ఆర్టీపీసీఆర్‌ కష్టాలు

ABN , First Publish Date - 2021-04-11T08:58:04+05:30 IST

తెలంగాణలో కొవిడ్‌ అనుమానిత లక్షణాలున్న వారికి ఆర్టీ-పీసీఆర్‌ కష్టాలు మొదలయ్యాయి. వ్యాధి నిర్ధారణలో కచ్చితత్వం కోసం వినియోగించే ఆ పరీక్ష చేయించుకోవాలంటే ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి.

ఆర్టీపీసీఆర్‌ కష్టాలు

  • పరిమితంగా టెస్టులు.. 
  • ఫలితాలకు 2-3 రోజులు ఎదురుచూపు
  • 70% ఆర్టీపీసీఆర్‌లు చేయాలన్న మోదీ
  • హైకోర్టు కూడా పలుమార్లు స్పష్టీకరణ
  • కానీ అసాధ్యమంటున్న వైద్య శాఖ
  • ఏ రాష్ట్రంలోనూ సాధ్యం కాదని వాదన 
  • రాష్ట్రంలో 20 శాతం కంటే తక్కువే
  • సర్కారీలో 7 వేలు..  ప్రైవేటులో 20,933 టెస్టులు చేసే సామర్థ్యం
  • పెంచాలంటే నెల టైం కావాల్సిందే
  • వేధిస్తున్న మానవ వనరుల కొరత
  • వేగవంతంగా ఫలితాలిచ్చే పరిజ్ఞానం వచ్చినా వినియోగించని వైనం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో కొవిడ్‌ అనుమానిత లక్షణాలున్న వారికి ఆర్టీ-పీసీఆర్‌ కష్టాలు మొదలయ్యాయి. వ్యాధి నిర్ధారణలో కచ్చితత్వం కోసం వినియోగించే ఆ పరీక్ష చేయించుకోవాలంటే ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. పరిమిత సంఖ్యలో ఈ టెస్టులు చేస్తుండటం ఒకెత్తయితే, వాటి ఫలితాల కోసం 2-3 రోజులు ఎదురుచూడాల్సి వస్తుండటంతో బాధితుల సహనానికి పెద్ద పరీక్షగా మారింది.  మరోవైపు కొవిడ్‌ నిర్ధారణకు ప్రస్తుతం చేస్తున్న పరీక్షల్లో 70 శాతం ఆర్టీ-పీసీఆర్‌ టెస్టులే చేయాలని ఇటీవలప్రధాని నరేంద్రమోదీ అన్ని  రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. మరోవైపు రాష్ట్ర హైకోర్టు.. తెలంగాణలో 20 శాతం కూడా ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయలేదని, ఆ సంఖ్యను మరింత పెంచాలని సర్కారుకు సూచించింది. కానీ అది ఏ మాత్రం సాధ్యం కాదని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిరోజు సగటున లక్షకుపైగా పరీక్షలు చేస్తున్నారు. శుక్రవారం  1,11,726 టెస్టులు చేశారు. అందులో 12,248 పరీక్షలు ప్రైవేటులో, మిగిలినవన్నీ ప్రభుత్వ పరీక్ష కేంద్రాల్లో చేసినవే. తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లోని 20 కేంద్రాల్లోనే ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేస్తున్నారు. అందులో రోజుకు 7 వేల ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగల సామర్థ్యమే ఉంది. ప్రైవేటులో 60 కేంద్రాల్లో 20,933 టెస్టుల సామర్థ్యం ఉంది. రెండూ కలిపినా 27,993 పరీక్షలే చేయగలరు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌లు రెండూ కలిపినా రోజుకు 15 వేలు కూడా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయడం లేదు. మరి రోజుకు 70శాతం టెస్టులు ఎలా  చేయగలుగుతామని అధికారులు చెబుతున్నారు. కనీసం 30 శాతం చేయడం కూడా అసాధ్యమంటున్నారు. 


సాకేంతికంగా అప్‌డేట్‌ అయ్యేదెప్పుడు? 

