వెంటాడి వేధిస్తున్నారు

ABN , First Publish Date - 2020-09-16T08:52:08+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఆయనకు వ్యతిరేకంగా వాదనలు వినిపించానన్న అక్కసుతో తనపై కక్ష సాధింపుకు దిగారని మాజీ అడ్వొకేట్‌ జనరల్‌, సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి ..

వెంటాడి వేధిస్తున్నారు

  • జగన్‌కు వ్యతిరేకంగా వాదించినందుకే కక్ష
  • రాజధాని గురించి నాకు ముందుగా తెలియదు
  • ఆస్తులు, భూములు కొనుగోలు చేయలేదు
  • అయినా... తప్పుడు ఆధారాలు సృష్టించే యత్నం
  • అరెస్టుకూ సన్నాహాలు.. నాపై చర్యలను అడ్డుకోండి
  • మీ ద్వారానే దర్యాప్తు.. దమ్మాలపాటి పిటిషన్‌

 అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఆయనకు వ్యతిరేకంగా వాదనలు వినిపించానన్న అక్కసుతో తనపై కక్ష సాధింపుకు దిగారని మాజీ అడ్వొకేట్‌ జనరల్‌, సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.  తనను అరెస్టు చేయించేందుకు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపారని హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను, తన కుటుంబ సభ్యులను వెంటాడి వేధిస్తున్నారని, తన ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించారు.  తన విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసుల్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో సోమవారం దమ్మాలపాటి శ్రీనివాస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో  ప్రతివాదులుగా రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఏసీబీ డీజీపీ, సీఐడీ అదనపు డీజీపీ, వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌,  ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొట్టి రఘురామిరెడ్డిలను పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ వేసిన   మరుసటి రోజే... అంటే మంగళవారమే దమ్మాలపాటితోపాటు 13 మందిపై ఏసీబీ కేసు నమోదు చేయడం గమనార్హం.


ఈ పిటిషన్‌లో దమ్మాలపాటి పేర్కొన్నా ముఖ్యాంశాలు... నాజీ పాలనలో రహస్య పోలీసు దళాన్ని వినియోగించినట్లుగా... దురుద్దేశంతో, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం, దాని ఆధీనంలోని దర్యా ప్తు సంస్థలు నన్ను అరెస్టు చేసేందుకు కుట్ర పన్నాయి. సీఎం వ్యక్తిగత లబ్ధి కోసం పోలీసు యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారు. ఈ చట్టవిరుద్ధ చర్యలను అడ్డుకుని, నా హక్కులను రక్షించండి. నేను 1991 నుంచి న్యాయవాదిగా ఉన్నా. రాష్ట్ర విభజన తర్వాత అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా బాధ్యతలు చేపట్టా. రాజధాని ప్రాంతంపై ప్రజల్లో ప్రచారంలో ఉన్న సమాచారం త ప్ప అదనంగా నాకేమీ తెలీదు. రాజధానిపై ముందస్తు సమాచారంతో ఎలాంటి భూమిగానీ, ఆస్తులుగానీ కొనలేదు. కానీ.. నాపై రహస్య విచారణ చేపడుతూ, మా బంధువులను బెదిరించి సాక్ష్యాలను సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నేను అనేక ఆస్తులు కూడగట్టుకున్నట్లు తప్పుడు ఆరోపణలు చేస్తోంది. రాజధాని విషయం నాకు ముందే తెలుసని, రాజధానిలో భూమి కొనుగోలు చేశానని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు.


అది పూర్తి తప్పుడు ఆరోప ణ. నేను ఏదేని ఆస్తి కొనుగోలు చేసినట్లు చూపే ఆధారాలు, పత్రాలు లేవు. నాకు వ్యతిరేకంగా తప్పుడు కేసు పెట్టడానికి సమాచారం సేకరించాలని ఇంటెలిజెన్స్‌ అ ధికారులు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. పలు నిఘా సంస్థలు వివిధ రకాలుగా సమాచారం సేకరిస్తున్నాయి. తప్పుడు కేసులు బనాయించి నన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదట అరెస్టు చేసి, అనంతరం కల్పిత ఆరోపణలతో అధికారిక ఫిర్యా దు చేయడానికి వ్యూహం పన్నినట్లు అవగతమవుతోం ది. గత ప్రభుత్వ విధివిధానాలకు దురుద్దేశాలు అంటగంటి, 3 రాజధానుల అజెండాను అమలు చేయడం కోసం, రాజకీయ లబ్ధి పొందేందుకు నిరాధారమైన తప్పుడు ఆరోపణలతో వివాదం  సృష్టిస్తున్నారు. 


జగన్‌కు వ్యతిరేకంగా వాదించాననే కక్ష..

