సెమీస్‌లో నడాల్‌

ABN , First Publish Date - 2022-01-26T09:14:56+05:30 IST

ఆధునిక టెన్ని్‌సలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన రికార్డుకు స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌ రెండడుగుల దూరంలో నిలిచాడు.

సెమీస్‌లో  నడాల్‌

బార్టీ, కీస్‌, బెరెట్టిని కూడా

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

మెల్‌బోర్న్‌: ఆధునిక టెన్ని్‌సలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన రికార్డుకు స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌ రెండడుగుల దూరంలో నిలిచాడు. సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సెమీస్‌ చేరిన ఆరో సీడ్‌ రఫా.. ఫైనల్లో చోటు కోసం ఇటలీ ఆటగాడు మ్యాటో బెరెట్టినితో అమీతుమీ తేల్చుకోనున్నాడు. మహిళల టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ, మాడిసన్‌ కీస్‌ కూడా ఫైనల్‌ ఫోర్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో నడాల్‌ 6-3, 6-4, 4-6, 3-6, 6-3తో 14వ సీడ్‌ డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా)పై ఐదు సెట్లపాటు పోరాడి నెగ్గాడు. నాలుగు గంటలపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గట్టెక్కిన రఫా.. మెల్‌బోర్న్‌లో ఏడోసారి సెమీ్‌సలోకి అడుగుపెట్టాడు. ఫెడరర్‌, జొకోవిచ్‌తో సమానంగా 20 టైటిళ్లతో నిలిచిన నడాల్‌.. మరో గ్రాండ్‌స్లామ్‌ నెగ్గితే  ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. 2009లో మాత్రమే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన రఫా.. ఈసారి జొకో, ఫెడెక్స్‌ లేకపోవడంతో కెరీర్‌లో రెండోసారి టైటిల్‌ను సొంతం చేసుకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐదు సెట్లపాటు ఉత్కంఠభరితంగా సాగిన మరో మ్యాచ్‌లో ఏడో సీడ్‌ బెరెట్టిని 6-4, 6-4, 3-6, 3-6, 6-2తో మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించాడు. 


బార్టీతో పోరుకు మాడిసన్‌ సై..

మహిళల నెంబర్‌వన్‌ ఆష్లే బార్టీ సొంతగడ్డపై జోరు కొనసాగిస్తోంది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో బార్టీ 6-2, 6-0తో 21వ సీడ్‌ జెస్సికా పెగుల (అమెరికా)పై వరుస సెట్లలో సునాయాసంగా గెలిచింది. మరో మ్యాచ్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ బార్బరా క్రెజికోవాపై అమెరికాకు చెందిన అన్‌సీడెడ్‌ స్టార్‌ మాడిసన్‌ కీస్‌ సంచలన విజయంతో సెమీ్‌సకు చేరుకొంది. కీస్‌ 6-3, 6-2తో 4వ సీడ్‌ క్రెజికోవా (చెక్‌)ను చిత్తు చేసింది. 2015 తర్వాత తొలిసారి సెమీస్‌ చేరిన మాడిసన్‌ ఫైనల్లో చోటుకోసం బార్టీతో అమీతుమీ తేల్చుకోనుంది. 

Updated Date - 2022-01-26T09:14:56+05:30 IST