సూర్యకుమార్ యాదవ్‌కు స్టైరిస్ అదిరిపోయే ఆఫర్

ABN , First Publish Date - 2020-10-30T01:10:27+05:30 IST

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ సంచలన ఇన్సింగ్స్‌తో జట్టును

సూర్యకుమార్ యాదవ్‌కు స్టైరిస్ అదిరిపోయే ఆఫర్

అబుదాబి: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ సంచలన ఇన్సింగ్స్‌తో జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. దేశవాళీ పోటీల్లోనూ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ భారత జాతీయ జట్టులో మాత్రం అతడికి చోటు అందని ద్రాక్షగానే మారింది. ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్, ఆ తర్వాత జరగనున్న నాలుగు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఇటీవల భారత జట్టును ప్రకటించినప్పటికీ అందులో సూర్యకుమార్ యాదవ్ పేరు లేకపోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి.  


నిన్నటి మ్యాచ్‌లో 166 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 79 పరుగులు చేశాడు. అతడి ఆటతీరును చూసిన పలువురు క్రీడా నిపుణులు ఆస్ట్రేలియా సిరీస్‌లో అతడి పేరు లేకపోవడంపై పెదవి విరిచారు. రెండుమూడేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న సూర్యకుమార్ సెలక్టర్ల నుంచి పిలుపు కోసం వేచి చూస్తున్నాడు. 


సూర్యకుమార్ ఆటకు ముగ్దుడైన న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ అతడికి బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చాడు. భారత సెలక్టర్లకు కనువిప్పు కలిగే వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకుంటే కనుక వెంటనే న్యూజిలాండ్ వచ్చేయాలని ఫన్నీగా పిలుపునిచ్చాడు.

Updated Date - 2020-10-30T01:10:27+05:30 IST