సవర సంస్కృతీ దర్పణాలు గిడుగు కథలు

ABN , First Publish Date - 2021-08-29T05:57:22+05:30 IST

సవర భాష కోసం నిరంతరం పరిశ్రమించిన పండిత మాన్యుడు గిడుగు రామమూర్తి పంతులు. సవరల భాష, యాస, సంస్కృతుల పట్ల ఆయనకు 1880లోనే ఆసక్తి కలిగింది. మన్యప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేయటం ఇందుకు ప్రధాన కారణమనిపిస్తుంది...

సవర సంస్కృతీ దర్పణాలు గిడుగు కథలు

సవర భాష కోసం నిరంతరం పరిశ్రమించిన పండిత మాన్యుడు గిడుగు రామమూర్తి పంతులు. సవరల భాష, యాస, సంస్కృతుల పట్ల ఆయనకు 1880లోనే ఆసక్తి కలిగింది. మన్యప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేయటం ఇందుకు ప్రధాన కారణమనిపిస్తుంది. కొందరు ఆలోచించి వదిలేస్తారు. కొంతమంది మాత్రమే ఆలోచించి ఆచరిస్తారు. అతి కొద్దిమంది మాత్రమే లోతైన అధ్యయనంతో విజయం సాధిస్తారు. గిడుగు రామమూర్తి  ఇటువంటివారే. సవరభాషకు ఓ లిపిని ఏర్పాటు చేయడమే కాక, వారి జీవనసంస్కృతి మూలాల లోనికి దగ్గరగా వెళ్ళారు. అధ్యయనం చేశారు. వారి జీవితాలను చరిత్రగా రికార్డు చేశారు. సవరభాషకు నిఘంటువు, వ్యాకరణం కూర్చారు. పాటలని సేకరించారు. వాచకాలను రూపొందించారు. సవరభాష నేర్చుకోవటం తేలిక అనేది ఆయన భావన. గిడుగు రామమూర్తి పాండిత్యం ఎంతో నిర్మాణాత్మకౖమెనది. గ్రాంథిక భాషను ఖండించడం వెనుక ఉన్నది ఈ అంశమే! సవర భాష విషయంలో ఆయన చేసిన స్వయంకృషి శ్లాఘనీయం. 


సవరల జీవన విధానంలోని సంస్కృతి సంప్రదాయాలను వ్యక్తిగతౖమెన కార్యనిర్వహణ రంగాలను గిడుగువారు దగ్గరగా పరిశీలించారు. వాటిని ‘సవర కథలు’గా రాశారు. ‘సవర భాషలో నేను వ్రాసిన మొదటి పుస్తకంలోని కథలకు ఇంచుమించుగా సరైన తెలుగు చేసి ఈ పుస్తకం వ్రాసినాను. ఈ సవర – పుస్తకంలోని కథలన్నీ ఇంగ్లీష్‌లో ఉన్న ఈసపు కథలను పట్టి వ్రాసినాను’ అని ఆయన ఆ పుస్తకం ముందుమాటలో చెప్పారు. ప్రతి వాక్యాన్ని సవరలకు వినిపించి, వారి సవరణలు, సలహాలు, సూచలను అనుసరించి తిరగ రాశారు. కథలలోని విషయాలు సవరల వ్యవహారాన్ని అనుసరించి వాళ్ళకు తెలిసేటట్లు చేర్పులు మార్పులు చేశారు. కనుక ఈ సవర కథలు సవరల నిజజీవన చిత్రణ దృశ్యాలు.. సాక్ష్యాలు. ‘కోదుల భాషలో ముగ్గురు నలుగురు కొన్ని పుస్తకములు వ్రాసినారు. కాని.. సవర భాషలో ఇదివరకు ఎవరూ పుస్తకాలను వ్రాయలేదు. నేను వ్రాసినవే మొదటి పుస్తకాలని’ గిడుగువారు చెప్పుకున్నారు.


