24 గంటల తర్వాతే సర్జరీపై నిర్ణయం

ABN , First Publish Date - 2021-09-12T07:55:23+05:30 IST

తెలుగు సినీ హీరో, మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (34) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

24 గంటల తర్వాతే సర్జరీపై నిర్ణయం

సినీ హీరో సాయిధరమ్‌ తేజ్‌కు కుడి భుజం, కుడి కన్ను, ఛాతీపై గాయాలు

స్పోర్ట్స్‌ బైక్‌ అదుపు తప్పి ప్రమాదం 

మెడికవర్‌లో చికిత్స.. అపోలోకు 

ఆరోగ్యం నిలకడగా ఉంది: వైద్యులు 

అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌పై కేసు 

రోడ్డుపై ఇసుక మేట వల్లే.. స్థానికులు

తెల్లారేసరికి తొలగించిన జీహెచ్‌ఎంసీ అధికార్లు

హైదరాబాద్‌సిటీ/మాదాపూర్‌/రాయదుర్గం/బంజారాహిల్స్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): తెలుగు సినీ హీరో, మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (34) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో.. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ నుంచి దుర్గం చెరువు తీగల వంతెన మీదుగా ఐకియా రోడ్డుపై వెళ్తుండగా కోహినూర్‌ హోటల్‌ సమీపంలో తాను నడుపుతున్న ట్రయంఫ్‌ స్పోర్ట్స్‌ బైక్‌ (టీఎ్‌స07జీజే1258)పై నుంచి పడిపోయారు. బైక్‌ సుమారు 50 మీటర్లు, సాయిధరమ్‌ 20 మీటర్లు రోడ్డుపై జారుకుంటూ వెళ్లారు. 108లో ఆయనను దగ్గరలోని మెడికవర్‌ ఆస్పత్రిలో చేర్చారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు కుడి కన్ను, కుడి భుజం, చాతీపై బలమైన గాయాలైనట్లు నిర్ధారించారు. కుడివైపు కాలర్‌ బోన్‌ విరిగినట్లు గుర్తించారు. గోల్డెన్‌ అవర్‌లో తేవడంతో ముప్పు నుంచి కాపాడినట్లు ఆస్పత్రి డాక్టర్‌ సతీష్‌ చెప్పారు. మెడికవర్‌ ఆస్పత్రిలో హీరోలు, మేనమామలు చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌.. సాయిధరమ్‌తేజ్‌ను పరామర్శించారు. వారి సూచన మేరకు ఫిలింనగర్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు.


నిలకడగా ఆరోగ్యం

సాయిధరమ్‌తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చికిత్సకు పూర్తిగా సహకరిస్తున్నారని అపోలో వైద్య వర్గాలు తెలిపాయి. ఆయన కాలర్‌ బోన్‌ శస్త్రచికిత్సపై 24 గంటల తర్వాత నిర్ణయం తీసుకుంటామని వైద్యులు చెప్పారు. అభిమానులు ఆందోళన చెందవద్దని, తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని చిరంజీవి ట్వీట్‌ చేశారు. శనివారం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, సినీ నటులు ప్రకా్‌షరాజ్‌, శ్రీకాంత్‌ తదితరులు ఆస్పత్రికి వచ్చారు.

నొప్పిగా ఉంది

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్‌తేజ్‌ వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. కుటుంబ సభ్యులకు వీడియోకాల్‌ ద్వారా ఆయనను చూపిస్తున్నట్లు తెలిసింది. స్పృహలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో ‘‘నొప్పిగా ఉంది’’ అని కేవలం ఒకే ఒక మాట మాట్లాడినట్లు సమాచారం.  


రోడ్డుపై ఇసుక మేటనే కారణమా?

సాయిధరమ్‌ ఐకియా వైపు ఉన్న సర్వీసు రోడ్డుపై వెళ్తుండగా ద్విచక్ర వాహనాన్ని అధిగమించబోయారు. థెర్మోప్లాస్టిక్‌ రోడ్‌ మార్కింగ్‌ (టీఆర్‌ఎం) లైన్‌ వైపు వెళ్లి ఓవర్‌ టేక్‌ చేస్తూ బైక్‌ను కొద్దిగా వంచారు.   రోడ్డు చివర ఇసుక మేట ఉండటంతో బైక్‌ పట్టుతప్పింది. ఈ ప్రాంతంలో 2 నెలలుగా రోడ్డు పక్కన ఇసుక ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవలి వర్షాలతో పాటు భవన నిర్మాణానికి సెల్లార్‌ తవ్వుతున్నారు. దీంతో రోడ్డుపై మట్టి, ఇసుకు పేరుకుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెల్లారే సరికి ఇసుక లేకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు జాగ్రత్త పడ్డారు. 


అతి వేగమేనన్న పోలీసులు

అతివేగం, నిర్లక్ష్యంగా బైక్‌ నడిపిన కారణంగానే సాయిధరమ్‌ ప్రమాదానికి గురైనట్లు రాయదుర్గం పోలీసులు కేసులు నమోదు చేశారు. సాయిధర్‌తేజ్‌, సీనియర్‌ నటుడు నరేష్‌ కుమారుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ రేసింగ్‌ పెట్టుకున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ప్రమాదానికి రోడ్డుపై ఇసుక ఉండటం కూడా ఒక కారణమని తెలియడంతో టీఎ్‌సఐఐసి, జీహెచ్‌ఎంసీ అధికారులకు నోటీసులు ఇస్తామని రాయదుర్గం సీఐ రాజగోపాల్‌ రెడ్డి చెప్పారు.  అయితే, జీహెచ్‌ఎంసీ, బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా క్షతగాత్రునిపై కేసులు నమోదు చేయడంపై పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

 75 కి.మీ. మించి వేగంతో డ్రైవింగ్‌

సైబరాబాద్‌ పోలీసుల ప్రకటన ప్రకారం.. 30 నుంచి 40 కి.మీ. వేగానికి పరిమితమైన రోడ్డుపై వద్ద 75 కి.మీ. మించి (సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా) వేగంతో వెళ్తున్నారు. దుర్గం చెరువు బ్రిడ్జి దాటిన సమయంలో వేగం 100 కి.మీ. పైగా ఉంది. కాగా, ఎల్బీనగర్‌ లక్ష్మీనగర్‌ కాలనీకి చెందిన బుర్రా అనిల్‌ కుమార్‌ వద్ద సాయి ధరమ్‌ ట్రయంఫ్‌ బైక్‌ను  కొన్నారు. తన పేరిట రిజిస్టర్‌ చేయించలేదు. గత నెల 2న మాదాపూర్‌ పర్వత్‌నగర్‌లో 40 కి.మీ. అనుమతి ఉన్న రోడ్డుపై 87 కి.మీ. వేగంతో నడపడంతో  రూ.1135 చలానా విధించగా.. శనివారం దానిని ఎవరో చెల్లించినట్లు గుర్తించారు.  తేజ్‌కు కారు డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్నప్పటికీ బైక్‌ డ్రైవింగ్‌ లైసెన్సు గురించి ఆధారాలు లభించలేదు. లైసెన్సు గురించి ఆరా తీస్తున్నారు.   

Updated Date - 2021-09-12T07:55:23+05:30 IST