యువతకు పొదుపే తారకమంత్రం

ABN , First Publish Date - 2021-03-21T06:18:25+05:30 IST

‘ధనమూలమిదం జగత్‌’ అన్నది నానుడి. ప్రపంచం అంతా డబ్బుతోనే ముడిపడి ఉంది. ఒక అడుగు ముందుకు వేయాలన్నా, ఏదైనా నచ్చింది కొనాలన్నా, ప్రత్యేక రోజుల్లో ఇష్టమైన వారికి ఏదైనా బహుమతి అందించాలన్నా అన్నింటికీ డబ్బు కావాలి

యువతకు పొదుపే తారకమంత్రం

‘ధనమూలమిదం జగత్‌’ అన్నది నానుడి. ప్రపంచం అంతా డబ్బుతోనే ముడిపడి ఉంది. ఒక అడుగు ముందుకు వేయాలన్నా, ఏదైనా నచ్చింది కొనాలన్నా, ప్రత్యేక రోజుల్లో ఇష్టమైన వారికి ఏదైనా బహుమతి అందించాలన్నా అన్నింటికీ డబ్బు కావాలి. యువతరం, ప్రత్యేకించి మిలీనియల్స్‌ నుంచి వచ్చే ఫిర్యాదు ఇదే. ఏం చేయాలన్నా తగినంత డబ్బు లేదని చెప్పడం పరిపాటి. ప్రస్తుత వినియోగ ఆధారిత ప్రపంచంలో డబ్బు ఆదా చేయడం అంత తేలికైన పని కాదు. ఉజ్వల భవిష్యత్తు కావాలన్నా, ఆర్థిక భద్రత సాధించాలన్నా మన సంపాదనలో ఎంతో కొంత పొదుపు చేయడం తప్పనిసరి.  పొదుపు ప్రారంభించేందుకు మిలీనియల్స్‌కున్న మార్గాలు..  


వ్యయాలకు కోత

పొదుపు ప్రారంభించేందుకు తొలి అడుగు అనవసర వ్యయాల కోత. వృధా వ్యయాలను ఎంతగా తగ్గించుకోగలిగితే అంత డబ్బు చేతిలో ఉంటుంది. ఇందుకోసం ఖర్చులు ట్రాకింగ్‌ చేయడం ప్రధానం. అందులోనూ క్రెడిట్‌ కార్డులు లేదా డెబిట్‌ కార్డులతో చెల్లింపులు చేసే ప్రస్తుత యుగంలో ఇది అత్యంత కీలకమైన అడుగు. ఇందు కోసం కనీసం ఆరు నెలల బ్యాంకు అకౌంట్‌  రివ్యూ చేపట్టి ఎక్కడెక్కడ వృధా వ్యయాలు జరుగుతున్నాయో గుర్తించాలి. ఉదాహరణకి, ఒక స్టోర్‌కి వెళ్తే ఒకటి కొంటే ఒకటి ఉచితం; ఒకటి కొంటే రెండు ఉచితం వంటి ఆఫర్లు ఆకర్షిస్తూ ఉంటాయి. అలాంటి ఆఫర్ల వలలో పడి అవసరం లేకున్నా ఉచితమే కదా అని కొనడం పరిపాటి. అలాగే ఆఫీసుకు వెళ్లేందుకు చాలా మంది ఉబర్‌, ఓలా వంటి క్యాబ్‌లను అశ్రయిస్తూ ఉంటారు. దానికి బదులు మీ ప్రాంతం నుంచి ఆఫీసుకి వెళ్లే కొలీగ్‌ ఎవరైనా ఉంటే అతని కారు లేదా బైక్‌ షేర్‌ చేసుకోవడం ఉభయతారకంగా ఉంటుంది. పొదుపు చేయాలనుకునే వారు ఇలాంటి ఖర్చులను నియంత్రించుకోవాలి.


క్రమం తప్పకుండా పొదుపు

ఏదైనా విపత్తు ఎదురైతే ఆర్థిక భద్రత కోసం కొంత సొమ్ము పొదుపు చేసుకోవడం అవసరం. ఉదాహరణకు, ఇటీవల మనందరినీ ఆర్థికంగా కుదిపివేసిన కరోనా విపత్తునే తీసుకుందాం. లాక్‌డౌన్‌ కారణంగా అన్ని కార్యకలాపాలు స్తంభించిపోవడంతో లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు ఆదుకునేందుకు ప్రతీ నెలా వేతనంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలి. చాలా మంది తమ వద్ద ఉన్న అదనపు వనరులను సేవింగ్స్‌ ఖాతాలో ఉంచేస్తారు. అలా కాకుండా ఒక ఆర్‌డీ ఓపెన్‌ చేసి ప్రతీ నెలా నిర్దిష్ట మొత్తం  అందులో పొదుపు చేస్తూ ఉంటే ఏడాది తిరిగే సరికి 6 నుంచి 8 శాతం రాబడితో ఆ సొమ్ము చేతికి అందుతుంది. ఆర్‌డీకి ప్రత్యామ్నాయంగా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల నిర్వహణలోని క్రమానుగత పెట్టుబడి స్కీమ్‌లు (ఎస్‌ఐపీ) కూడా ఎంచుకోవచ్చు.


ఆటో డెబిట్‌లో చెల్లింపు

పొదుపు చేయాలనుకుంటున్నారు సరే. కాని ప్రతీ నెలా నిర్ణయించుకున్న సొమ్ము మీకు మీరుగా కట్టాలనుకుంటే  అది చాలా కష్టం. ఏదో ఒక ఖర్చు మనకి కనిపిస్తూ ఉంటుంది. వచ్చే నెల వేద్దాంలే అనుకుంటే ఆ డబ్బు ఖర్చు చేసేస్తాం. అలా కాకుండా మీరు ఎంత పొదుపు చేయాలనుకుంటున్నారో అంత మొత్తం బ్యాంకు ఖాతా నుంచి నేరుగా చెల్లించే ఏర్పాటు చేయండి. మీరు నిర్ణయించిన తేదీ నాటికి, నిర్ణయించిన మొత్తాన్ని బ్యాంకు ఖాతా నుంచి ఉపసంహరించి ఆ మొత్తాన్ని బ్యాంకు నేరుగా చెల్లిస్తుంది. దీని వల్ల మీరనుకున్న సొమ్ము మీరు నిర్ణయించిన తేదీకి మీ పొదుపు ఖాతాలో జమ అయిపోతుంది.


పార్ట్‌టైమ్‌ ఉద్యోగం 

తమకున్న నైపుణ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఏదైనా పార్ట్‌టైమ్‌ జాబ్‌ చూసుకోవడం కూడా మంచిది. మనం ఆఫీసులో గడిపేది ఆరేడు గంటలనుకుంటే కనీసం మరో రెండు గంటలైనా అదనపు సమయాన్ని ఉపయోగించుకుని ఆ సమయంలో ఇలాంటి ఉద్యోగాలేవైనా అందుబాటులో ఉంటే చేయవచ్చు. ‘వేన్నీళ్లకి చన్నీళ్లు’ అన్నట్టుగా అదనపు ఆదాయం అందుబాటులో ఉండి ఆ మొత్తాన్ని పొదుపు చేసుకోగలుగుతారు. ఇంకెందుకాలస్యం, వ్యూహం రచించుకోండి... కార్యరంగంలోకి దిగండి. 

Updated Date - 2021-03-21T06:18:25+05:30 IST