Abn logo
Oct 12 2021 @ 02:15AM

నవరత్నాల జాతర... సంక్షేమానికి పాతర

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పథకాలు మాయంబడుగుల అడుగుల్లో ముళ్లకంచెలు

రెండేళ్లుగా మైనారిటీ స్కీంలు నిర్వీర్యం

వారికి పండగ కానుకలూ నిలిపివేత

విద్యోన్నతి, విదేశీవిద్యలకు చెల్లుచీటి 

మూతబడిన బెస్ట్‌అవైలబుల్‌ స్కూళ్లు

కల్యాణకానుక, కులాంతర వివాహాలపై 

కొరవడిన సర్కారు శ్రద్ధ

అటకెక్కిన భూమి కొనుగోలు పథకం

మైనారిటీ తోఫాలకు అదే గతి..


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నవరత్నాల మాటున సంక్షేమ కార్యక్రమాలకు స్వస్తి పలుకుతున్నారు. అట్టడుగున ఉన్న వారికి ప్రోత్సాహకాలు అందించి సంక్షేమ ప్రయోజనాలు అందించాల్సిన  ప్రభుత్వం, ఆ దిశగా నడవడం లేదన్న విమర్శలొస్తున్నాయి. బడుగు, బలహీనవర్గాల కోసం గతంలో ప్రత్యేకంగా ఎన్నెన్నో పథకాలు ఉండేవి. ఆ పథకాలన్నీ రద్దు చేసి అందరికీ పంచినట్లే వారికి కూడా నవరత్నాలను పంచుతుండటం బడుగుల్లో అసంతృప్తిని రాజేస్తోంది. విదేశీవిద్య, విద్యోన్నతి, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లు, కల్యాణకానుక, కులాంతర వివాహాల ప్రోత్సాహకాలు, సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌ కానుకలకు చెల్లుచీటీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువ మంది నివసిస్తున్న ప్రాంతాల్లో వివాహాలు, వేడుకలు నిర్వహించేందుకు అవసరమైన కమ్యూనిటీ భవనాల నిర్మాణాలను అప్పటి ప్రభుత్వం తలపెట్టింది.  బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా పంచాయతీ స్థాయిలో బీసీ భవన్‌లకు రూ.10లక్షలు, మండలస్థాయిలో రూ.25 లక్షలు, జిల్లా స్థాయి బీసీ భవనాలకు రూ.50 లక్షల అంచనాలతో పనులు మంజూరుచేసింది.


రూ.165 కోట్లతో 1187  బీసీ కమ్యూనిటీ హాళ్లు, 12 బీసీ భవనాల కోసం రూ.56.47 కోట్లు మంజూరుచేశారు.  వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులన్నీ రద్దు చేయడంతో నిర్మించతలపెట్టిన భవనాలు ఆగిపోయాయి.  గత ప్రభుత్వం ప్రతి ఎస్సీ, ఎస్టీ  కాలనీలోనూ ఒక్కో కమ్యూనిటీ హాల్‌ చొప్పున వందలాది నిర్మాణాలను మంజూరుచేసింది. జిల్లా కేంద్రాల్లో రూ.ఐదు కోట్లతో అంబేడ్కర్‌ భవనాలను మంజూరుచేసింది.  కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పనులన్నింటికీ స్వస్తి పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామ, పట్టణాల్లో మంజూరైన లక్షలాది ఇళ్లను రద్దు చేయడంతో అందులో నిర్మాణంలో ఉన్న ఎస్సీ, ఎస్టీల ఇళ్లన్నీ రద్దయ్యాయి. దీంతోపాటు ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసిన వారికి బిల్లులు కూడా పెండింగ్‌లో పెట్టారు. 


కానుకలకు కాలదోషం!

