Abn logo
Mar 24 2020 @ 00:33AM

సంచార విజ్ఞాన సర్వస్వం-

1946లో ‘మీజాన్‌’ పత్రికలో ‘నైజాము నవాబును నారాయణ గూడా చౌరస్తాలో ఉరితీయాలి’ అనే సంపాదకీయాన్ని రాంభట్ల రాశారు. అది అచ్చయిన సంచికను అప్పటి నైజామ్‌ రాష్ట్ర ప్రధానమంత్రి మీర్జా ఇస్మాయిల్‌ దగ్గర పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌గా పనిచేసిన కుందూరి ఈశ్వరదత్‌ చదివి, ఆ పత్రిక బయటపడితే దాని సంపాదకుడు అడవి బాపిరాజును ఉరితీస్తారని భయపడి, ఆ సంచిక ప్రతులన్నీ తెప్పించుకుని తగుల బెట్టించాడు.


‘బంగారుభూమి సూక్త మాలాపించుతూ పద 

అంగార గంగలాగ తరంగించుతూ పద

కొవ్వొత్తిలాగ కాలి ప్రదీపించువారికి

చెయ్యెత్తి వందనాలు సమర్పించుతూ పద’... అంటూ ఒక తరాన్ని తట్టిలేపిన ప్రగతిశీల సాహితీవేత్త, మా తరానికి గురుతుల్యులు రాంభట్ల కృష్ణమూర్తి. ఒక చేత్తో వేదోపనిషత్తుల్నీ, మరోచేత్తో మార్క్సిజాన్నీ ఔపోసన పట్టిన సంచార విజ్ఞానసర్వస్వం ఆయన.


24 మార్చి 1920న తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తాలూకా, అనాతవరం గ్రామంలో పుట్టిన రాంభట్ల రెండు సంవత్సరాల వయసులోనే ఆయన తండ్రి పోయారు. ఫలితంగా కొంతకాలం తాతగారి దగ్గర, ఇంకొంతకాలం చిన్నాన్న దగ్గర, మరికొంతకాలం మేనమామ దగ్గర బాల్య జీవితం గడపడంతో థర్డ్‌ ఫారమ్‌ మూడుసార్లు చదివి, ఫిఫ్తు ఫారమ్‌తో చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. అయినా స్వశక్తితో సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్ని అధ్యయనం చేసి, వాటిలో పాండిత్యాన్ని సంపాదించారు. సంస్కృతంలోని వేదోపనిషత్తులు; తెలుగులో పురాణ- ప్రబంధాలు; ఆంగ్లంలో విజ్ఞానశాస్త్ర, - మార్క్సిస్టు గ్రంథాలు ఒకటికి పదిసార్లు చదివి, వాటిపై సాధికారాన్ని సంపాదించిన ‘రాంభట్ల’ తన 66 ఏళ్ల వయస్సులో కన్నడంలో వీర శైవ వచనాలను చదువుతూ కన్నడ భాష నేర్చుకున్నారు.


ప్రపంచ ప్రసిద్ధ జర్మన్‌ రచయిత బెర్తోల్‌ బ్రెహ్ట్‌లాగా, సుప్రసిద్ధ భారతీయ రచయిత శరత్‌చంద్రలాగా బాల్యమంతా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గడపడంవల్ల ఆయా ప్రాంతాల ప్రజల జీవన విధానాలు, ఆచార వ్యవహారాలు తెలుసుకునే అవకాశం ఆయనకు లభించింది. నిరంతర అధ్యయనం వాఙ్మయ శాఖల్లోకి మార్గం చూపింది.


1935లో నాంపల్లి (హైదరాబాద్‌)లోని వేమనాంధ్ర భాషా నిలయం లో కందుకూరి, చిలకమర్తి, పానుగంటి, గురజాడల సాహిత్యాన్ని అవలోకనం చేసిన రాంభట్ల గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకాన్ని కంఠస్థం చేశారు. 1936లో చరిత్రాధ్యయనం, 1938లో ‘వందే మాతరం’ ఉద్యమ ప్రవేశం, 1939లో హఠయోగ అభ్యాసం చేసిన రాంభట్ల 1940–-43 కాలంలో తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమైన తాంత్రిక విద్యల్ని అభ్యసించడమే కాక వాటిని ప్రాక్టీస్‌ చేశారు. ‘శంకరుని వేదాంతం నన్ను హేతువాదిని చేస్తే, తాంత్రిక వేదాంతం నన్ను భౌతికవాదిని చేసింది’ అంటారాయన.


1943లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం కార్యదర్శి కావడంతో సంగీతం, నాట్యం, చిత్రకళలపై అనేక గ్రంథాలను చదివే అవకాశం ఆయనకు దొరికింది. భోజుడు రాసిన ‘సమరాంగణ సూత్రధార’ అనే గ్రంథాన్ని, అహోమల సోమేశ్వర దేవుడు రాసిన ‘అభిలషితార్థ చింతామణి’ అనే గ్రంథాన్ని బరోడా నుంచి తెప్పించుకుని అధ్యయనం చేశారు. గ్రంథాల ద్వారా విగ్రహశిల్పం, కుడ్యచిత్రాలు, పఠచిత్రాలు గీయడం, విగ్రహాలను చెక్కడం వంటి అనేక అంశాలను ఆయన గ్రహించగలిగారు. 


