కూలిన సౌధం

ABN , First Publish Date - 2020-07-28T08:16:47+05:30 IST

తెలంగాణ సచివాలయ భవనాలు నేలమట్టమయ్యాయి. సామాన్యుల నుంచి సచివుల వరకూ నిత్యం జనంతో

కూలిన సౌధం

  • సచివాలయం నేలమట్టం.. శిథిలాల గుట్టగా మారిన ప్రాంగణం
  • పది బ్లాకుల్లో 8 పూర్తిగా కనుమరుగు
  • 40% మిగిలిన జే, ఎల్‌ బ్లాకుల కూల్చివేత
  • ఆనవాళ్లు కనిపించని మసీదులు, మందిరం
  • మైదానంగా మారిన 133 ఏళ్ల ‘జీ’ బ్లాకు
  • థర్మల్‌ ప్లాంట్‌ (స్టోన్‌ బిల్దింగ్‌) కూడా
  • సగానికిపైగా శిథిలాలు ఇప్పటికే తరలింపు
  • జర్నలిస్టులను వ్యానుల్లో ఎక్కించి.. కుక్కించి..
  • భౌతిక దూరం నిబంధనలకు అధికారుల నీళ్లు
  • ఆంక్షల మధ్య జర్నలిస్టుల సచివాలయ సందర్శన


హైదరాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సచివాలయ భవనాలు నేలమట్టమయ్యాయి. సామాన్యుల నుంచి సచివుల వరకూ నిత్యం జనంతో కళకళలాడిన ప్రాంగణం ఇప్పుడు ఎటు చూసినా శిథిలాల గుట్టలు, కూలిన గోడలతో కనిపించింది. తీసిపారేసిన ఇనుప కడ్డీలను కోయడానికి ఉపయోగించే గ్యాస్‌ కట్టర్లు.. భవనాల కూల్చివేతకు వాడే భారీ యంత్రాలు.. శిథిలాలను ఎత్తిపోస్తున్న ఎక్స్‌కవేటర్లు నిరంతరాయంగా పని చేసుకుంటూ పోతున్నాయి. హైకోర్టు సూచన నేపథ్యంలో పాత సచివాలయ ప్రాంగణానికి సోమవారం జర్నలిస్టులను తీసుకెళ్లారు. 26 ఎకరాల విస్తీర్ణంలో 10 బ్లాకులు ఉండగా.. వాటిలో ఎనిమిదింటిని పూర్తిగా కూల్చివేశారు. కీలకమైన జే, ఎల్‌ బ్లాకుల కూల్చివేత 60 శాతం పూర్తయింది. 133 ఏళ్ల చరిత్ర కలిగిన ‘జీ (సైఫాబాద్‌ ప్యాలెస్‌) బ్లాక్‌’ ఆనవాళ్లు కూడా లేవు. కూల్చిన 8 భవనాల్లో ఏడుచోట్ల శిథిలాలైనా కనిపించగా.. జీ బ్లాకును మాత్రం నామరూపాలు లేకుండా చేశారు. ప్రధానంగా స్టోన్‌ బిల్డింగ్‌తోపాటు రెండు మసీదులు, ఒక మందిరం ఆనవాళ్లు కూడా లేవు. కూల్చిన భవనాల్లో నాలుగు కొత్తవి కావడంతో వాటి పిల్లర్లు, శ్లాబుల నిర్మాణానికి వాడిన బలమైన ఇనుప రాడ్లను గ్యాస్‌ కట్టర్లతో కోశారు. తెలంగాణ వచ్చిన తర్వాత మింట్‌ కాంపౌండ్‌ వైపు కొత్తగా నిర్మించిన ద్వారంతోపాటు.. లుంబినీ పార్కు ఎదురుగా ఉన్న ప్రవేశ ద్వారాలు మాత్రమే నిక్షేపంగా ఉన్నాయి.


ఆ ఐదు ముందే..

సచివాలయ సందర్శనలో కూల్చివేత ప్రక్రియను పరిశీలించగా.. తొలుత రెండు మసీదులు, మందిరంతోపాటు చారిత్రక ‘జీ’ బ్లాకు, స్టోన్‌ బిల్డింగ్‌లను కూలగొట్టినట్లు తేలింది. స్టోన్‌ బిల్డింగ్‌ శిథిలాల తరలింపు దాదాపుగా పూర్తయింది. ‘జీ’ బ్లాకు ఉన్న స్థలాన్ని చదును చేసినట్లు కనిపించింది.


ఫర్నిచర్‌ తొలగించకుండానే..

