స్కూల్‌.. సవాల్‌!

ABN , First Publish Date - 2021-01-17T08:59:11+05:30 IST

దాదాపు ఎనిమిది నెలల అనంతరం వచ్చే నెల 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 9, 10వ తరగతుల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు

స్కూల్‌.. సవాల్‌!

500 స్కూళ్లలో మరుగుదొడ్లు లేవు

800 పాఠశాలల్లో నీటి వసతే లేదు

పారిశుధ్య సిబ్బంది నియామకాల్లేవు

వచ్చే నెలలో తరగతులు ప్రారంభమైతే

కొవిడ్‌ నియమ నిబంధనలు పాటించేదెలా?

కాలేజీల్లో 1400 గెస్ట్‌ లెక్చరర్ల కొరత

పోస్టులు భర్తీ చేయకుంటే బోధన కష్టమే

కాలేజీలో పాఠాలు 15 రోజులే 

ముందుగా థర్డ్‌, ఫైనలియర్‌ విద్యార్థులకు 

16 నుంచి ఫస్టియర్‌, సెకండియర్‌ క్లాసులు

హాస్టల్‌ గదిలో ఒక్కరికి మాత్రమే అనుమతి 

‘ఆంధ్రజ్యోతి’తో జేఎన్‌టీయూ రిజిస్ర్టార్‌ 

ప్రొఫెసర్‌ మన్జూర్‌ హుస్సేన్‌


హైదరాబాద్‌, జనవరి 16(ఆంధ్రజ్యోతి): దాదాపు ఎనిమిది నెలల అనంతరం వచ్చే నెల 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 9, 10వ తరగతుల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో విద్యాసంస్థల్లో మరుగుదొడ్లు, నీటి వసతి ఎంతో కీలకం. పాఠశాల తరగతులతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నా పారిశుధ్య సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. ఈ రెండు సమస్యలను ఇప్పటికిప్పుడు పరిష్కరించడం సర్కార్‌కు సవాల్‌గా మారనుంది.


ఈ విద్యాసంవత్సరం ఆన్‌లైన్‌ తరగతులు గత ఏడాది సెప్టెంబరు-1 నుంచి ప్రారంభించగా.. 50శాతం చొప్పున ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్తున్నారు. పారిశుధ్య సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే అనేకమార్లు ఫిర్యాదు చేసినా.. ప్రభుత్వమైతే స్పందించలేదు. ఇప్పుడు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. 


పారిశుధ్య కార్మికులే లేరు

ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది వరకూ పారిశుధ్య కార్మికులను ప్రభుత్వం ఒప్పంద ప్రాతిపదికన నియమించింది. పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా నెలకు రూ.1500-2500 వరకు చెల్లించేది. దీంతో ఈ సిబ్బంది మరుగుదొడ్ల పరిశుభ్రతతో పాటు ఇతర పరిశుభ్రత పనులపై దృష్టి పెట్టేవారు. కానీ, ఈసారి వీరిని కొనసాగించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లో పరిశుభ్రత బాధ్యతలను గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పంచాయతీలు, పట్టణాల్లో పురపాలికలకు అప్పగించింది. ఈ ఆదేశాలు ఎక్కడా అమలు కావట్లేదు. తమకే సరిపడా సిబ్బంది లేరని స్థానిక సంస్థలు చేతులెత్తేశాయి. సెప్టెంబరు-1 నుంచి అన్ని  ప్రభుత్వ పాఠశాలల్లో 50శాతం టీచర్లు హాజరవుతుండగా.. పారిశుధ్య సమస్యపై అసంతృప్తితో ఉన్నారు. కనీసం తరగతి గదులు ఊడ్చేవారు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఉపాధ్యాయ సంఘాలు సైతం పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. పరిష్కారం లభించలేదు. 


ఇవీ కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలు.. 

విద్యాసంస్థలు ప్రారంభిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం గత నవంబరులో విడుదల చేసిన మార్గదర్శకాలు.. 

పాఠశాలలోని ఫర్నిచర్‌, నీటి ట్యాంకులు, వంటగదులు, క్యాంటీన్‌, మరుగుదొడ్లు, ల్రైబ్రరీ.. అన్నిటినీ రసాయనాలతో శుభ్రం చేయాలి. 

