అక్టోబర్ 4 నుంచి ఉమ్రా తీర్థయాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-23T14:01:19+05:30 IST

అక్టోబర్ 4 నుంచి ఉమ్రా తీర్థయాత్రను తిరిగి ప్రారంభిస్తున్నట్లు సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది.

అక్టోబర్ 4 నుంచి ఉమ్రా తీర్థయాత్ర ప్రారంభం

రియాధ్: అక్టోబర్ 4 నుంచి ఉమ్రా తీర్థయాత్రను తిరిగి ప్రారంభిస్తున్నట్లు సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ఏడు నెలల పాటు సౌదీ సర్కార్ ఉమ్రా తీర్థయాత్రను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా, మొదటి విడతగా అక్టోబర్ 4 నుంచి రోజుకు 6వేల మందికి(సౌదీ పౌరులు, నివాసితులకు మాత్రమే) ఉమ్రా తీర్థయాత్రకు అనుమతి ఇస్తామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇతర దేశాల నుంచి వచ్చే సందర్శకులను మాత్రం నవంబర్ 1 నుంచి అనుమతి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అప్పటి వరకు ఉమ్రా సామర్థ్యాన్ని రోజుకు 20వేల మంది యాత్రికులకు పెంచనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోయిన తర్వాత ఉమ్రా పూర్తి సామర్థ్యంతో తిరిగి ప్రారంభించడానికి అనుమతించబడుతుందని పేర్కొంది. 


కరోనా వైరస్ పవిత్రమైన నగరాలకు వ్యాప్తి చెందుతుందనే భయంతో సౌదీ అరేబియా మార్చిలో ఉమ్రాను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు వార్షిక హజ్‌ యాత్రికులను కూడా తగ్గించింది. బయటి దేశాలకు చెందిన యాత్రికులను హజ్ యాత్రకు అనుమతించలేదు. అయితే, పవిత్ర స్థలాలను సందర్శించాలన్న స్వదేశీ, విదేశాలలో ఉన్న ముస్లింల ఆకాంక్షల మేరకు ఉమ్రాను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ చెప్పింది.


ఇక సౌదీలోని మక్కా, మదీనా ప్రతి సంవత్సరం మిలియన్ల మంది యాత్రికులను ఆకర్షించే పవిత్ర స్థలాలు. ఈ రెండు సౌదీ అరేబియాకు కీలకమైన ఆదాయ వనరులు కూడా. 2030 నాటికి ఏటా 30 మిలియన్ల మంది యాత్రికులను కింగ్‌డమ్‌కు స్వాగతించాలని సౌదీ సర్కార్ భావిస్తోంది.  


Updated Date - 2020-09-23T14:01:19+05:30 IST