‘ఫిక్షన్‌ అండ్‌ ది రీడింగ్‌ పబ్లిక్‌’ అనే పుస్తక రచయిత క్యు.డి.లీవీస్‌ కథను గూర్చి చెబుతూ కథ ప్రధాన లక్షణమైన క్లుప్తత కేవలం రూపానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. జీవితానికి, జీవిత దృక్పథానికి రూపం. జీవితంలోని ఒక ముక్కను తీసుకుని దానికి వ్యక్తిత్వం ఇవ్వాలన్న ఆకాంక్షలోంచి కథకు రూపం వచ్చిందంటారు. కథల్లో కొద్దిమంది లేదా ఒక జీవితం కొన్ని శకలాలుగా గోచరమవడం పాఠకులకు కొత్త కాదు. కానీ తనకు తెలియని ప్రపంచంలోని భాష, వ్యక్తులు, జీవన విధానాలను కథలుగా మలచడంలో ఎన్నో ఇబ్బందులున్నాయి. చదువరి వీటిని తనవిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో గురించి వారంటే తెలియని వారు ఎందుకు తెలుసుకోవాలి? అటువంటి కథలు ఎందుకు చదవాలి? ఇవి సామాన్య చదువరుల ప్రశ్నలు. ప్రపంచీకరణ నేపథ్యంలో సాహిత్యం కొత్త సిద్ధాంతాలను, వాతావరణాలను సృష్టించుకుంటూ వస్తున్నది. మన చుట్టూ ఉన్న సమాజం నాగరికత ఆనవాళ్ళు అభివృద్ధి పరంగా శరవేగంగా మార్పుకు లోనవుతున్నది. కాని అలాలేని జీవితాలున్నాయి. జీవన గమనాలున్నాయి. ఎటువంటి కృతక వర్ణాలను అంటించుకోని స్వచ్ఛమైన మన్యాలున్నాయి. వాటిలో ప్రజాసమూహాలున్నాయి. ప్రకృతి వారికి పాఠశాల.. కూడు, గుడ్డ, భాష కూడా అక్కడ నుంచి వచ్చినదే. భయంకరౖమెన క్రూరమృగాలు, సాధు జంతువులు వారిని దగ్గరగానే చూస్తాయి. వారు కూడా వాటితో సహజీవనం చేస్తారు. సవరలు ఇందుకు మినహాయింపు కాదు. సవర దక్షిణ ముండాభాష. ఆస్ర్టో–ఏషియాటిక్‌ భాషా కుటుంబంలో ఒక శాఖ ముండాభాషలు. ఒడిషాలోని గంజాం జిల్లాలో ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా కనిపించే సవరల జనాభా ఐదులక్షలకు పైనే. వీరు పోడు వ్యవసాయం చేస్తారు. వీరి గృహాలు ఒకదానికెదురుగా మరొకటి ఉంటాయి. వీరి భాషలో గ్రామాన్ని గొర్భాం అంటారు. అంటువ్యాధుల వల్ల, పులి, అగ్ని వంటి వాటి ప్రమాదాల వల్ల జనం చనిపోతే ఆ గ్రామాన్ని వదిలి వేరే చోటుకు వెళ్ళిపోతారు. నేటికీ వారిని అనాగరికులుగానే సభ్య సమాజం గుర్తిస్తుంది. మనిషికి ఆత్మకు మధ్య ఉన్న సంబంధాన్ని గాఢంగా నమ్ముతారు. ఆత్మల్లోకి మనుషులు ప్రవేశించగలరనే విశ్వాసాలు ఉన్నాయి వారికి. వీటిని గిడుగువారు దగ్గరగా చూశారు. తనవిగా భావించారు. వారితో కలసిమెలసి సవరభాషకు ఓ శాశ్వతను తీసుకువచ్చారు. వీటినే ‘సవర కథలు’ ద్వారా అందించారు.


‘సవర కథలు’ చాలావరకు చిన్న పిల్లల కథలు వలే ఉన్నా సవరల మనస్తత్వాన్ని చెబుతాయి. సవరల జీవితాల్లోని ఓ తాత్వికతతో కూడిన విశ్వాసాలున్నాయి. వాటి వెనుక నీతివంతమైన వ్యవహారాలున్నాయి. కష్టపడే తత్వాన్ని నీతి ఆవహిస్తే స్వచ్ఛత కనిపిస్తుంది. ఇది ప్రకృతి గుణం. ‘నక్కా – గద్దా’, ‘మూడు పిల్లులు – కోతి’, ‘గొప్పవాడి కథ’, ‘అత్యాశగల ఒక మనిషి’ వంటి కథలలోని నీతిని సవరల జీవనవిధానంలోని భాగంగా భావించడం కన్నా, వారి మనస్తత్వాన్ని, మానవతా దృక్పథాన్ని పరోక్షంగా చెబుతాయి. ఈ కథలలోని రెండవ పుస్తకం ముందుమాటలో ‘ఇందులోని కథలు అన్నీ సవర వాళ్ళు నా ఎదుట చెప్పినవే. ఇంచుమించుగా వాళ్ళ మాటలే’ అంటారాయన. ఈ సంపుటంలోని కొన్ని కథలు వారు విన్నవి. కొన్ని కల్పనలు. కొన్ని కథలు వారివే. సవరలు పచ్చిబూతులు యథేచ్ఛగా ఉపయోగిస్తారు. అవి ఈ కథల్లో లేకుండా చూశారు గిడుగువారు. ఈ కథల్లో సవర జీవన విధానంతో పాటు వారి భాషను కూడా ఆయన సహజంగా గిడుగువారు ప్రతిపాదించారు. నాలుగో భాగం సవర కథల్లో పూర్తిగా సవరలకు సంబంధించిన జీవన విధానపు భాషా వ్యవహారం కనిపిస్తుంది. ఇళ్ళు, పొలం, సంత, తగవులు, పూజలు, కల్లు తాగడం, సోది, కేసులు, పోలీసులు, జడ్జిలు, రోగాలు వంటి సందర్భాల్లో వారి సంభాషణలోని సహజత్వాన్ని గిడుగు అందించారు. సవర భాషాలిపికర్తగా, వ్యవహారిక భాషా ఉద్యమ కారుడిగా చరిత్రకెక్కిన ఆయనకు, వర్తమానంలో ఎదురవుతున్న అవరోధాలన్నిటి నుంచి తెలుగు భాషను కాపాడుకోవటమే మన అర్పించే నిజౖమెన నివాళి.

భమిడిపాటి గౌరీశంకర్‌

Updated Date - 2021-08-29T05:57:22+05:30 IST