Abn logo
May 18 2021 @ 15:09PM

శివపదాల పాటల పోటీ.. చిన్నారులకు సామవేదం శివాశీస్సులు

ఇంటర్నెట్ డెస్క్: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అత్యద్భుతంగా రచించిన శివపద గీతాల పాటల పోటీ ఆద్యంతం భక్తిలో తేలియాడేలా చేసింది. ఋషీపీఠం ఆధ్వర్యంలో శివపదాలను మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తలతో పాటల పోటీగా నిర్వహించారు. ఈ నెల 14, 15, 16 తేదీలలో యూట్యూబ్ మాధ్యమంగా నిర్వహించిన ఈ పోటీలకు వాణీ గుండ్లపల్లి, రవి గుండ్లపల్లి, మేఘన, నాగ సంపత వారణాసి తదితరులు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు. 


ఈ కార్యక్రమానికి విశేషస్పందన లభించింది. 4 ఖండాలలోని 9 దేశాల నుంచి చిన్నపిల్లల మొదలుకొని పెద్దవాళ్ల వరకు 213 మంది ఔత్సాహిక గాయనీగాయకులు పాల్గొన్నారు. వయసువారీగా 5 విభాగాలుగా విభజించి, ఆయా విభాగాలకు ప్రశస్త శివభక్తుల పేర్లయిన "ఉపమన్యు ", "మార్కండేయ", "భక్త కన్నప్ప", "నత్కీర","పుష్పదంత "గా నిర్ణయించారు. 11 మంది ప్రఖ్యాత  సంగీతగురువులు యూఎస్, భారత్, ఆస్ట్రేలియా, సింగపూర్ నుంచి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వీరిలో భారతదేశం నుంచి తులసి విశ్వనాథ్, పద్మ త్యాగరాజన్, శారదా సుబ్రమణియన్, కౌశిక్ కల్యాణ్,శ్రీ సాయి కృష్ణ, పెద్దాడ సూర్యకుమారి, అమెరికా నుంచి పావని మల్లాజ్యోస్యుల, సవిత నముడూరి, లక్ష్మి కొలవెన్ను, సింగపూర్ నుంచి పద్మావతి , ఆస్ట్రేలియా నుంచి పద్మా మల్లెల గారు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. 


పంచముఖశివుని తలపిస్తూ ఐదు విభాగాలతో, ఐదు పూటల జరిగిన ఈ కార్యక్రమం, ప్రతిపూటా పూజ్య గురువుగారి దివ్య ఆశీస్సులతో, పరిచయ వ్యాఖ్యలతో మొదలయ్యింది. అందరి పాటలనూ విన్న షణ్ముఖ శర్మ, శివపదం తనకోసం, తన జీవితపరమావధిగా,  సార్ధకతగా రాసుకున్నపాటలుగా అభివర్ణిస్తూ, ఇంత మంది వాటిని చక్కగా పాడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని శివాశీస్సులు అందించారు. ముఖ్యంగా ఎక్కువ మంది చిన్నపిల్లలు ఈ పోటీలో పాల్గొన్నారు. ప్రవాసులయిన ఎందరో పిల్లలు కూడా సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో, స్పష్టమైన ఉచ్చారణతో శృతి, లయ బద్ధంగా అద్భుతంగా ఆలపించారు. చిన్మయ జ్యోతిర్మయ లింగం, పాలవన్నెవాడు, పటికంపు ఛాయ, గిరులే శ్రుతులు, శివుడు ధరించిన, సకలమంత్రముల సంభవమూలం, సభాపతి పాహిపాహిమామ్  మొదలుకుని దాదాపు 150 పైగా శివపదాలను అద్భుతంగా, వీనులవిందుగా పాడారు పోటీలో పాల్గున్నవాళ్ళు. న్యాయనిర్ణేతలు తగు సూచనలు ఇస్తూ ఉత్సాహభరితంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. 


"ఆత్మాత్వం గిరిజా మతిః "అని శివ మానసపూజలో శ్రీ శంకర భగవత్పాదులు అన్నట్లుగా, పాడే వారూ, వేలాదిగా విన్నవారూ, అందరూ తన్మయత్వంతో తమలో, అంతటిలోనూ శివుణ్ణి ఎరుకగాంచే విధంగా ఆద్యంతం రసరమ్యముగా జరిగిన ఈ కార్యక్రమం భారతదేశంలో శుక్రవారం ప్రదోష వేళలో ప్రారంభమై, ఆదివారం శంకర జయంతి నాడు అమెరికాలో ముగిసింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని, ఇంతటి బృహత్కార్యక్రమాన్ని ఎంతో శ్రమకోర్చి ఇంత అత్యుత్తమంగా నిర్వహించిన వాణి , రవి గుండ్లపల్లికి వీక్షకులంతా అభినందించారు. 

Advertisement