ఏబీవీని డిస్మిస్‌ చేయండి

ABN , First Publish Date - 2021-08-02T08:12:41+05:30 IST

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి అధికారిక ప్రతిపాదనలు పంపింది. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏబీ వెంకటేశ్వరరావుపై విచారణ చేపట్టిన..

ఏబీవీని డిస్మిస్‌ చేయండి

కేంద్రానికి రాష్ట్రం సిఫారసు

విచారణ కొనసాగుతుండగానే నిర్ణయం

ఐపీఎ్‌సపై ఇలాంటి సిఫారసు ఇదే తొలిసారి

కేంద్రం, యూపీఎస్సీ అంగీకరిస్తేనే అమలు

అప్పటి వరకూ సస్పెన్షన్‌లోనే!

అధికారంలోకి రాకముందునుంచే గురి

వచ్చిన తర్వాత విచారణలు, సస్పెన్షన్‌


అమరావతి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి అధికారిక ప్రతిపాదనలు పంపింది. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏబీ వెంకటేశ్వరరావుపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయనపై సస్పెన్షన్‌ వేటు కూడా వేశారు. నిఘా పరికరాల కొనుగోలు ఆరోపణలతోపాటు కొందరు అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ అభియోగాలు నమోదు చేశారు. ఆయన సస్పెన్షన్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. శాఖాపరమైన విచారణలో భాగంగా ఏబీ వెంకటేశ్వరరావు కొద్దిరోజుల క్రితం కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఎదుట హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. ఇటీవలే ఆయన కేసులకు సంబంధించి ప్రజెంటింగ్‌ ఆఫీసర్‌ను కూడా నియమించారు. ఇంతలోనే ఆయన్ను సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


శనివారం అర్ధరాత్రి ఈ మేరకు  రహస్య జీవో జారీ అయింది. ఏబీవీపై మేజర్‌ పెనాల్టీ (డిస్మిస్‌) అమలు చేయాలని కేంద్ర హోం శాఖకు ఈ జీవో ద్వారా ప్రతిపాదనలు వెళ్లాయి. ఆయనపై ఉన్న అభియోగాలు, విచారణలో తేలిన అంశాలను క్రోడీకరించి ఒక అభియోగ పత్రాన్ని తయారు చేసి కేంద్రానికి పంపారు. ఆయన సర్వీసులో కొనసాగేందుకు అనర్హుడని, ఆయన్ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. అఖిల భారత సర్వీసు అధికారుల డిస్మిస్‌ వ్యవహారాలన్నీ కేంద్రమే చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసులను, అభియోగ పత్రాలను క్షుణ్నంగా పరిశీలించాక... యూపీఎస్‌సీ అభిప్రాయాన్ని కూడా తీసుకుని తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ సిఫారసు చేసినప్పటికీ అంతిమంగా కేంద్ర నిర్ణయమే చెల్లుబాటు అవుతుందని నిబంధనలు చెబుతున్నాయి. ఏబీ డిస్మి్‌సపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే కీలకం కానుంది. 


ఎన్నికల ముందు నుంచే...

రాష్ట్రానికి చెందిన ఏబీ వెంకటేశ్వరరావు 1989లో ఐపీఎస్‌ సాధించి ఏపీ కేడర్‌కు ఎంపికయ్యారు. 2019లో అదనపు డీజీ హోదాలో రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా వ్యవహరించారు. వైసీపీ నేతలు ఎన్నికలకు ముందు ఆయనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన్ను ఇంటెలిజెన్స్‌ నుంచి ఈసీ తప్పించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్‌ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏసీబీ డీజీగా ఉన్న ఏబీవీని బదిలీ చేసి కొన్నాళ్లపాటు పోస్టింగ్‌ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టారు. తనకు పోస్టింగ్‌ ఇప్పించాల్సిందిగా ఐపీఎస్‌ అధికారుల సంఘానికి సైతం ఏబీవీ లేఖ రాశారు. అయితే ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన సమయంలో ఇజ్రాయెల్‌ నిఘా పరికరాలను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరి 8న సస్పెన్షన్‌ వేటు వేసింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది.


ప్రభుత్వ నిర్ణయంపై ఆయన సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌)తోపాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ విచారణకు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా సచివాలయ ప్రాంగణలో మీడియాతో మాట్లాడుతూ... సీఐడీ, పోలీస్‌ ఉన్నతాధికారులతోపాటు మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి తనపై కుట్ర చేస్తున్నారని.. తాను అక్రమాలకు పాల్పడినట్లు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపించారు.  


మరో విచారణ.. నివేదిక అందకుండానే.. 

డీజీ ర్యాంకు అధికారిగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు మీడియా ముందు ఆలిండియా సర్వీసు రూల్స్‌ ఉల్లంఘించి మాట్లాడారంటూ వైసీపీ ప్రభుత్వం మరో విచారణకు ఆదేశించింది. ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌ (క్రమశిక్షణ, అప్పీల్‌) నిబంధనలు 1969లోని నిబంధన 8 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ వ్యవహారంపై విచారణ  బాధ్యతను ఇటీవల ఐఏఎస్‌ అధికారి ఆర్పీ సిసోడియా(కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీ్‌స)కు అప్పగించారు. ప్రజెంటింగ్‌ ఆఫీసర్‌గా న్యాయవాది సర్వ శ్రీనివాసరావును నియమించారు. ఈ విచారణ పూర్తి చేశాక ప్రభుత్వానికి సిసోడియా ఇచ్చే నివేదిక ఆధారంగా జగన్‌ సర్కార్‌ ఏబీవీపై చర్యలు తీసుకుంటుందని అందరూ భావించారు. నివేదిక అందక ముందే వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


ఐపీఎస్‌ డిస్మిస్‌ ఎలా?

అఖిల భారత సర్వీసులకు చెందిన అధికారులను సర్వీసు నుంచి డిస్మిస్‌ చేయడం అంత సులభం కాదు. ఒకప్పుడు ఇది మరీ కఠినంగా ఉండేది. మోదీ ప్రభుత్వం వచ్చాక నాన్‌ ఫర్ఫార్మెన్స్‌ (పనిచేయని, అసమర్థ) అధికారులను స్వచ్చంద పదవీ విరమణ ద్వారా ఇంటికి పంపడం ప్రారంభమైంది. అవినీతి, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన వంటి అభియోగాలు ఉన్నప్పుడు సంబంధిత కోర్టులు ఽఽధ్రువీకరించాకే డిస్మిసల్‌ వేటు పడుతుంది. పాతికేళ్ల క్రితం అట్టాడ పద్మనాభరావు అనే ఐఏఎస్‌ అధికారిని సర్వీసు నుంచి డిస్మిస్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగైదు సంవత్సరాలు పట్టింది. ఆయన అసలు ఏ పనీ చేయరని, ఇతరత్రా అభియాగాలు ఉన్నాయని సాక్ష్యాలు చూపించినప్పటికీ సీనియర్‌ ఐఏఎ్‌సను డిస్మిస్‌ చేసేందుకు ఇవి సరిపోవంటూ కేంద్రం చాలాకాలంపాటు అడ్డు చెప్పింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఏ అఖిల భారత సర్వీసు అధికారిపైనా డిస్మిసల్‌ వేటు పడలేదు. ఇప్పుడు ఏబీవీపై నమోదైన అభియాగాలన్నీ విచారణ దశలోనే ఉన్నాయి. ఏ న్యాయస్థానంలోనూ ఇవి ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఆయన డిస్మి్‌సకు సానుకూలత వ్యక్తం చేస్తుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-08-02T08:12:41+05:30 IST