Abn logo
Nov 22 2021 @ 03:17AM

మూడోదీ మనదే

  • 3-0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్
  • చిత్తుగా ఓడిన కివీస్‌
  • రోహిత్‌ అర్ధసెంచరీ
  • అక్షర్‌కు మూడు వికెట్లు


కొత్త నాయకత్వంలో టీమిండియా అదరగొట్టింది. చివరి మ్యాచ్‌ను పూర్తి ఏకపక్షంగా మార్చేస్తూ సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మంచు ప్రభావంతో ఉన్నప్పటికీ టాస్‌ గెలిచిన భారత్‌ ఈసారి బ్యాటింగ్‌ ఎంచుకుంది. కానీ మిడిలార్డర్‌ తడబడినా ఆరంభంలో రోహిత్‌.. చివర్లో దీపక్‌ చాహర్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు సాధ్యమైంది. ఆ తర్వాత స్పిన్నర్‌ అక్షర్‌ పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు తీయడంతో కివీస్‌ కోలుకోలేకపోయింది. గప్టిల్‌ ఒంటరి పోరు ఫలితాన్నివ్వలేదు.


కోల్‌కతా: మూడు టీ20ల సిరీ్‌సను భారత్‌ హ్యాట్రిక్‌ విజయాలతో ముగించింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 73 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో రోహిత్‌ సేన ఈ సిరీ్‌సను 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ (31 బంతు ల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 56) మెరుపు ఆరంభాన్నివ్వగా.. చివరి ఓవర్‌లో దీపక్‌ చాహర్‌ (8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 21 నాటౌట్‌) విధ్వంసం సృష్టించాడు. శాంట్నర్‌కు 3వికెట్లు దక్కాయి. ఛేదనలో కివీస్‌ 17.2 ఓవర్లలో 111 రన్స్‌కే కుప్పకూలింది. గప్టిల్‌(51) ఒక్కడే రాణించాడు.  మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అక్షర్‌ పటేల్‌ (3-0-9-3) అద్భుత గణాంకాలు నమోదు చేయగా.. హర్షల్‌కు 2 వికెట్లు దక్కాయి. రాహుల్‌, అశ్విన్‌ విశ్రాంతితో ఇషాన్‌, చాహల్‌ జట్టులోకి వచ్చారు. సౌథీ విశ్రాంతి తీసుకోవడంతో శాంట్నర్‌ కివీస్‌ సారథిగా వ్యవహరించాడు. రోహిత్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచాడు.


గప్టిల్‌ మినహా..: భారీ ఛేదనలో కివీస్‌ దారుణంగా తడబడింది. ఓపెనర్‌ గప్టిల్‌ మినహా ఎవరూ క్రీజులో నిలవలేకపోయారు. అక్షర్‌ పటేల్‌ సుడులు తిరిగే బంతులకు పవర్‌ప్లేలోనే కివీస్‌ 3 వికెట్లు కోల్పోయింది. మూడో ఓవర్‌లో మిచెల్‌ (5), చాప్‌మన్‌ (0)ను అక్షర్‌ అవుట్‌ చేయడంతో కివీస్‌ పతనం ఆరంభమైంది. మరో ఎండ్‌లో గప్టిల్‌ భారీషాట్లతో వేగం కనబరిచినా అతడికి సహకారమే లేకుండా పోయింది. ఫిలిప్స్‌ కూడా డకౌటవడం వారిని దెబ్బతీసింది. మిడిలార్డర్‌లో సైఫర్ట్‌ (17) పోరాటం చూపినా రనౌటయ్యాడు. ఆ తర్వాత వికెట్లు పేకమేడలా కూలడంతో కివీ్‌సకు భారీ ఓటమి ఎదురైంది.


దంచేసిన ఓపెనర్లు: టాస్‌ గెలిచిన భారత్‌ ఈసారి బ్యాటింగ్‌కు దిగింది. దీనికి తగ్గట్టుగానే ఓపెనర్లు రోహిత్‌, ఇషాన్‌ మెరుపు ఆరంభాన్నిచ్చారు. మధ్య ఓవర్లలో తడబాటు కారణంగా ఓ దశలో 160 స్కోరు కూడా కష్టమే అనిపించింది. కానీ చివర్లో హర్షల్‌, దీపక్‌ చాహర్‌ ధనాధన్‌ ఆటను కనబర్చడంతో జట్టు ఆశించిన స్కోరు అందుకుంది. ఆరంభం నుంచే పోటాపోటీ బౌండరీలతో ఓపెనింగ్‌ జోడీ స్కోరు బోర్డును పరిగెత్తించింది. ఇద్దరూ ఫోర్లతోనే పరుగుల ఖాతా తెరిచారు. ఆరో ఓవర్‌లో ఇషాన్‌ ఓ ఫోర్‌.. రోహిత్‌ 4,4,6తో 20 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో జట్టు 69 స్కోరుతో దూకుడు మీద కనిపించింది. కానీ ఈ జోరును ఏడో ఓవర్‌లో శాంట్నర్‌ అడ్డుకున్నాడు. 2 పరుగుల వ్యవధిలో ఇషాన్‌, సూర్యకుమార్‌ (0)ను పెవిలియన్‌ చేర్చాడు. అప్పటికే తొలి వికెట్‌కు 38 బంతుల్లోనే 69  రన్స్‌ వచ్చాయి. శాంట్నర్‌ మరుసటి ఓవర్‌లోనే రిషభ్‌ పంత్‌ (4)ను అవుట్‌ చేయడంతో భారత్‌ ఒక్కసారిగా తడబడింది. ఇక 28 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన రోహిత్‌ కూడా ఎక్కువ సేపు నిలువలేదు.


