సిలికానాంధ్ర 'సంపద' ఆధ్వర్యంలో ఘనంగా బాలమురళి జయంతి ఉత్సవం

ABN , First Publish Date - 2021-07-06T21:28:49+05:30 IST

అమెరికాలోని కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ "సంపద" ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత సామ్రాట్ తెలుగువారు గర్వించదగిన మహోన్నతమైన వ్యక్తి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి 91వ జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి.

సిలికానాంధ్ర 'సంపద' ఆధ్వర్యంలో ఘనంగా బాలమురళి జయంతి ఉత్సవం

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ "సంపద" ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత సామ్రాట్ తెలుగువారు గర్వించదగిన మహోన్నతమైన వ్యక్తి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి 91వ జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. ఈ నెల 4న వర్చువల్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది కళాకారులు పాల్గొని బాల మురళి కృష్ణతో తమకున్న అనుభవ, అనుబంధాలను వీక్షకులతో పంచుకున్నారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి మాట్లాడుతూ సంపద వారికి ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని ఆలోచన రావడం చాలా గొప్ప విషయం అన్నారు. డాక్టర్ బాల మురళి కృష్ణ గారు కారణజన్ములని వారికి సమకాలీకునిగా వారితో కలిసి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర విద్య నేర్చుకోవడం తమకు భగవంతుడిచ్చిన గొప్ప వరంగా పేర్కొన్నారు. బాల మురళి కృష్ణ సంగీతంలోనే కాకుండా వయోలిన్, వయోలా, మృదంగం, కంజీర వంటి వాద్యాలలో కూడా చక్కటి ప్రతిభను కనపరిచేవారని గుర్తు చేశారు.


ప్రముఖ నాట్యాచార్యులు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భగవంతుడు సంగీత ప్రపంచానికి ఇచ్చిన అతి గొప్ప వరం మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని తాను భావిస్తానన్నారు. వారు రచించి స్వరపరిచిన హిందోళ తిల్లానాకు నృత్యం చేసే అవకాశం తొలిసారిగా తనకు కలిగిందని పేర్కొన్నారు. ఆ తర్వాత వారి కుటుంబంతో 50 సంవత్సరాలకు పైగా అనుబంధ ఉందని, ఇలాంటి కార్యక్రమాన్ని సంపద ద్వారా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా. సుధ రఘునాథన్ మాట్లాడుతూ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే సామెతకు చిరునామా మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని అన్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరిని ఆప్యాయంగా పలుకరిస్తూ ప్రోత్సహించేవారని తెలిపారు. వారితో వేదిక పంచుకున్నటువంటి సందర్భాలు తన జీవితాంతం గుర్తుండిపోతాయి అని పేర్కొన్నారు.  


ప్రముఖ వయోలిన్ విద్వాంసులు పద్మశ్రీ పురస్కార గ్రహీత అవసరాల కన్యాకుమారి మాట్లాడుతూ బాల మురళి కృష్ణ తెలుగు జాతికి గర్వకారణమని వారి జయంతి సందర్భంగా సంపద ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. వారితో వేదికను పంచుకున్నటువంటి ఎన్నో సందర్భాలు మరపురాని సంఘటనలుగా గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేరళ రాష్ట్రం నుంచి మంగళంపల్లి వారి శిష్యులు ప్రిన్స్ రామ వర్మ, హైదరాబాద్ నుంచి DV మోహన కృష్ణ పాల్గొని గురువు గారితో వారికున్న అనుభవాలని పంచుకున్నారు. బాలమురళి రచించి, స్వరపరచిన కీర్తనలను పాడి నివాళి అర్పించారు.


ఈ కార్యక్రమంలో ప్రముఖ మ్యూజికాలజిస్ట్ డాక్టర్ బీఎం సుందరం, డాక్టర్ పప్పు వేణుగోపాలరావు, సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు చిత్రవీణ రవి కిరణ్, చిత్రవీణ నరసింహం, ప్రముఖ ఘటం కళాకారులు కార్తీక్, ప్రముఖ మృదంగ విద్వాంసులు పత్రి సతీష్ కుమార్, సంగీత విద్వాంసులు శ్రీరాం పరశురాం, మోదుమూడి సుధాకర్, వయోలిన్ కళాకారిణి పద్మ శంకర్, జీవీ ప్రభాకర్, మంగళంపల్లి వారి కుటుంబ సభ్యులు అభిరామ్, డాక్టర్ మంగళంపల్లి వంశీ, కస్తూరి గోపాల రావు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నాట్య గురువు ప్రియదర్శిని గోవింద్ సీనియర్ శిష్యురాలు శ్వేత ప్రచండె, బాలమురళి గారి థిల్లానాలకు తన అద్భుతమైన నాట్య ప్రదర్శనతో  వీక్షకులను అలరించారు. బాలమురళి శిష్యులు చిట్టమూరి కారుణ్య, చిన్మయిలు బాలమురళి కీర్తనలు పాడి స్వర నివాళినర్పించారు.  


సంపద ఉపాధ్యక్షుడు ఫణి మాధవ్ కస్తూరి నాయకత్వంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ జీవన విశేషాలపై ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రూపొందించిన డాక్యుమెంటరీలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. దీనికి స్క్రిప్ట్, వాయిస్ ఓవర్ అందించిన డాక్టర్ మాలస్వామి(ఇంగ్లీష్), వాచస్పతి అంబడిపూడి మురళీకృష్ణ(తెలుగు)కు సంపద అధ్యక్షులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని సమన్వయపరిచి దిగ్విజయం చేయడానికి నాయకత్వం వహించిన సంపద అధ్యక్షులు దీనబాబుకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ శిష్యులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా సిలికానాంధ్ర వాగ్గేయకార విభాగం ఉపాద్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ, సృజన నాదెళ్ళ, మమత కూచిభొట్ల బాలమురళి అభిమానులందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని youtube.com/sampadatv ద్వారా చూడవచ్చు.      

Updated Date - 2021-07-06T21:28:49+05:30 IST