హైదరాబాద్‌లో ‘సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మెగా క్లస్టర్‌’

ABN , First Publish Date - 2021-01-09T07:09:53+05:30 IST

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్‌ మహానగరం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మెగా క్లస్టర్‌ ఏర్పాటుకు ఎంపికైంది

హైదరాబాద్‌లో ‘సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మెగా క్లస్టర్‌’

ఢిల్లీ, పుణె, బెంగళూరుల్లోనూ..

కేంద్ర  ప్రభుత్వ నిర్ణయం 

సాంకేతికాభివృద్ధికి తోడ్పాటు

మంత్రి కేటీఆర్‌ ఆశాభావం


హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్‌ మహానగరం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మెగా క్లస్టర్‌ ఏర్పాటుకు ఎంపికైంది. ఈమేరకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల రంగంలో రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం కోసం ప్రధాన మంత్రి నేతృత్వంలోని సైన్స్‌, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ సలహా మండలి ఆలోచనతో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్లస్టర్లు రూపుదిద్దుకున్నాయి. క్లస్టర్ల ఏర్పాటుకు హైదరాబాద్‌ సహా ఢిల్లీ, పుణె, బెంగళూరు ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వెబినార్‌లో కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం ప్రధాన సలహాదారుడు కె.విజయ రాఘవన్‌, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి డాక్టర్‌ అరవింద  మిత్ర పాల్గొనగా..


రాష్ట్రం నుంచి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ , రిసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (రిచ్‌)డీజీ అజిత్‌ రంగ్నేకర్‌ పాల్గొన్నారు. సైన్స్‌, టెక్నాలజీ రంగంలో ప్రముఖ సంస్థలున్న 4నగరాలను ఎంపిక చేశామని రాఘవన్‌ తెలిపారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌తోపాటు క్లస్టర్లకు ఎంపికైన మూడు నగరాలు సైన్స్‌, టెక్నాలజీ రంగంలో ముందున్నాయన్నారు.వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రభావం చూపగలిగే 5-7 ప్రముఖ కంపెనీలను తెలంగాణలో తయారు చేయడం తమ లక్ష్యమన్నారు. హైదరాబాద్‌ మెగా క్లస్టర్‌ బాధ్యతలు రిచ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని కేటీఆర్‌ తెలిపారు. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక రంగాలు మరింత వృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు. దీర్ఘకాలంలో లైఫ్‌సైన్సెస్‌, వ్యవసాయం, డిజిటల్‌టెక్నాలజీకి తెలంగాణను అత్యుత్తమ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌గా చేయడం లక్ష్యమన్నారు.

Updated Date - 2021-01-09T07:09:53+05:30 IST