Abn logo
Mar 11 2020 @ 02:54AM

కాంగ్రెస్‌కు సింధియా ఘాతం

జ్యోతిరాదిత్య సింధియా వంటి యువనేత ఉండగా, 73 సంవత్సరాల కమల్ నాథ్‌ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించడమే పెద్ద తప్పు. ఒక వైపు భారతీయ జనతా పార్టీలో కురువృద్ధ నేతలను మార్గదర్శక మండలికో, గవర్నర్ పదవులకో పంపించి యువనేతలను ప్రోత్సహిస్తుండగా, కాంగ్రెస్ పార్టీలో అంతటా వృద్ధత్వం రాజ్యమేలుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు రాని వారిలో నిరాశానిస్పృహలు తలెత్తకుండా ఎలా ఉంటాయి?


‘గత నాలుగు సంవత్సరాల్లో బిజెపి ప్రభుత్వం సమాజంలో అన్ని వర్గాల స్వప్నాల్ని భగ్నం చేసింది. తన తప్పులను ఒప్పుకునే ధైర్యమే కాదు, కనీసం ఎవరైనా విమర్శిస్తే వినే సహనం కూడా ఆ పార్టీకి లేదు. అసౌకర్యమైన ప్రశ్నలు తలెత్తినప్పుడు మైదానం విడిచి పారిపోతుంది. ఇది ప్రజాస్వామ్యంలో మంచి లక్షణం కాదు. దేశంలో ఎక్కడ చూసినా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అన్ని వ్యవస్థలూ కుప్పకూలిపోయాయి. ప్రజలు దిక్కుతోచని స్థితిలో భయభ్రాంతులై ఉన్నారు. ప్రభుత్వం కళ్లకు గంతలు కట్టుకుని, చెవుల్లో దూది పెట్టుకుని వ్యవహరిస్తోంది. రైతుల ఆదాయం రెట్టింపు కావడం అటుంచి వారికి కనీసం గిట్టుబాటు ధర కూడా లభించడం లేదు. నిరుద్యోగం తీవ్రంగా పెరిగింది. ‘‘కమల్ కా ఫూల్, హమారీ భూల్’’ (కమలానికి ఓటువేసి తప్పు చేశాం) అని ప్రజలు వాపోతున్నారు.’ –- ఇవి, 2018లో లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో మోదీ సర్కార్‌పై జ్యోతిరాదిత్య సింధియా సంధించిన విమర్శలు. ‘అభివృద్ధి, నిరుద్యోగం, మహిళల భద్రత వంటి వాటితో బిజెపికి సంబంధం లేదు. అది అయిదేళ్లలో తానేమి చేసిందో చెప్పలేక మతతత్వవాదం, సర్జికల్ దాడుల గురించి మాత్రమే చెప్పుకోంటోంది..’ అని 2019 సార్వత్రక ఎన్నికల ప్రచార సభల్లో ఆ యువ కాంగ్రెస్ నాయకుడు వేలెత్తి చూపారు. అసలు భారత దేశమనే భావన ఏమిటో బిజెపికి తెలియదని దుయ్యబడుతూ భారత దేశమంటే భిన్నత్వంలో ఏకత్వమని జ్యోతిరాదిత్య ఉద్ఘాటించారు. ఆర్థిక వ్యవస్థను మోదీ సర్కార్ 20 ఏళ్లు వెనక్కు తీసుకువెళ్లిందని ఆయన విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నదని గర్హించారు. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ మాత్రమే కాకుండా, రైతులు, దళితులు, గిరిజనుల నుంచి దేశాన్ని విముక్తం చేయడం కూడా బిజెపికి ఒక లక్ష్యమేనని సింధియా ధ్వజమెత్తారు. 


