నేటి నుంచి టీచర్లకు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు

ABN , First Publish Date - 2020-09-21T08:00:39+05:30 IST

రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు సోమవారం తెరచుకోనున్నాయి. మొదటి రోజు ఉపాధ్యాయులు, జూనియర్‌ కాలేజీల

నేటి నుంచి టీచర్లకు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు

 నేడు టీచర్లందరూ హాజరు కావాల్సిందే

రేపటి నుంచి 50ు మంది మాత్రమే

సందేహాల నివృత్తికి ‘9-12’ విద్యార్థులు రావచ్చు 

తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

1-8 విద్యార్థులు ఇంటి వద్దే విద్యనభ్యసించాలి


అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు సోమవారం  తెరచుకోనున్నాయి. మొదటి రోజు ఉపాధ్యాయులు, జూనియర్‌ కాలేజీల అధ్యాపకులందరూ హాజరుకావాల్సి ఉంటుంది. 22వ తేదీ నుంచి  ఆన్‌లైన్‌ బోధన, టెలీ కౌన్సెలింగ్‌, విద్యా వారధి తదితర కార్యక్రమాల కోసం 50 శాతం మంది హాజరు కావాలి. కంటైన్‌మెంట్‌ జోన్లకు వెలుపల ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ యాజమాన్యాల విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లు, జేఎల్స్‌ అందరికీ ఇది వర్తిస్తుంది. 9 నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు పాఠశాలలకు, జూనియర్‌ కాలేజీలకు రావచ్చు. అయితే ఇందుకు తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక అనుమతి తీసుకుని రావాలి.


1-8 తరగతుల విద్యార్థులు మాత్రం ఇంటిదగ్గరే విద్యనభ్యసించాలి. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలకు పంపించరాదు. వారికి ఆన్‌లైన్‌, వీడియో పాఠాలు కొనసాగనున్నాయి. వారి కోసం తయారు చేసిన షీట్లను అభ్యాస యాప్‌లో ఉంచారు. ఉపాధ్యాయులు వాటిని డౌన్‌లోడ్‌ చేసి, తదనుగుణంగా విద్యార్థులకు మార్గదర్శనం చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్‌ ఆదివారం ఆదేశాలు ఇచ్చారు. పాఠశాలల ప్రారంభం, ఉపాధ్యాయుల హాజరుపై ఆర్జేడీలకు సూచనలు చేశారు.


కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ నెల 30 వరకు పాఠశాలలు తెరవ కూడదు. కానీ అక్టోబరు 5 నుంచి పాఠశాలలను ప్రారంభించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. 9-12 తరగతుల విద్యార్థులు కంటైన్‌మెంట్‌ జోన్‌ల వెలుపల ఉన్న పాఠశాలలను సందర్శించడానికి స్వచ్ఛంద ప్రాతిపదికనే అనుమతించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థులందరినీ హైటెక్‌, లోటెక్‌, నోటెక్‌ వర్గాలుగా వర్గీకరించి కార్యకలాపాలను ప్రారంభించాలని పేర్కొంది.


కొవిడ్‌-19 నేపథ్యంలో పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యాశాఖ స్పష్టం చేసింది. అందరూ మాస్కులు తప్పని సరిగా ధరించాలి. సందేహాల నివృత్తి కోసం వచ్చే విద్యార్థులు కూర్చునే సీట్ల మధ్య ఆరడుగుల దూరం ఉండాలి. విద్యార్థులు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, వాటర్‌ బాటిళ్లు మార్చుకోకుండా పర్యవేక్షించాలి. తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలి. శానిటైజర్‌ అందుబాటులో ఉంచుకోవాలి.


Updated Date - 2020-09-21T08:00:39+05:30 IST