Abn logo
Aug 4 2021 @ 03:22AM

‘ఆంధ్రజ్యోతి’ అంటే భయమా?

ప్రశ్నలు అడిగితే బదులు ఇవ్వలేరా?.. మీడియా భేటీకి ఎందుకు పిలవలేదో!

నచ్చిన మీడియానే పిలుచుకున్న సజ్జల, విజయ్‌ కుమార్‌


‘ఆంధ్రజ్యోతి’ అంటే అంత భయమా?

అమరరాజా రాష్ట్రం నుంచి వెళ్లిపోయే ప్రమాదముందన్న కథనం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కార్మిక, రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో సంచలనం సృష్టించింది. సర్కారుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన చర్యలను సమర్థించుకునేందుకు సర్కారు నానాపాట్లు పడింది. సాక్షాత్తూ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. 16వేల మందికి ప్రత్యక్షంగా, 50 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ తరలిపోయే అవకాశముందని ప్రచురించిన కథనానికి... ‘సామాజికవర్గం - బంధుత్వం’ అంటగట్టి పసలేని కబుర్లు  చెప్పారు.  ‘దండం పెట్టి మేమే పొమ్మంటున్నాం’ అని చెప్పేశారు. అటవీ శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ కూడా అదే ధోరణిలో మాట్లాడారు. అయితే, ఆ ఇద్దరూ తమకు అనుకూలమైన మీడియాను మాత్రమే పిలిపించుకొని మాట్లాడటం గమనార్హం. గతంలో మన్యంలో మైనింగ్‌ విషయంలో గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ప్రెస్‌మీట్‌ పెట్టినప్పుడు ఆయన చెప్పిన ఏకపక్ష సమాధానాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు అప్పటికప్పుడే ప్రశ్నలు సంధించారు. వాటికి ద్వివేదీ సరైన సమాధానం చెప్పలేకపోయారు. ప్రెస్‌మీట్‌కు ‘ఆంధ్రజ్యోతి’ వస్తే ఎక్కడ ప్రశ్నలు అడుగుతారో, ఎక్కడ అడ్డంగా దొరికిపోతామో అన్న భయంతో అటు సజ్జల, ఇటు విజయ్‌కుమార్‌ తమకు అనుకూలంగా ఉండేవారిని మాత్రమే పిలిపించుకొని, తాము చెప్పదలుచుకుంది చెప్పి వెళ్లిపోయారు. నిజానికి వీరిద్దరూ అధికారిక హోదా ఉన్నవారే. తాము చెప్పేది వాస్తవమైతే, సందేహాలకు సాధికార సమాధానం చెప్పగలుగుతామనే నమ్మకం ఉంటే... మీడియా మొత్తాన్నీ పిలవాలి. కానీ... ప్రశ్నించే వారికి సమాచారం ఇవ్వకుండా, సొంత వారితో తూతూ మంత్రం ప్రెస్‌మీట్లు పెడుతుండటం గమనార్హం.


మూసేయమన్నాం: విజయ్‌కుమార్‌

పర్యావరణ నిబంధనలు పాటించని అమరరాజా బ్యాటరీ్‌సను మూసివేయాలని తాము ఉత్తర్వులు  ఇచ్చామని అటవీశాఖ  కార్యదర్శి విజయ్‌కుమార్‌ వెల్లడించారు. ‘‘తిరుపతి ప్లాంటు ఉన్న చోట సరిచేయలేనటువంటి పర్యావరణ నష్టం జరిగింది. లోపాలను సరిచేసుకోవడానికి సమయం ఇచ్చిన తర్వాత ఉత్పత్తి నిలుపుదల ఉత్తర్వులు జారీ చేశాం. లోపాలను సరిదిద్దుకోనందువల్లే మూసివేత ఉత్తర్వులు ఇచ్చాం. విద్యుత్‌ సరఫరా నిలిపివేత వంటి చర్యలు తీసుకున్నాం’’ అని తెలిపారు. తప్పులు చేస్తున్న అన్ని పరిశ్రమలపై చర్యలు తీసుకుంటున్నామని, అందులో అమరరాజా ఒకటని చెప్పారు. ‘‘మూసివేత నోటీసుపై అమరరాజా సంస్థ హైకోర్టుకు వెళ్లి నాలుగు వారాల స్టే తెచ్చుకుంది. హైకోర్టు ఆదేశాలతో తనిఖీలు చేసేందుకు  వెళ్లగా గేటువేసి అడ్డుకున్నారు. దీనిపై పోలీసు కేసు పెట్టాం. తిరుపతి సమీపంలోని ప్లాంటును అక్కడ కొనసాగించవద్దు. ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండటానికి వీల్లేదు. ఆ ఫ్యాక్టరీని మరోచోటకు తరలించాలని హైకోర్టుకు నివేదించాం’’ అని విజయ్‌కుమార్‌ తెలిపారు. గత కొన్నేళ్లుగా భయంకరమైన పర్యావరణ కాలుష్యం వెదజల్లుతుంటే ఇన్నేళ్లు ఏం చేశారని మీడియా ప్రశ్నించగా... ‘‘గతంలో తనిఖీలు చేపట్టని వాటిని మేం పరిశీలించాం. వారు ప్రతి ఆరు నెలలకోసారి కాలుష్య నియంత్రణపై నివేదిక ఫైలు చేయాలి. కానీ... గత కొన్నేళ్లుగా వారు ఆ నివేదికలు ఇవ్వడం లేదు’’ అని తెలిపారు. పరిశ్రమలు రావాలి... పర్యావరణం కూడా బాగుండాలని అన్నారు.


మేం అలా  కోరుకోవడంలేదు కానీ... లాభం ఉన్నచోటే వ్యాపారం: బొత్స

తిరుపతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): అమరరాజా సంస్థ మరో రాష్ట్రానికి వెళ్లిపోవాలని తాము కోరుకోవడంలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ‘వ్యాపారులు ఎక్కడ లాభం ఉంటే అక్కడకు వెళతారు. వ్యాపారం చేసుకునేవాడికి ఏ రాష్ట్రమైతే ఏంటి? వెళ్లిపోవాలని మేము కోరుకోవడంలేదు’ అని తెలిపారు. తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అమరరాజా ఫ్యాక్టరీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదని, తప్పుచేసి ఉంటేనే నోటీసులు ఇచ్చి ఉంటారని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచన చేస్తోందన్నారు.