పలు కేసుల్లో జగన్‌కు వ్యతిరేకం గా వాదించాననే క క్షతోనే నాపై కేసులు పెడుతున్నారు. జగన్‌ ప్రభుత్వం రా జ్యాంగ నిబంధనల ను పూర్తిగా విస్మరించి, చట్టవ్యతిరేకపాలన సాగిస్తోంది. ఇందుకు హైకోర్టు, సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీ ర్పులే నిదర్శనం. సీఎంకి నాపై వ్యక్తిగత కక్ష వుంది. హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు జరుగుతున్న విచారణలో ఆయ న నిందితుడు. 2004-2009 మధ్య వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భారీ స్థాయిలో వివిధ కార్పొరేట్‌ సంస్థలకు, వ్యక్తులకు అధికారిక ‘మేళ్లు’ చేశారు. ఆ సంస్థలు, వ్యక్తులు జగన్‌కు చెందిన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. ఆ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు 2011 ఆగస్టు 10న సీబీఐ విచారణకు ఆదేశించింది. వృత్తిలో భాగంగా ఒక పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించిన నేను జగన్‌ ఆస్తులపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని అభ్యర్థించాను. హైకోర్టు ఆదేశా ల మేరకు దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. 14 ప్రత్యేక చార్జ్‌షీ ట్లు దాఖలు చేసింది.


ఈడీ కూడా 12 చట్టబద్ధమైన కేసుల్ని నమోదు చేసింది. ఈ కేసులకు సంబంధించి జగన్‌ 16 నెలలు జైలుకెళ్లారు. దానిపై ఆయన సుప్రీంకోర్టులో అప్పీలుచేశారు. 2019లో మాజీ సీఎం చంద్రబాబు భద్రతను ఏకపక్షంగా తగ్గించారు. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా, ఆయన తరఫున నేనే వాదించాను. అదేవిధంగా జగన్‌ వ్యాపార వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలకు సంబంధించి గతంలో నేను అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా, అడ్వొకేట్‌ జనరల్‌గా అప్పటి ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ వాదనలు వినిపించాను. అదేవిధంగా గత జనవరి-ఫిబ్రవరిల్లో ప్రభుత్వం ఏకపక్షంగా 144 సెక్షన్‌ విధించగా, దానిని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌పై నేనే వాదనలు వినిపించాను. ప్రభుత్వ చర్యలను గట్టిగా వ్యతిరేకించాను.  వృత్తిపరంగా జగన్‌కు వ్యతిరేకంగా కేసులు వాదించానన్న కారణంగా నాపై కక్షకట్టారు. ప్రస్తుత ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీల ద్వారా వేధిస్తోంది.  ఈ ప్రభుత్వానికి మానవహక్కులు, రూల్‌ఆఫ్‌లా, రాజ్యాంగం, కోర్టు ఉత్తర్వులపై గౌరవమున్నట్లు కనిపించడం లేదు.


హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు సాగేలా..

నాపై రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఏదైనా విచారణ చేపడితే అందుకు సంబంధించిన రికార్డులను హైకోర్టు తెప్పించుకుని పరిశీలించాలి. నన్ను అరెస్టు చేయకుం డా ఉండడంతో పాటు ఇతర చర్యలేవీ తీసుకోరాదని పోలీసులను ఆదేశించండి. నాకు వ్యతిరేకంగా జరిగే దర్యాప్తు/విచారణ హైకోర్టు పర్యవేక్షణలోనే కొనసాగే లా ఆదేశించండి. హైకోర్టు ముందస్తు అనుమతి లే కుండా ఎలాంటి ఇతర దర్యాప్తు, విచారణ చేపట్టరాద ని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయండి. హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి పర్యవేక్షణలోనే దర్యాప్తు జరిగేలా ఆదేశించండి. నన్ను మానసికంగా వేధించినందుకు తగిన పరిహారం చెల్లించేలా ఆదేశించండి.


తప్పుడు కేసుల కోసం అన్వేషణ..

సీఐడీ, ఏసీబీ, ఇంటెలిజెన్స్‌ తదితర సంస్థలతో నన్ను అక్రమంగా అరెస్టు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటెలిజెన్స్‌ డీఐజీ కె.రఘురామిరెడ్డి రహస్య విచారణ కోసమంటూ నా ఐటీ రిటర్న్స్‌ వివరాలు కావాలని ఐటీశాఖను కోరారు. నిజానికి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అలా అక్రమంగా అడిగే అధికారం లేదు. అంతేగాక నా బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, ఇతర పత్రాలను కూడా రహస్యంగా సేకరించారు. నా ఆదాయ పన్ను వివరాల కోసం ఇంటెలిజెన్స్‌ విభాగం 29.1.2020న ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్‌శాఖ కమిషనర్‌కు లేఖ రాసింది. గత ప్రభుత్వంలో తీసుకున్న విధానాలు, కార్యక్రమాలు, విధానపరమైన నిర్ణయాలను పునఃసమీక్షించేందుకు గత ఏడాది జూన్‌ 26వ తేదీన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. అంతేగాక దాని సిఫారసు మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) గత ఫిబ్రవరి 21వ తేదీన ఏర్పాటు చేసింది. సిట్‌లోని పోలీసు అధికారులు నిష్పాక్షికంగా బాధ్యతలు నిర్వర్తించడం లేదు. గత ప్రభుత్వంలో పని చేసిన నాయకులు, ఉద్యోగులపై తప్పుడు కేసులు బనాయించేందుకే ఆ సిట్‌ను ఏర్పాటు చేశారు. క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సమర్పించిన నివేదికకు అనుగుణంగా ఈ సిట్‌ను ఏర్పాటు చేశారు. ప్రతీకారం తీర్చుకునేందుకే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-09-16T08:52:08+05:30 IST