ప్రముఖ నవలా రచయిత అడవి బాపిరాజు సహచర్యంతో ఆయన సంపాదకత్వంలోని   ‘మీజాన్‌’ పత్రికలో ‘జర్నలిస్టు’గా చేరారు. తెలంగాణ సాయుధ పోరాటం మీద అనేక వ్యాసాలను ప్రచురించి, ఆ పత్రికను ‘ఆంధ్ర మహాసభ’ ఉద్యమ దర్పణంగా మలిచారు. 1945లో మీజాన్‌ను ‘దొడ్డి కొమరయ్య ప్రత్యేక సంచిక’గా వెలువరించడమేకాక, అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ సాయుధ పోరాట సేనాని రావి నారాయణరెడ్డితో ఇంటర్వ్యూ చేసి, దాన్ని ఆ సంచికలో వేశారు. ఆ సంచిక సంపాదకీయాన్నీ కొమరయ్య ఫోటో కింద ‘‘లేచింది లేచింది ఒక విప్లవజ్వాల’ అనే గేయభాగాన్ని రాసింది రాంభట్లే.


1945లో ఉర్దూ మీజాన్‌లో పొలిటికల్‌ కార్టూన్లు వేసిన ‘రాంభట్ల’ 1946, 47 సంవత్సరాలలో తెలుగు ‘మీజాన్‌’లో నైజామ్‌ నవాబును, ఆయన కొలువులో పనిచేసే మంత్రుల్నీ అధిక్షేపిస్తూ ‘కార్టూన్‌ కవితలు’ రాసి, తెలుగులో ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 1946లో ‘నైజాము నవాబును నారాయణగూడా చౌరస్తాలో ఉరితీయాలి’ అనే సంపాదకీయాన్ని రాంభట్ల రాశారు. ఆ సంచికను  నైజామ్‌ రాష్ట్ర ప్రధానమంత్రి మీర్జా ఇస్మాయిల్‌ దగ్గర పీఆర్‌ఓగా పనిచేసిన కుందూరి ఈశ్వరదత్‌ చదివి, ఆ పత్రిక బయటపడితే దాని సంపాదకుడు అడవిబాపిరాజును ఉరితీస్తారని భయపడి, ఆ సంచిక ప్రతులన్నీ తెప్పించుకుని తగుల బెట్టించాడు.


1946లోనే బహుశా భారతదేశంలోనే మొట్టమొదటి జర్నలిస్టుల సమ్మెను నిర్వహింపజేసిన ఘనత కూడా రాంభట్లకు దక్కుతుంది. ప్రూఫ్‌ రీడర్ల జీతాలను పెంచాలంటూ 18 రోజుల పాటు ‘మీజాన్‌’ పత్రికలోని సిబ్బంది అంతా సమ్మెచేసి విజయం సాధించారు. 


1948 ఫిబ్రవరిలో ‘మీజాన్‌’ పత్రికకు రాజీనామాచేసి, మద్రాసు చేరారు. జూన్‌లో విజయవాడ నుండి వెలువడిన ‘తెలుగుదేశం’ పక్షపత్రికలోను, 1949–-51ల్లో మద్రాసు నుండి వెలువడిన ‘సందేశం’ పత్రికలోనూ సంపాదకవర్గ సభ్యునిగా పనిచేసిన రాంభట్ల 1952లో ‘ప్రజా శక్తి’ బై వీక్లీలోనూ, 1952 జూన్‌ నుండి ‘విశాలాంధ్ర’ దినపత్రికలోనూ ఉప సంపాదకునిగా పనిచేశారు. అలాగే ‘ప్రజాశక్తి’, ‘విశాలాంధ్ర’ల అక్షరాలను డిజైన్‌చేసిన ‘అక్షరశిల్పి’ కూడా రాంభట్లే.


1943లో ఆంధ్రప్రాంతంలో ‘అభ్యుదయ రచయితల సంఘం’ స్థాపింపబడిన కొద్దిరోజుల్లోనే అదే సంవత్సరం హైదరాబాద్‌లో చదలవాడ పిచ్చయ్యగారి పర్యవేక్షణలో అడవి బాపిరాజు అధ్యక్షులుగా, వట్టికోట ఆళ్వారుస్వామి కార్యదర్శిగా స్థాపించబడిన ‘నిజామాంధ్ర అభ్యుదయ రచయితల సంఘం’లో సభ్యులుగా చేరిన ‘రాంభట్ల’ 1973లో గుంటూరులో జరిగిన అరసం రాష్ట్ర మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై 1976వరకు కొనసాగారు. యువ రచయితలెందరికో సైద్ధాంతిక స్పష్టతను సమకూరుస్తూ మార్గనిర్దేశం చేశారు.


