‘గురుకులం’ బహుదూరం

ABN , First Publish Date - 2021-02-24T04:55:05+05:30 IST

ఉచితంగా కేజీటు పీజీ విద్యనందిస్తామని సామాజిక వర్గాల వారీగా గురుకులాలు ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి కనీసం సౌకర్యాలు కల్పించకపోవడంతో అవి ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి.

‘గురుకులం’ బహుదూరం
నేలపైనే బోజనాలు చేస్తున్న బాలికలు, కటికనేలపైనే నిద్రిస్తున్న బాలికలు

సమస్యల సుడిలో ఆశ్రమ పాఠశాలలు

భవనాలు, మౌళిక వసతులు కరువు

జిల్లాలు దాటుతున్న ఇల్లెందు ఏజెన్సీ గురుకులాలు

రూ.లక్షలు చెల్లిస్తూ అద్దె భవనాల్లో నిర్వహణ 

ఇల్లెందు, ఫిబ్రవరి 23: ఉచితంగా కేజీటు పీజీ విద్యనందిస్తామని సామాజిక వర్గాల వారీగా గురుకులాలు ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి కనీసం సౌకర్యాలు కల్పించకపోవడంతో అవి ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. మౌళిక వసతులు లేవన్న కారణంతో ఇల్లెందు నియోజకవర్గంలో నిర్వహించాల్సిన గురుకులాలు ఇతర ప్రాంతాలకు తరలించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గురుకులాలు స్థానికంగా ఏర్పాటు చేస్తే ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా స్థానికంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ ప్రభుత్వం భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయకపోవడంతో గురుకులాలు సమస్యల లోగిళ్లుగా మారుతున్నాయి. గురుకులాలు ప్రారంభించి మూడేళ్లవుతున్నా శాశ్వత భవనాలు నిర్మించకపోవడంతో వాటిని సుదూర ప్రాంతాలకు తరలించి ప్రతినెలా లక్షలాది రూపాయలు వెచ్చించి అద్దెభవనాలు తీసుకుంటున్నారు. తమ పిల్లలను ఇల్లెందు, టేకులపల్లి కేంద్రాలలోని గురుకులాలకు తీసుకొచ్చి అడ్మిషన్లు పొందిన తల్లిదండ్రులు ఒకటిరెడు నెలల తరువాత తమ పిల్లలను చూచేందుకు వెళితే గురుకులాలను అక్కడినుంచి వేరే ప్రాంతాలకు తరలించారన్న సమాచారంతో విస్తుపోతున్నారు. ఇల్లెందు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆరు గురుకుల పాఠశాలలు మంజూరు చేశారు. వీటిలో మైనారిటీ గురుకుల పాఠశాలలను ఇల్లెందు పట్టణంలోని 24ఏరియా సింగరేణి పాఠశాల భవనంతో ప్రారంభించగా ఎస్సీ బాలికల గురుకులాన్ని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసి రెండేళ్ల క్రితం ఇల్లెందుకు తరలించారు. అయితే ఇల్లెందులో వసతి సౌకర్యాలు లేవన్న కారణాలతో తిరిగి దాన్ని గత ఏడాది కారేపల్లి మండల కేంద్రానికి తరలించారు. బీసీ బాలుర, బాలిక గురుకులాలను తొలుత టేకులపల్లిలో ఏర్పాటు చేశారు. అయితే భవనాలు చాలడం లేదన్న కారణంతో బాలికల గురుకులాన్ని గత ఏడాది ఏకంగా ఖమ్మం జిల్లా కేంద్రానికి తరలించారు. తాజాగా గిరిజన సంక్షేమ శాఖ ఇల్లెందు నియోజకవర్గానికి మంజూరు చేసిన రెండు ఏకలవ్య గురుకులాలను సైతం కారేపల్లి, బయ్యారం మండలాల్లో ప్రారంభించారు. 

భవనాలు, మౌళిక వసతులు కరువు

గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు మంజూరు చేయకపోవడం, మంజూరైనా భవనాల నిర్మాణాలు పూర్తికాకపోవడం, మరికొన్ని భవనాలకు నిధులు, స్ధలాల కొరత వల్ల ఇల్లెందు నియోజకవర్గంలో నిర్వహించాల్సిన గురుకులాలు ఇతర ప్రాంతాలకు తరలుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. భవనాల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నా నిధులు, స్థలాలు కేటాయించకపోవడంతో వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటీవల ఇల్లెందులోని బాలుర మైనారీటీ గురుకుల పాఠశాలను జూనియర్‌ కాలేజీగా ఆఫ్‌గ్రేడ్‌ చేశారు. అయితే తరగతులు నిర్వహించేందుకు భవనం సరిపోదన్న కారణంతో దాన్ని కొత్తగూడెం జిల్లా కేంద్రానికి తరలించారు. ప్రతి గురుకులంలో 5నుంచి 10వతరగతి వరకు ఒక్కొక్క గురుకులంలో 480 మంది విద్యార్థులు విద్యనభ్యసించాల్సి ఉండగా వసతి సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షలాది రూపాయల అద్దెలు చెల్లిస్తూ కారేపల్లి, ఖమ్మం పట్టాణాల్లో నిర్వహిస్తున్న ఇల్లెందు నియోజకవర్గం గురుకులాల విద్యార్థులు కటిక నేలపైనే నిద్రిస్తూ చదువులు వెల్లదీస్తున్నారు. ఖమ్మం పట్టణంలోని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీసీ బాలికల గురుకుల పాఠశాల, కారేపల్లిలోని రెండు ప్రవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఎస్సీ బాలికల గురుకులాన్ని, ఏకలవ్య బాలికల గురుకులాన్ని నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క భవనా సముదాయానికి నెలకు రూ.3నుంచి రూ.4లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నారు.  సొంత భవనాలు నిర్మిస్తే ఇల్లెందు నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోనే విద్యాకేంద్రాలు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నా అద్దె భవనాలపైనే అధికారులు మక్కువ చుపుతుండడపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ పరిధిలోనే గురుకులాలు ఉండాలని ఆదేశించినా ఇల్లెందు నియోజకవర్గానికి చెందిన గురుకులాలను స్థానిక ప్రాంతాలకు తరలించకపోవడం గమనార్హం. ఇకనైనా గురుకులాలకు స్ధానికంగా భవనాలు నిర్మించి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

Updated Date - 2021-02-24T04:55:05+05:30 IST