పాఠశాలలో చేతులు కడుక్కునేందుకు శుభ్రమైన నీరు అందుబాటులో ఉండాలి. 

విద్యార్థుల శరీర ఉష్ణోగ్రత పరిశీలించేందుకు డిజిటల్‌ థర్మోమీటర్‌ ఉంచుకోవాలి. 

తరగతి గదిలో విద్యార్థుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండాలి. కూర్చునేందుకు బల్లలు వాడితే ఒక బల్లకు ఒకే విద్యార్థి ఉండాలి. 

విద్యార్థులు వచ్చే సమయాన్ని ముందే నిర్ణయించాలి. 

పాఠశాలకు వచ్చేందుకు ఒకటి కంటే ఎక్కువ గేట్లు ఉంటే.. అన్నింటినీ తెరిచి విద్యార్థుల రద్దీని నివారించాలి. 

విద్యార్థులు, తల్లిదండ్రులు సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించాలంటూ పాఠశాలల్లో మైకుల ద్వారా ప్రకటిస్తూ ఉండాలి. 

పాఠశాలల్లో ఉమ్మి వేయడం నిషేధం.

పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటే అన్ని తరగతులు ఒకేరోజు నిర్వహించకూడదు. షిఫ్టుల వారీగా తరగతులు ఏర్పాటు చేయాలి. విద్యార్థుల హాజరు వారాంతంలో తీసుకోవాలి. 

సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించడం సాధ్యం కానిచో పాఠశాలల్లో వార్షికోత్సవాలు, పండుగలు వంటివి నిర్వహించకూడదు. అసెంబ్లీని తరగతి గదుల్లో నిర్వహించుకోవచ్చు. 

తల్లిదండ్రులు సమ్మతిస్తేనే విద్యార్థులను అనుమతించాలి. హాజరు తప్పనిసరి కాదు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. 


గెస్ట్‌ లెక్చరర్ల భర్తీ ఎప్పుడు?

జూనియర్‌ కాలేజీల్లో సిబ్బంది కొరత అతిపెద్ద సమస్యగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 404 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 6వేల జూనియర్‌ లెక్చరర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం 900 మంది రెగ్యులర్‌, 3752 మంది కాంట్రాక్ట్‌ లెక్చరర్లు ఉన్నారు. కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సేవలను ఈ ఏడాది పొడిగించినా.. 1400 గెస్ట్‌ లెక్చరర్ల విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ కాలేజీల్లో గెస్ట్‌ లెక్చరర్ల పాత్ర కీలకంగా ఉంది. ఇప్పటికే సీబీఎ్‌సఇ బోర్డు పరీక్షల తేదీలను ప్రకటించినందున.. ఈసారి సెకండియర్‌ విద్యార్థుల సిలబ్‌సను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడం సవాల్‌గా మారింది. ఫిబ్రవరి1 నాటికి గెస్ట్‌ లెక్చరర్ల నియామకంపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే విద్యార్థులు తీవ్రంగా నష్టపోనున్నారు.


రాష్ట్రంలో 12,617 పాఠశాలలు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,617 పాఠశాలలు ఉండగా, వాటిలో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ స్కూళ్లు 4661 ఉన్నాయి. ఇవికాకుండా రెసిడెన్షియల్‌ స్కూళ్లు 1048, కేజీబీవీలు 475, మోడల్‌ స్కూళ్లు 194, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ 258, ప్రైవేట్‌ పాఠశాలలు 5,981 ఉన్నాయి. ఇవన్నీ ఫిబ్రవరి-1 నుంచి తెరచుకోబోతున్నాయి. ఇందులో రెసిడెన్షియల్‌, కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌, ప్రైవేటు పాఠశాలల్లో మరుగుదొడ్లు, పారిశుధ్య సిబ్బందికి ఇబ్బందులు లేకపోయినా.. ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. గత ఏడాది ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో దాదాపు 500కి పైగా ఉన్నత పాఠశాలల్లో మరుగుదొడ్లే లేవు. 800 పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా.. నీటి వసతి లేకపోవడంతో వృథాగా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఎప్పటికప్పుడు సబ్బు, శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం అత్యంత కీలకం. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే అతిపెద్ద సమస్యగా ఉంది. 

Updated Date - 2021-01-17T08:59:11+05:30 IST