గంటల వ్యవధిలోనే భారీ సంఖ్యలో ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయగల అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ వాటి కొనుగోలుపై సర్కారు దృష్టిపెట్టడం లేదు. హైదరాబాద్‌లోనే ఉన్న విమానాశ్రయంలో 3-4 గంటల్లోనే ఆర్టీపీసీఆర్‌ ఫలితాలను వెల్లడించే యంత్రాలను వినియోగిస్తున్నారు. వాటిని ప్రధాన ఆస్పత్రుల్లో అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. సెకండ్‌ వేవ్‌ మొదలవడంతో సర్కారు మళ్లీ పరీక్షా యంత్రాలపై దృష్టిసారిస్తోంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో  ఆర్టీపీసీఆర్‌ కోసం చాలా పరిమిత సంఖ్యలో నమూనాలను సేకరిస్తున్నారు. అది కూడా యాంటీజెన్‌ టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చి, లక్షణాలున్న వారి నుంచే సేకరిస్తున్నారు. జిల్లాల్లో  ర్యాపిడ్‌ టెస్టులు మాత్రమే చేస్తున్నారు. ఇక ఆర్టీపీసీఆర్‌ కు శాంపిల్స్‌ ఇచ్చిన వారికి 3 రోజుల దాకా ఎటువంటి మెసేజ్‌లు రావడం లేదు. దాంతో వారిలో తీవ్రమైన ఆందోళన నెలకొంటోంది.  


ఆర్టీపీసీఆర్‌ చేస్తున్న రాష్ట్రాల్లోనే కేసులు ఎక్కువట !

రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయకపోవడానికి వైద్యశాఖ రెండు ప్రధాన కారణాలు చెబుతోంది. ఆ టెస్టులు ఎక్కువ చేస్తున్న మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్‌లలో కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉందని,  ఫలితాలు ఆలస్యంగా రావడం వల్ల, పాజిటివ్‌లు ఎక్కువ మందికి వైర్‌సను వ్యాప్తి చేస్తున్నారని అంటోంది. రెండోది.. ఇటువంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే వెంటనే ఫలితం వచ్చే పరీక్షలపైనే ఆధారపడాలని చెబుతోంది. అందుకే మెజార్టీ ర్యాపిడే చేస్తున్నామని, పాజిటివ్‌లను ఐసొలేషన్‌ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే ఆర్టీపీసీఆర్‌పై ఆధారపడితే మన దగ్గర కూడా భారీ సంఖ్యలో కేసులు పెరిగేవని అంటున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఆర్టీపీసీఆర్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నాలుగు రోజుల క్రితం ఆదేశించారు. కానీ, ఇందుకు నెల  పడుతుందని అధికారులు చెబుతున్నారు.  


6 గంటల్లోనే ఇవ్వొచ్చు కానీ..

ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. అధునాతన యంత్రాలు, రసాయనాలు కావాలి. అయినా ఫలితాలు రావడానికి కనీసం 24 గంటలు పడుతోంది. వాస్తవానికి ఒక ఆర్టీపీసీఆర్‌ పరీక్షను 6 గంటల్లోనే పూర్తిచేసి ఫలితాన్ని ప్రకటించవచ్చు. కానీ, భారీ సంఖ్యలో వస్తున్న శాంపిల్స్‌ను పరీక్షించి ఫలితాలను ప్రకటించాలంటే ఎంతో పెద్ద వ్యవస్థ ఉండాలి. సర్కారుపై పని ఒత్తిడి కారణంగా అది సాధ్యపడటం లేదు. దానికితోడు మానవ వనరుల కొరత వేధిస్తోంది. తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకున్నా సరిపోవడం లేదు. ఇక ప్రైవేటు ల్యాబ్‌లలో రోజుకు 20,933 టెస్టులు చేసే సామర్థ్యం ఉన్నా.. రోజంతా నమూనాలు సేకరించడంలో నిమగ్నమవడంతో ఆ స్థాయిలో చేయలేకపోతున్నాయి. శాంపిల్స్‌ను పరీక్షించే నైపుణ్యమున్న సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని ఓ ల్యాబ్‌ నిర్వాహకుడు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ల్యాబ్‌ టెక్నీషియన్లను నియమించుకున్నా.. కరోనా భయంతో మానేస్తున్నారని చెప్పారు. సిబ్బంది కరోనా బారినపడటం కూడా.. ఫలితాల విడుదల జాప్యానికి ఒక ముఖ్య కారణమన్నారు. 4 రోజుల క్రితం వరకు ఇంటికి వచ్చి మరీ నమూనాలు సేకరించిన ప్రైవేటు ల్యాబ్‌లు ప్రస్తుతం అందుకు అంగీకరించడం లేదు. అపాయింట్‌మెంట్‌ ఇచ్చినా, సకాలంలో వచ్చి తీసుకోవడం లేదు. 

Updated Date - 2021-04-11T08:58:04+05:30 IST