి సమావేశమైన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు విలీనం తర్వాత ఇబ్బందులు.. కోల్పోయిన సౌకర్యాలపై చర్చించారు. వాటి పునరుద్ధరణకు ఇచ్చిన వినతులను యాజమాన్యం, ప్రభుత్వం ఏ విధంగా బుట్ట దాఖలు చేసిందో చర్చించుకున్నారు. సర్వీస్‌ రూల్స్‌ మొదలుకొని పెన్షన్‌ వరకూ అన్నింటిపైనా మొదట ఎండీకి వినతిపత్రం ఇచ్చి ఆ తర్వాత మంత్రికి, అవకాశం ఇస్తే ముఖ్యమంత్రికి కూడా ఉమ్మడిగా ఇవ్వాలని నిర్ణయించారు. ఏ ఒక్క చోటా స్పందన లేకపోతే నిర్ణీత గడువు విధించుకుని డిపోల నుంచి ఉద్యమానికి సిద్ధమవ్వాలని తీర్మానించుకున్నారు. ఉద్యోగ సంఘాలపై ప్రభుత్వం ఏదైనా చర్యకు పాల్పడితే న్యాయస్థానంలో ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవ్వాలని నిర్ణయించారు.