మరి జ్యోతిరాదిత్య సింధియా ఇప్పుడేమంటున్నారు? ఏ పార్టీనైతే ఆయన మతతత్వ పార్టీగా విమర్శించారో, ఏ పార్టీ అయితే దేశాన్ని వెనక్కు తీసుకువెళుతోందని, రైతులు, దళితులు, గిరిజనుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించారో ఇప్పుడు ఆయన అదే భారతీయ జనతా పార్టీలో చేరడానికి సంసిద్ధంగా వున్నారు! ఏ నేతనైతే ఆయన నియంతగా అభివర్ణించారో ఇప్పుడు ఆ నియంతనే తన నాయకుడుగా సింధియా అంగీకరించవలిసి వస్తోంది. ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో జ్యోతిరాదిత్య సింధియాకు తగిన ప్రాధాన్యత లభించలేదా? ఆయనకే కాదు, ఆయన తండ్రికి కూడా కాంగ్రెస్ ఎనలేని ప్రాధాన్యత నిచ్చింది. ఆయన తండ్రి మాధవరావు సింధియా 9 సార్లు కాంగ్రెస్ టికెట్‌పై లోక్ సభకు ఎన్నికై కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా నాలుగు సార్లు లోక్‌సభకు ఎంపికయ్యారు. విద్యుత్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పదవులు నిర్వహించారు. రాహుల్ గాంధీకి కుడిభుజంగా వ్యవహరించి పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడుగా ఉన్నారు. ప్రియాంకాగాంధీతో సమానంగా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ బాధ్యతలు నిర్వహించారు. అయినప్పటికీ తన వృద్ధికి కారణమైన కాంగ్రెస్‌ను జ్యోతిరాదిత్య సింధియా వదిలిపెట్టి పోవాలని ఎందుకు భావించారు? కాంగ్రెస్‌లో ఉండి దేశానికి సేవచేయలేనని భావిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖలో ఆయన పేర్కొన్నారు. తాను ఒకే చోట స్తంభించి పోదలుచుకోలేదని, తాను ముందడుగు వేసేందుకు సమయం ఆసన్నమైందని జ్యోతిరాదిత్య తెలిపారు. ఆయనను ఇవాళ ద్రోహిగా, సైద్ధాంతిక నిబద్ధత లేని నేతగా చాలా మంది కాంగ్రెస్ నేతలు విమర్శించవచ్చు. అన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ తల్లిపాలు తాగి రొమ్మును గుద్దినట్లుగా వ్యవహరించారని ఆరోపించవచ్చు. కానీ ఆయన పార్టీని వదిలిపెడుతూ అన్న మాటలకు విలువ లేదని చెప్పలేము. గత ఏడాదిగా తాను ఈ విషయం ఆలోచిస్తున్నానని కూడా జ్యోతిరాదిత్య చెప్పిన విషయాన్ని తేలికగా తీసుకోలేము.


నిజానికి ఇది జ్యోతిరాదిత్య మనసులో రేగుతున్న కల్లోలం కాదు. కాంగ్రెస్‌లో ఉన్న యువతరం నేతలందరిలోనూ ఒక ఆందోళన పెచ్చరిల్లుతోంది. కాంగ్రెస్‌లో ఇప్పటి వరకూ 49 సంవత్సరాల సింధియా యువతరానికి సంకేతంగా నిలిచారు. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించిన నేపథ్యం, మౌలిక స్థాయి సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన, స్వచ్ఛమైన, నిష్కళంకమైన రాజకీయ జీవితం ఉన్న జ్యోతిరాదిత్యకు దేశ రాజకీయ పరిణామాల గురించి తెలియదని అనుకోలేం. కాని ఇవాళ ఆయన అన్నీ తెలిసి కూడా బిజెపిలో చేరాలనుకున్నారంటే, మధ్యప్రదేశ్‌లో తనకు జన్మనిచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని కూలదోయాలని నిర్ణయించుకున్నారంటే ఆయన ఎంత నిరాశానిస్పృహలకు లోనయ్యారో గ్రహించవచ్చు.


నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నికైన జ్యోతిరాదిత్య సింధియాను గత ఎన్నికల్లో స్థానిక కాంగ్రెస్ నేతలే ఓడించారని, అంతర్గత కలహాలే ఆయన ఓటమికి కారణమయ్యాయని కథనాలు వచ్చాయి. 2018లో జరిగిన మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేసి తన ప్రాంతంలో కూడా ఆయన పార్టీకి సీట్లు తెచ్చిపెట్టారు. ఇవాళ ఆయన వెంట నిలబడి 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నారంటే ఆయన బలం ఏమిటో గ్రహించవచ్చు. కాని పార్టీలో కురువృద్ధ నేతలు ఆయనను సార్వత్రిక ఎన్నికల్లో ఓడించడంలో సఫలీకృతులయ్యారు. అసలు జ్యోతిరాదిత్య వంటి యువనేతలు ఉండగా, 73 సంవత్సరాల కమల్ నాథ్‌ను ముఖ్యమంత్రిగా నియమించడమే పెద్ద తప్పు. రాజస్థాన్‌లో కూడా 42 సంవత్సరాల సచిన్ పైలట్‌ను కాదని 68 సంవత్సరాలు దాటిన అశోక్ గెహ్లాట్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు. ఒక వైపు భారతీయ జనతా పార్టీలో కురువృద్ధ నేతలను మార్గదర్శక మండలికో, గవర్నర్ పదవులకో పంపించి యువనేతలను ప్రోత్సహిస్తుండగా, కాంగ్రెస్ పార్టీలో అంతటా వృద్ధత్వం రాజ్యమేలుతోంది. 87 ఏళ్ల మన్మోహన్ సింగ్‌ను తాజాగా రాజ్యసభకు ఎన్నుకోగా, రాజ్యసభలో ఎప్పడూ నిద్రపోతూ కనిపించే 92 ఏళ్ల మోతీలాల్ వోరా మళ్లీ తనను రాజ్యసభకు పంపించమని ఒత్తిడి చేస్తున్నారు! ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు రాని వారిలో నిరాశా నిస్పృహలు తలెత్తకుండా ఎలా ఉంటాయి?


నిజానికి రాహుల్ గాంధీతో పాటు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, జితేంద్ర ప్రసాద, మిలింద్ దేవర వంటి వారిని యువబృందంగా భావించేవారు. కాని తన బృందంలోని మిగతా సభ్యులతో పోలిస్తే పార్లమెంట్‌లోనూ, ఇతర వేదికల్లోనూ రాహుల్ గాంధీ అంతగా రాణించలేకపోవడం స్పష్టంగా కనపడేది. 2014 తర్వాత 16వ లోక్ సభలో కర్ణాటకకు చెందిన కురువృద్ధ నేత మల్లిఖార్జున ఖర్గే బదులు జ్యోతిరాదిత్యను సభా నాయకుడుగా ఎంచుకుని ఉంటే లోక్ సభలో మరింత బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించి ఉండేదేమో? లోక్ సభలో మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతూ హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడి ఆయన తన సత్తా నిరూపించుకునేవారు. జ్యోతిరాదిత్య సింధియాను కాకపోతే సచిన్ పైలట్ వంటి యువనేతను ముందుకు నెట్టినా కాంగ్రెస్‌లో ఒక కొత్త ఊపు వచ్చేందుకు అవకాశం ఉండేది. కాని ఈ యువనేతలకు అవకాశం కల్పిస్తే రాహుల్ ఎక్కడ వెలవెలబోతారో అని భావించారేమో, మల్లిఖార్జున్ ఖర్గే వంటి 77ఏళ్ల నేతను ముందుకు నెట్టారు.