సాధారణంగా, విలువైన ఫర్నిచర్‌, ఏసీలు, అల్మారాలు తరలించి, గడపలు, తలుపులు తొలగించిన తర్వాతే కూల్చివేతలు చేపడతారు. సచివాలయం కూల్చివేతలో అవేమీ పాటించినట్లు కనిపించలేదు. ఏసీ డబ్బాల శిథిలాలు అక్కడ కనిపించాయి. ఇంటీరియర్‌ డెకరేషన్‌కు ఉపయోగించిన వస్తువులు కూడా శిథిలాల్లో ఉన్నాయి. వాస్తవానికి, రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలి 9 నెలలు మాత్రమే పాత సచివాలయంలో పాలన నడవగా.. ఆ కాలంలోనే ఐదారుగురు మంత్రులు రూ.లక్షలు వెచ్చించి చాంబర్లను ఆధునికీకరించుకున్నారు. పలువురు ఐఏఎ్‌సలు కూడా తమ తమ చాంబర్లను అభివృద్ధిచేసుకున్నారు. ఆ ఫర్నిచర్‌ అంతా భవనాల గోడల్లోనే కూలిపోయింది. ఇక, కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతంలో దుమ్ము ధూళి రేగకుండా నీటిని చల్లే యంత్రాలు పెట్టారు. కాగా, సచివాలయంలో పది బ్లాకులతోపాటు స్టోన్‌ బిల్డింగ్‌ కలిపి 11 భవ నాల కూల్చివేత జరుగుతుండగా.. వాటిలో 9 భవనాలకు చెందిన సగానికిపైగా శిథిలాలను యంత్రాంగం తరలించింది. 100 మందికిపైగా కూలీలు శిథిలాల తరలింపులో పాల్గొన్నారు. 


ఎక్కించి... కుక్కించి..

హైకోర్టు సూచనతో సచివాలయం కూల్చివేత పరిశీలన, కవరేజీకి జర్నలిస్టులను అనుమతించిన ప్రభుత్వం.. ఎవరినీ నేరుగా లోపలికి వెళ్లనివ్వలేదు. 100 మందికిపైగా పోలీసులు జర్నలిస్టుల చుట్టూ ఉన్నారు. ఐదు వాహనాల్లో జర్నలిస్టులను ఎక్కించి... కుక్కించి తరలించారు. కరోనా కాలంలో భౌతిక దూరం నిబంధనలేవీ పాటించలేదు. 24 సీట్లు కలిగిన మూడు బస్సులతోపాటు రెండు ఓపెన్‌ వ్యాన్‌లలో జర్నలిస్టులను తీసుకెళ్లగా.. 24 సీట్లు కలిగిన ఒక్కో బస్సులో 35 మందికిపైగా కుక్కేశారు. ప్రతి బస్సులో ఒక సీఐతోపాటు నలుగురు పోలీసులు రక్షణగా వచ్చారు. కేవలం 25 నిమిషాల్లోనే సందర్శనను ముగించేశారు. అంతేనా, బస్సులో నుంచి దిగడానికి జర్నలిస్టులను అనుమతించలేదు. చివరికి, ఒత్తిడితో సగం మందికి మాత్రమే 5 నిమిషాలు దిగడానికి అవకాశం ఇచ్చారు.


ఆ వైపు నిషిద్ధం

కొందరు జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు ఎలాగోలా కష్టపడి బస్సులో నుంచి దిగగా.. మసీదులు, మందిరం కూల్చిన వైపు ఎవరినీ అనుమతించలేదు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రోప్‌ పార్టీలతో అడ్డుకున్నారు. ‘సర్‌ ఇటువైపు వద్దు ప్లీజ్‌’ అంటూ అడ్డుకున్నారు. ఫొటోలు తీయడానికి ప్రధానంగా ‘ఏ’ బ్లాకువైపు రానీయలేదు. దాంతో, ‘జీ’ బ్లాకు నుంచి ‘డి’ బ్లాకు మధ్య ఖాళీ స్థలంలోనే అంతా ఉండాల్సిన పరిస్థితి.


ప్రమాదం జరుగుతుందనే: సీఎంవో

ఎత్తైన భవనాల కూల్చివేత జరుగుతోందని, ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నందునే ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించలేదని సీఎం కార్యాలయం వెల్లడించింది. కూల్చివేత వార్తల సేకరణకు అనుమతించాలని మీడియా ప్రతినిధుల నుంచి పదే పదే విజ్ఙప్తులు రావడంతోనే వారికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.







Updated Date - 2020-07-28T08:16:47+05:30 IST