చంద్రన్న పెళ్లికానుక పథకం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ వధువులకు పారితోషికం అందించింది. బీసీలకు రూ.35 వేలు, ఎస్టీ, మైనారిటీలకు రూ.50 వేలు ఇచ్చింది. పెళ్లి సమయానికి వధువు బ్యాంకు ఖాతాలో జమయ్యేలా చర్యలు తీసుకున్నారు. బీసీలను కులాంతర వివాహం చేసుకుంటే అంతకు ముందు రూ.10 వేలు ఇస్తుండగా చంద్రబాబు ప్రభుత్వం రూ.50 వేలకు పెంచింది. ఈ పథకాలన్నీ సింగిల్‌డెస్క్‌ విధానంలో అమలు చేశారు. గతంలో వివిధ పథకాలకు వివిధ అర్హతలున్నా, చంద్రన్న పెళ్లి కానుక సింగిల్‌ డెస్క్‌ ద్వారా ఒకే విధానాన్ని పాటించారు. జగన్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పారితోషికాన్ని పెంచారు. అయితే బడ్జెట్‌లో చంద్రన్న పెళ్లికానుకకు పైసా కేటాయించకపోవడంతో వాటి అమలు నిలిచిపోయింది. ముస్లిం వర్గాలకు అప్పటి ప్రభుత్వం అందించిన దుల్హన్‌ పథకం ఎంతో ప్రయోజనం కలిగించేది. కొంత మంది పేద ముస్లిం కుటుంబాలు వారి బిడ్డలకు పెళ్లిళ్లు చేసే క్రమంలో ఆర్థికభారం మోస్తున్నాయి. ప్రభుత్వం వధువులకు రూ.50 వేల ఆర్థిక సాయం చేయడంతో ఈ కుటుంబాలు ఎంతో ఊరట చెందాయి. ఆ పథకానికి ఎంతో ప్రాచుర్యం లభించింది. అయితే జగన్‌ ప్రభుత్వం పెళ్లికానుక పథకాలన్నిటికీ స్వస్తి పలికింది. కులాంతర వివాహాలు చేసుకుంటున్న వర్గాలకు ఇస్తున్న పారితోషికం కూడా ఇవ్వకుండా నిలిపేసింది. 


విదేశీ చదువులకు మంగళం

విదేశాల్లో చదవాలనుకున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ  యువతకు చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్‌ విదేశీవిద్య పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఎంబీబీఎస్‌, ఎంఎస్‌ లాంటి కోర్సులు విదేశాల్లోని ప్రముఖ వర్సిటీల్లో చదవాలనుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇది వరంలా ఉండేది. ఈ పథకం ద్వారా 18 దేశాల్లో 16 రకాల కోర్సులు చదివేందుకు పేద విద్యార్థులకు ఏటా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించేవారు. జగన్‌ ప్రభుత్వం రాగానే పథకాన్ని రద్దు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు సివిల్‌ సర్వీ్‌సకు ప్రిపేరయ్యేందుకు అవసరమయ్యే శిక్షణ కూడా విద్యోన్నతి పథకం ద్వారా గతంలో రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఢిల్లీ, హైదరాబాద్‌ తదితర ప్రముఖ నగరాల్లో బెస్ట్‌ కోచింగ్‌ సెంటర్లలో శిక్షణతో పాటు వారి హాస్టల్‌ ఖర్చులకు ఆర్థిక సాయం చేసింది. ఇప్పుడు విదేశీ విద్య, విద్యోన్నతి పథకాలు రద్దు చేశారు. దీంతో వేల మంది పేద ఎస్సీ విద్యార్థుల ఆశలు అడియాసలయ్యాయి. పదోతరగతి లోపు విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యఅందించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాలు బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల పథకాన్ని అమల్లోకి తెచ్చాయి.  కార్పొరేట్‌ స్కూళ్లలో చదివించి ఏటా మెరికల్లాంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు మెరుగైన విద్యను గతంలో అందించేవారు.  ఈ పథకాల స్థానంలో జగనన్న అమ్మఒడి, విద్యాదీవెన పథకాలనే ప్రభుత్వం చూపిస్తోంది. అమ్మఒడి ఉంటే ఈ పథకాలన్నీ ఎందుకని అన్నిటినీ రద్దు చేసింది. అందరితో పాటే ఈ పథకాలను అమలు చేస్తున్నారని,  ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏం చేసిందని  పలువురు ప్రశ్నిస్తున్నారు.


అంబేడ్కర్‌ వనానికి గ్రహణం

దళితజాతి ఆత్మగౌరవ ప్రతీక అంబేడ్కర్‌. ఆయన 125వ జయంతి సందర్భంగా టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి నడిబొడ్డున శాకమూరులో స్మృతివనం ఏర్పాటుచేయాలని తలపెట్టింది. 20 ఎకరాల విస్తీర్ణంలో  125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం, మెమోరియల్‌ పార్క్‌, బుద్ధధ్యాన కేంద్రం, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించేందుకు శ్రీకారం  చు ట్టింది. అందుకోసం మొదట రూ.97.69 కోట్లు మంజూరుచేశారు. పనులుకూడా ప్రారంభమై, 22 శాతం పూర్తయ్యాయి. జగన్‌ వచ్చిన వెంటనే పనులను నిలిపేసింది. రాజధానిని తరలించే ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టింది. ఆ ప్రక్రియ పూర్తి కాకుండానే....వైఎస్‌ జయంతిని పురస్కరించుకుని అంబేడ్కర్‌ స్మృతివనంగా విజయవాడలోని స్వరాజ్‌ మైదానాన్ని మార్చాలని నిర్ణయించింది. దీంతో అమరావతిలో తలపెట్టిన స్మృతివనం నిర్మాణపనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. 