ఒక విమాన ప్రమాదానికి బాధ్యత వహించి తన తండ్రి మాధవరావు సింధియా మంత్రి పదవికి రాజీనామా చేసినట్లే 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ కూడా అస్త్ర సన్యాసం చేసి పార్టీ అధ్యక్ష పదవిని మరొకరికి అప్పజెప్పాల్సిందిగా ప్రకటించారు. ఎంతమంది బతిమిలాడినా రాహుల్ వినిపించుకోలేదు. ఆ తర్వాత మరో యువనేతకు పార్టీ అధ్యక్ష పదవి అప్పజెప్పాలన్న విషయంపై చర్చ జరిగింది. జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ లాంటి యువనేతలను పార్టీ అధ్యక్ష పదవిలో నియమించాలని కొందరు నేతలు బహిరంగంగానే కోరారు. చివరకు ముకుల్ వాస్నిక్ వంటి విధేయుడైన నేత పేరు కూడా ముందుకు వచ్చింది. కాని పార్టీలో సీనియర్ నేతలు కొత్త నేతల్ని తెరమీదకు తెచ్చేందుకు అంగీకరించలేదు. యథాతథ వాదాన్ని అమలు పరిచి మళ్లీ ఆగస్టులో సోనియాగాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. పోనీ ఈ ఎనిమిది నెలల్లో అయినా కొత్త నాయకత్వాన్ని తయారు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా ప్రయత్నించిందా అంటే అలాంటి దాఖలాలు కనపడలేదు. గత అక్టోబర్‌లోనే జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకునేందుకు సమయం ఆసన్నమైందని ప్రకటించారు. ఆ తర్వాత నవంబర్‌లో తన ట్విటర్ అకౌంట్‌లో కాంగ్రెస్‌లో నిర్వహించిన అన్ని పదవుల ప్రస్తావనల్ని తొలగించారు. అప్పుడు కూడా కాంగ్రెస్‌లో అంతర్మథనం జరగలేదు.


దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రతరం కావడం, నిరుద్యోగం పెచ్చరిల్లిపోవడం, ఢిల్లీలో జరిగిన మత కల్లోలాలు మోదీ సర్కార్‌ను ఆత్మరక్షణలో పడవేశాయి. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఆ తర్వాత ఢిల్లీ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించలేకపోయింది. కర్ణాటకలో నేరుగా అధికారంలోకి రాలేకపోయిన బిజెపి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకోగలిగింది. ఇప్పుడు ఇదే ప్రయోగాన్ని జ్యోతిరాదిత్య సింధియా సహకారంతో మధ్యప్రదేశ్ లో అమలు చేస్తోంది. పార్లమెంట్‌లోనూ, బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బిజెపికి ఈ పరిణామాలు ఒక రకంగా కొత్త ఊపును ఇస్తాయనడంలో సందేహం లేదు. రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకోకపోయినా అధికారం చలాయించడం ఎలాగో బిజెపికి బాగా తెలిసిపోయింది. ఇదే ప్రయోగాన్ని అది సరైన సమయంలో మహారాష్ట్రలో ప్రయోగించినా ఆశ్చర్యం లేదు. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో పార్లమెంట్‌ను స్తంభింపజేసి బిజెపిని ఆత్మరక్షణలో పడేశామని కాంగ్రెస్ భావిస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్‌లో అధికారం కోల్పోవడమే కాదు, జ్యోతిరాదిత్య సింధియా లాంటి నేతల్ని కోల్పోవడంతో వందేళ్లు దాటిన ఆ పార్టీకి తీవ్రమైన విఘాతం తగిలిందని చెప్పక తప్పదు.


ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ బతికి బట్టకడుతుందా అన్నది చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. యుద్ధ ప్రాతిపదికన వివిధ రాష్ట్రాల్లోనూ, జాతీయ స్థాయిలోనూ యువనేతలకు సారథ్యం అప్పగించి, దిక్కుతోచని స్థితిలో ఉన్న మైనారిటీలు, దళితులు, ఆదివాసీలకు నాయకత్వం అందించగలిగిన శక్తిని సమకూర్చుకుంటే ఎంతో కొంత పుంజుకునే అవకాశాలు లేకపోలేదు. ‘జాతీయ స్థాయిలో సమర్థవంతమైన నాయకత్వం లభిస్తే రాష్ట్రాల స్థాయిల్లో పార్టీ దానంతట అదే బలపడుతుంది. ‘కానీ ఏం చేస్తాం.. జాతీయ స్థాయిలోనే వ్యవస్థ కుళ్లిపోయినప్పుడు ప్రాంతీయ స్థాయిలో పరిస్థితి ఎలా మెరుగుపడుతుంది..’ అని ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)