12వ ఓవర్‌లో సోధీ చిరుత వేగంతో అందుకున్న రిటర్న్‌ క్యాచ్‌తో రోహిత్‌ అవుటయ్యాడు. అప్పటికి భారత్‌ స్కోరు 103/4. ఈ దశలో వెంకటేశ్‌, శ్రేయాస్‌ సంయమనంతో ఆడి ఐదో వికెట్‌కు 36 రన్స్‌ జోడించారు. కానీ వరుస ఓవర్లలో ఈ ఇద్దరూ వెనుదిరగడంతో డెత్‌ ఓవర్లలో రన్స్‌ కష్టమేననిపించింది. అయితే హర్షల్‌ (18) ఉన్న కాసేపు వేగంగా ఆడగా.. ఆఖరి ఓవర్‌లో దీపక్‌ చాహర్‌ 4,4,2,6,2,1తో 19 రన్స్‌ సాధించి జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డాడు. ఆఖరి 5 ఓవర్లలో జట్టు 50 పరుగులు సాధించడం విశేషం.1 అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్‌గా రోహిత్‌ (30). కోహ్లీ (29)ని అధిగమించాడు.  


స్కోరుబోర్డు

భారత్‌: రోహిత్‌ (సి అండ్‌ బి) సోధీ 56; ఇషాన్‌ (సి) సైఫర్ట్‌ (బి) శాంట్నర్‌ 29; సూర్యకుమార్‌ (సి) గప్టిల్‌ (బి) శాంట్నర్‌ 0; పంత్‌ (సి) నీషమ్‌ (బి) శాంట్నర్‌ 4; శ్రేయాస్‌ (సి) మిచెల్‌ (బి) మిల్నే 25; వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) చాప్‌మన్‌ (బి) బౌల్ట్‌ 20; అక్షర్‌ (నాటౌట్‌) 2; హర్షల్‌ (హిట్‌ వికెట్‌ బి) ఫెర్గూసన్‌ 18; దీపక్‌ చాహర్‌ (నాటౌట్‌) 21; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 184/7. వికెట్ల పతనం: 1-69, 2-71, 3-83, 4-103, 5-139, 6-140, 7-162. బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-31-1; మిల్నే 4-0-47-1; ఫెర్గూసన్‌ 4-0-45-1; శాంట్నర్‌ 4-0-27-3; సోధీ 4-0-31-1.


న్యూజిలాండ్‌: గప్టిల్‌ (సి) సూర్యకుమార్‌ (బి) చాహల్‌ 51; మిచెల్‌ (సి) హర్షల్‌ (బి) అక్షర్‌ 5; చాప్‌మన్‌ (స్టంప్‌) పంత్‌ (బి) అక్షర్‌ 0; ఫిలిప్స్‌ (బి) అక్షర్‌ 0; సైఫర్ట్‌ (రనౌట్‌) 17; నీషమ్‌ (సి) పంత్‌ (బి) హర్షల్‌ 3; శాంట్నర్‌ (రనౌట్‌) 2; మిల్నే (సి) రోహిత్‌ (బి) వెంకటేశ్‌ 7; సోధీ (సి) సూర్యకుమార్‌ (బి) హర్షల్‌ 9; ఫెర్గూసన్‌ (సి అండ్‌ బి) దీపక్‌ చాహర్‌ 14; బౌల్ట్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 17.2 ఓవర్లలో 111 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-21, 2-22, 3-30, 4-69, 5-76, 6-76, 7-84, 8-93, 9-95, 10-111. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2-0-12-0; దీపక్‌ చాహర్‌ 2.2-0-26-1; అక్షర్‌ 3-0-9-3; చాహల్‌ 4-0-26-1; వెంకటేశ్‌ అయ్యర్‌ 3-0-12-1; హర్షల్‌ 3-0-26-2.