గిరిజన భూములకు ఎసరు

భూమి లేని గిరిజనులకు ప్రభుత్వమే కొని ఇచ్చే పథకం ... భూకొనుగోలు పథకం. గత ప్రభుత్వంలో బాగా పనిచేసిన ఈ పథకాన్ని జగన్‌ సర్కారు అటకెక్కించింది. ఒక్కో ఎకరాకు రూ.15 లక్షలు ఖర్చు చేసి గిరిజనులకు భూములను అప్పట్లో కొనుగోలు చేసి ఇచ్చారు. దీంతో పాటు ఎక్కడైనా గ్రామాల్లో నివేశన స్థలం దొరకపోతే.. స్థలం కొనుగోలు చేసి కేటాయించారు. నిధులు కేటాయించి వాటిని కొనుగోలు చేసి పంపిణీ చేసే అధికారం కలెక్టర్లకు కల్పించారు. అయితే ప్రస్తుతం ఈ పథకానికి నిధులు ఒక్క పైసా కేటాయించలేదు. పైగా ఎస్టీల భూములను లాక్కొని కొత్తగా ఇంటి స్థలాలు ఇస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పనులను గిరిజన కాంట్రాక్టర్లకే అప్పగించేలా అప్పట్లో ఓ పథకం తెచ్చారు. ముందస్టుగా చెల్లించాల్సిన డిపాజిట్‌ నుంచి మినహాయించి.. ఆర్థికంగా సహకారం అందించారు. కానీ, కొత్త ప్రభుత్వం మిగతా కాంట్రాక్టర్లతోపాటు గిరిజన కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులను కూడా నిలిపేసింది. చేపడుతున్న పనులన్ని ఆపేశారు. ఈ ఏడాది ప్రారంభించిన పనుల్లో వారికి అవకాశమివ్వలేదు. కొందరికి పనిచేసే అవకాశమిచ్చినా ఆ బిల్లులు పెండింగ్‌లో పడిపోయాయి. గిరిజన సంక్షేమశాఖ ద్వారా గిరిపుత్ర కల్యాణ పథకంలో కొత్త పెళ్లయిన ఎస్టీ వధువులకు గతంలో రూ.50 వేల పారితోషికాన్ని అందించారు. దీంతో పాటు కులాంతర వివాహాలు చేసుకుంటున్న యువతకు కూడా  ఆర్థిక సాయం అందించేవారు. 


పండగ తోఫాకు ధోకా

పండగలను పేదలు సంతోషంగా జరుపుకోవాలని వారికి టీడీపీ ప్రభుత్వం కానుకలు ఇచ్చేది. సంక్రాంతి, రంజాన్‌, క్రిస్మస్‌.. ఇలా ఏ పండగ వచ్చినా సరుకుల పంపిణీ జరిగేది. మైనారిటీ పేదలకు తోఫాలను ప్రకటించారు. ఈ క్రమంలో 10 లక్షల కుటుంబాలు రంజాన్‌తోఫాను, సుమారు రెండు లక్షల క్రిస్టియన్‌ కుటుంబాలు క్రిస్మస్‌ కానుకలు అందుకున్నాయి. అలాగే, తెల్లకార్డుదారులందరికీ సంక్రాంతి కానుక అందేవి. జగన్‌ ప్రభుత్వంలో ‘కానుకలు’ ఆగిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చర్చిలు, మసీదులకు భారీగా నిధులు కేటాయించింది. వీటన్నింటికి మరమ్మతులు, ఇతర భవనాల నిర్మాణాల కోసం నిధులు ఖర్చు చేశారు. జగన్‌ ప్రభుత్వం షాదిఖానాలకు మాత్రం రూ.10 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. దీంతో మిగతా నిర్మాణాలు ఎలా పూర్తి చేయాలో అధికారులకు అర్థం కావడం లేదు.