Abn logo
Mar 25 2020 @ 02:25AM

శార్వరి ఉగాది కవితలు

జన హితకారీ, శార్వరీ జయము జయము! 

నీ రాక కలిగించును శుభము శుభము! 

సాధారణ స్వాగతమే పలికెదము 

సాదర స్వాగతాలు దూరమే సుమ్ము

కరోనా కారణాన,

పరిస్థితుల దారుణాన 

కాలు బయట పెట్టలేము 

బంధుమిత్రులంతా చేరి 

తోరణాలు కట్టలేము 

షడ్రుచుల భోజనాలు పంక్తిగా చేయలేము 

పంచాంగ శ్రవణాలు భక్తిగా చేయలేము 

కవి గాయకులు గుమిగూడి 

కావ్యగానము పంచలేము

ఏమీ అనుకోకు మరి, శార్వరీ!

ఏకాంతపు పోరు సల్ప ప్రతిన బూనినాము. 

గుట్టుగా ఇంటిలోనే నిన్ను గుర్తుచేసుకుంటాము

ఇపుడు సర్వులమూ ఏకమై 

వైరి వైరస్‌ను నిర్వీర్యం చెయ్యాలి 

విశ్వమానవుడిదే విజయమంటూ సగర్వంగా చాటాలి.

శార్వరీ, ఆశీర్వదించరావే మా మేలు కోరి.

డి.వి.జి.శంకరరావు


వరము లీయరావమ్మ

శ్రీకరంబగు తెలుగుకి సిరులుయిచ్చి

చైత్రమాసపు అందాలు ధాత్రికిచ్చి

శిశిర రాల్చిన ఆకులు చివురులిచ్చి

శార్వరియను పేరబిరాన సాగిరామ్మ


ఆరు రుచులతో మనిషికి ఆశపోక

‍స్వార్థమును రుచిమరిగితా వాడిపోయె

డబ్బు డబ్బను జబ్బుతో గబ్బుగొట్టి

మమత మానవతను నేడు మంటగలిపె


మనిషి మనసులలో నేడు మార్పురాక

నేల నింగియు కాలుష్య గోళ మాయె

నేడు భూతాపములతోడ నిండిపోయె

స్వార్థ చింతన మనిషికి స్వాంతనాయె


అందుకే ‘కరోనా’ నేడు హడల గొట్టె

మా రజో తమో గుణములు మాడ్చివేసి

మనిషికికనైన మంచిని మమతనిచ్చి

సకల జనుల యుగాదివై శాంతినిచ్చి

వరయుగాదమ్మ రావమ్మ వరములీయ

రాఘవ మాస్టారు


కాసేపు ఆగిపోదాం!

అవును, చాలానే పరుగెత్తాం

అడవినుంచి అవసరపు కాలిబాటలనుంచి

కల్మిడినుంచి, కల్మశమెరుగని కలగలుపుతనం నుంచి

ఉమ్మడి బతుకుల ఇచ్చిపుచ్చుకోవడాల ఆవాసాల నుంచి

పరుగెత్తీ పరుగెత్తీ మనం చాలా దూరమే వచ్చాం

భూమినే కాదు పాదాల్నీ మరిచేంతగా

ఊరునే కాదు ఇల్లునూ మరిచేంతగా

నిన్నటినే కాదు ఇవాల్టినీ మరిచేంతగా

చాలా చాలానే పరుగెత్తాం, సోయిని పోగొట్టుకుంటూ!

తోసుకుంటూ తరుముకుంటూ తొక్కుకుంటూ 

కసురుకుంటూ కరుచుకుంటూ కాటేసుకుంటూ

గెలవడానికి అమాంతంగా ఆక్రమించుకోవడానికి

ప్రాణాల్నీ ప్రాణప్రదమైన విలువల్నీ బలి తీసుకుంటూ

అసహన అహంకారంతో భీకరంగా పరుగెత్తాం

ఏమయింది? జీవన విశ్వాస ధాతువుల్ని కోల్పోయాం

విష వాయువుల్లో చిక్కుకుపోయాం

ఇప్పుడిక ముక్కుల్నీ మూతుల్నీ మూసుకోవాల్సిన కాలమొచ్చింది

చాలికచాలు! ఈ పిచ్చి పరుగు చాలు!

ఇప్పుడిక కాసేపు ఆగిపోదాం అర్ధవంతంగానే!

మనం మనుషులమని మననం చేసుకోవడానికి

మన ఇంటిని మనం ఆత్మీయంగా హత్తుకోవడానికి

మన కళ్ళనూ కాళ్ళనూ గుండెలయనూ గుర్తెరగడానికి

మన బతుక్కి దయతో ధారాళంగా దీవెనలనిస్తున్న 

ఈ మట్టికీ చెట్టుకూ నీటికీ నింగికీ నిఖిలానికీ

కుదురుగా దండం పెట్టుకోవడానికి

మరిక మలినపరచబోమని వాటికి మాటివ్వడానికీ

కాసేపు ఆగిపోదాం ఇష్టపూర్వకంగా!

ప్రాణ దీపాన్ని కాపాడే వైద్యునికీ, ఆసుపత్రికీ

బతుకు గింజలనిచ్చే కర్షకుడికీ కూలీకీ

శోధనలో నిమగ్నమైన సుదూర శాస్త్రజ్ఞుడికీ,

వంచన చేయక బ్రతికే ప్రతి సామాన్యుడికీ 

కృతజ్ఞత చెప్పుకోవడానికి కాసేపు ఆగిపోదాం

పనిలో పనిగా బతుకును రెండు చేతుల్తోనే కాదు

మనసుతోనూ శుభ్రంగా కడుక్కోవడానికీ!

దర్భశయనం శ్రీనివాసాచార్య

Advertisement
Advertisement
Advertisement