Abn logo
Jun 19 2021 @ 03:15AM

రూ.6 కోట్ల నకిలీ విత్తనాలు పట్టివేత

  • అంతర్రాష్ట్ర ముఠాకు బేడీలు.. 
  • 13 మంది అరెస్టు.. వాహనాలు స్వాధీనం


నల్లగొండ క్రైం, జూన్‌ 18: నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటను నల్లగొండ పోలీసులు కట్టించారు. ఏపీ, తెలంగాణకు చెందిన 13 మంది నిందితులను అరెస్టు చేసి, రూ. 6 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు, రెండు కార్లు, 13 సెల్‌ఫోన్లు, నకిలీ విత్తనాలను తయారు చేసే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌రెడ్డి, ఎస్పీ రంగనాథ్‌, వ్యవసాయాధికారి శ్రీధర్‌రెడ్డితో కలిసి పశ్చిమ మండలం ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర వివరాలు వెల్లడించారు. దేవరకొండకు చెందిన పలువురు రైతులు ఇచ్చిన సమాచారంతో నల్లగొండ టాస్క్‌ఫోర్స్‌ రంగంలోకి దిగింది. గతంలో అరెస్టయి, పీడీ చట్టం కింద జైలుకు వెళ్లివచ్చిన ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన కర్నాటి మధుసూదన్‌రెడ్డిపైనా కన్నేసింది. గుండ్లపోచంపల్లిలో నైరుతి సీడ్స్‌ అధినేత ఎనుబోతుల శ్రీనివా్‌సరెడ్డికి చెందిన నకిలీ విత్తనాల ముఠాలో అతను కీలక సభ్యుడని గుర్తించింది. 


ఈ ముఠాలో మరో 11 మంది ఉన్నారు. దీంతో.. నల్లగొండ జిల్లా ఎస్పీ ఎ.వి.రంగనాథ్‌.. టాస్క్‌ఫోర్స్‌తోపాటు పలువురు శాంతిభద్రతల పోలీసులకు కూడా ముఠాను పట్టుకునే బాధ్యతలు అప్పగించారు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో సోదాలు నిర్వహించారు. తెలంగాణలోని గజ్వేల్‌, గద్వాల, జడ్చర్ల, హైదరాబాద్‌, గుండ్లపోచంపల్లి, ఎల్లంపల్లి, దేవరయాంజాల్‌, బోయిన్‌పల్లి, ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, నంద్యాల ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో.. 20 టన్నుల నకిలీ పత్తివిత్తనాలు, 140 టన్నుల నకిలీ వరి విత్తనాలు, 40 టన్నుల నకిలీ జొన్న విత్తనాలు, నాలుగు క్వింటాళ్ల కూరగాయల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎంజీ అగ్రిటెక్‌, జామ్‌జామ్‌ గోదాములను సీజ్‌ చేశారు. శ్రీనివా్‌సరెడ్డి స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా అని, అతను గతంలో చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేశాడని ఐజీ వివరించారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన మెడిశెట్టి గోవింద్‌ ఇతనికి వ్యాపార భాగస్వామి అని చెప్పారు. 


గోవింద్‌కు దేవరయాంజాల్‌లో ఎంజీ అగ్రిటెక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఉందని, అక్కడా నకిలీ విత్తనాలను తయారు చేస్తారని తెలిపారు. తాము విక్రయించే విత్తనాలు నాణ్యమైనవని నమ్మించేందుకు శ్రీనివా్‌సరెడ్డి.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఐసీఏఆర్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. ఆ సంస్థ లేబుళ్లను నకిలీ విత్తనాల ప్యాకెట్లపై ముద్రించేవాడు. వర్షాధార పంటలపై ఎక్కువగా ఆధారపడే ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలను ఈ ముఠా టార్గెట్‌గా చేసుకుందని స్టీఫెన్‌ రవీంద్ర వివరించారు.