1951లో సీగ్రియా కుడ్యచిత్రాల నకళ్ళను సేకరించడానికి బాపిరాజుగారితో కలిసి ‘సిలోన్‌’ వెళ్ళొచ్చిన రాంభట్ల 1958లో సోవియట్‌ యూనియన్‌లోని ‘ఆర్మీనియా’ సందర్శించిన మొట్టమొదటి ప్రతినిధివర్గానికి నాయకత్వం వహించారు. 


1967లో భారత సోవియట్‌ సాంస్కృతిక సంస్థ (ఇస్కన్‌) హైదరాబాద్‌ నగర కార్యదర్శిగా పనిచేసిన రాంభట్ల 1968లో హైదరాబాద్‌లో జరిగిన ‘అఖిలభారత శాంతి మహాసభ’ ఆహ్వాన సంఘ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1969లో ‘ఇస్కన్‌’ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా ఎన్నికై 1974 వరకు కొనసాగారు. 1970వ దశాబ్దంలో ‘అభ్యుదయ రచయితల సంఘం’ పునర్నిర్మాణ ఉద్యమంలో గజ్జెల మల్లారెడ్డి, వై. విజయకుమార్‌లతో కలిసి కీలక పాత్ర పోషించారు.


వివిధ ప్రజాసంఘాల్లో క్రియాశీల కార్యకర్తగానూ, కార్యనిర్వాహకునిగానూ బాధ్యతలు వహిస్తూనే ప్రజానాట్యమండలి గాయనీగాయకులు పాడుకోవడానికి వీలుగా అభ్యుదయ గీతాలెన్నింటినో రాసి రచయితగానూ వాసికెక్కారు. ‘‘మృతవీరులారా! లాల్‌ సలామ్‌’, ‘అంగార గంగ’, ‘రండిరా! పదండిరా!’, ‘అదే అదే పతాక జైత్రయాత్ర’ వంటి రాంభట్ల రాసిన అనేక గీతాలు శ్రమజీవుల గీతాలకు ఒక నూతన వరవడిని దిద్దాయి.


‘‘యూజినీ పాటియార్‌’ అనే ప్రఖ్యాత ఫ్రెంచి కవి రాసిన ‘ఇంటర్నేషనల్‌’ అనే అంతర్జాతీయ గీతాన్ని ప్రపంచ వ్యాపిత కార్మికవర్గం పాడుకుంటున్న ప్రఖ్యాతబాణీలో, అన్యభాషా ఛందంలో తెలుగు అనువాదాన్ని చేశారు. ప్రముఖ ఉర్దూ కార్మిక వర్గ కవి ‘మఖ్దూం’ గీతాలు కొన్నింటిని తెలుగులోనికి అనువదించిన రాంభట్ల, ఏటుకూరి ‘ఎర్రజెండా’ పాటలకు రాసిన ‘సంజాయిషీ’ తెలుగు పీఠికా సాహిత్యంలో ఒక మైలురాయి.


1943లో సురవరం ప్రతాపరెడ్డిగారి ‘గోల్కొండ పత్రిక’కు వ్యాసాలు రాయడం ద్వారా సృజనాత్మక సాహిత్యంలోకి ప్రవేశించారు. 1953లో ఆంధ్ర రాష్ట్రానికి ‘కర్నూలు’ను రాజధాని చేసినప్పుడు, దానిపై అధిక్షేపాత్మకంగా ‘శశ విషాణం’ గీతాలు రాశారు. ఈ గీతాలు పుస్తక రూపంలో వెలువడినాయి. 1959లో కేంద్ర ప్రభుత్వం కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోసినప్పుడు ‘కేరళ బాగోతం’ అనే నృత్యరూపకం రాశారు. ‘ఆంధ్రప్రదేశ్‌ దర్శిని’లో చిత్రకళపై వ్యాసాన్ని రాశారు. అనేక కవితా సంపుటాలకు ప్రామాణికమైన పీఠికలను రాశారు.


దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా సాహిత్యరంగంలో కృషి చేసినప్పటికీ రాంభట్ల గురించి అనేకమందికి తెలియకపోవడానికి ప్రధానకారణం ఆయన కలం పేర్లతో రాయడమే. సొంతపేరుతో ఆయన రాసింది తక్కువే. ‘అగ్నివేశ’, ‘పుష్యమిత్ర’,‘అగ్నిమిత్ర’, ‘విశ్వామిత్ర’, ‘పాణిని’, ‘కవి రాక్షస’ ‘కృష్ణాంగీరస్‌’, ‘కృష్ణ’, ‘శశ విషాణం’, ‘కాట్రేని యెర్రయ్య’ మొదలైన అనేక కలం పేర్లతో రచనలు చేసిన రాంభట్ల కవిగా, విమర్శకునిగా, చిత్రకారునిగా, తెలుగులో తొలి రాజకీయ కార్టూనిస్టుగా, అభ్యుదయ సాహిత్యోద్యమ రథసారథిగా తెలుగు సారస్వత లోకంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి, సంచార విజ్ఞాన సర్వస్వం.

ఆచార్య ఎస్వీ సత్యనారాయణ

(నేడు రాంభట్ల కృష్ణమూర్తి శత జయంతి)

Advertisement
Advertisement
Advertisement