వడివడిగా సీతమ్మ బ్యారేజ్‌

ABN , First Publish Date - 2022-01-14T07:40:07+05:30 IST

వడివడిగా సీతమ్మ బ్యారేజ్‌

వడివడిగా సీతమ్మ బ్యారేజ్‌
కొనసాగుతున్న సీతమ్మసాగర్‌ కాంక్రీట్‌ పనులు

పనుల్లో వేగం పెంచేందుకు కార్యాచరణ

2023 మార్చి నాటికి పూర్తిచేయాలని లక్ష్యం

పనుల పర్యవేక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు 

అశ్వాపురం జనవరి 13:మండల పరిధిలోని దుమ్ముగూడెం ఆనకట్టకు సమాంతరంగా కుమ్మరిగూడెం వద్దరూ.3,480కోట్లతో చేపట్టిన సీతమ్మబ్యారేజ్‌ పనులు ఊపందుకోనున్నాయి.ప్రస్తుతం జరుగుతున్న కాంక్రీట్‌ పనులను వచ్చే జూన్‌ నాటికి పూర్తిచేసి, 2023మార్చి నాటికి ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తెచ్చేలా నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌ బుధవారం ప్రాజెక్ట్‌ ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ మేరకు పనుల పర్యవేక్షణకు పనుల ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు, మహబూబాబాద్‌ జిల్లాలోని ఆరు లక్షల ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన సీతారామా ప్రాజెక్ట్‌కు ఊతంగా సీతమ్మబ్యారేజ్‌ను ఇక్కడ నిర్మిస్తున్నారు. బ్యారేజీతోపాటు 920మెగావాట్ల జలవిద్యుత్‌ కేంద్రం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న దుమ్ముగూడెం ఆనకట్టకు 200మీటర్ల దిగువన నిర్మిస్తున్న బ్యారేజ్‌కు 40కిలోమీటర్లు కుడికాలువ, 56కిలోమీటర్లు ఎడమ కాలువ నిర్మిస్తారు. బ్యారేజ్‌కు మొత్తం 65గేట్లు ఏర్పాటు చేసి సంవత్సరం పొడవునా బ్యారేజ్‌ వద్ద 35టీఎంసీల నీరు నిల్వ చేయనున్నారు. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి 3,123 ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉండగా ఇప్పటివరకు 510ఎకరాలు సేకరించారు.

ముమ్మరంగా కాంక్రీట్‌ పనులు 

సీతమ్మ బ్యారేజ్‌ కాంక్రీట్‌ పనులు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. గతేడాది మేలోనే ఎల్‌అండ్‌టీ సంస్థ పనులు ప్రారంభించగా జూన్‌లో గోదావరికి వరదలు రావటంతో కాపర్‌డ్యాం కొట్టుకుపోయి పనులకు అంతరాయం ఏర్పడగా అక్టోబరులో పునఃప్రారంభమయ్యాయి. కాగా ప్రాజెక్ట్‌పనులను 1,2,3,4,5,6 బ్లాక్‌లుగా చేపట్టారు. దుమ్ముగూడెం మండల సరిహద్దులో 1,2,3, బ్లాక్‌లు, ఇవతలవైపు అశ్వాపురం మండలంలో 5,6బ్లాక్‌ల్లో పనులు ప్రారంభించగా 5వ బ్లాక్‌లో కాంక్రీట్‌ పనులు పూర్తికావచ్చాయి.4వ బ్లాక్‌లో విద్యుత్‌కేంద్రం నిర్మించనున్నారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభంకానున్నాయి. వచ్చే జూన్‌ నాటికి 80శాతం పనులు పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 22న ఎల్‌అండ్‌టీ కంపెనీ చైర్మన్‌తోపాటు ఇరిగేషన్‌ ముఖ్య అధికారులు బ్యారేజ్‌ పనులను పరిశీలించనున్నట్లు సమాచారం.

భూసేకరణపై కలెక్టర్‌ దృష్టి

సీతమ్మసాగర్‌ ప్రాజెక్‌ భూసేరణపై భద్రాద్రి కలెక్టర్‌ అనుదీప్‌ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే గతేడాది డిసెంబరు 31న దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ప్రాజెక్ట్‌కు సంబందించిన అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెలాఖరునాటికి మరో వెయ్యిఎకరాలను నిర్మాణ సంస్థకు అప్పగించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా సీఏ భూమిని గుర్తించాలని తహ సీల్దార్లకు సూచించారు.

Updated Date - 2022-01-14T07:40:07+05:30 IST