గోదారి మింగేసింది

ABN , First Publish Date - 2021-04-03T08:07:35+05:30 IST

వారిద్దరూ తోడల్లుళ్లు.. మరో తోడల్లుడి ఇంట శుభకార్యానికి పిల్లలతో సహా వెళ్లారు. తర్వాత గోదావరిలో స్నానానికి దిగారు.

గోదారి మింగేసింది

  • స్నానానికి దిగిన ఆరుగురి దుర్మరణం..
  • శుభ కార్యానికి వెళ్లి.. మృత్యు ఒడికి! 
  • నిజామాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం..
  • మృతులందరూ బంధువులే

ఆర్మూర్‌/ మెండోర, ఏప్రిల్‌ 2: వారిద్దరూ తోడల్లుళ్లు.. మరో తోడల్లుడి ఇంట శుభకార్యానికి పిల్లలతో సహా వెళ్లారు. తర్వాత గోదావరిలో స్నానానికి దిగారు. ముందుగా నదిలో దిగిన ఇద్దరు చిన్న పిల్లలు లోతును అంచనావేయలేక మునిగిపోయారు. వారిని కాపాడే ప్రయత్నంలో మరో ఐదుగురు మునిగిపోయారు. వీరిలో ఆరుగురు దుర్మరణంపాలవ్వగా ఒకరిని స్థానికులు కాపాడారు. నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం గుత్ప గ్రామానికి చెందిన సూర సురేశ్‌ తన కుమారుడి కేశ ఖండన కార్యక్రమం శుక్రవారం నిర్వహించాడు. దీనికోసం బంధువులందరితో కలిసి మెండోర మండలం పోచంపాడు వద్ద గల గోదావరి నదికి చేరుకున్నారు. స్నానం చేయడం కోసం వీఐపీ పుష్కరఘాట్‌ సమీపంలో బొబ్బిలి సిద్ధార్ధ (16), రవికాంత్‌ అనే బాలురు ముందుగా గోదావరిలోకి దిగారు. వీరి వెంట మరికొందరు స్నానానికి దిగారు. లోతు తెలియక ఇద్దరు బాలురు మునిగిపోయారు. వారిని కాపాడే ప్రయత్నంలో మరో ఐదుగురు కూడా మునిగిపోయారు.


మొత్తం ఏడుగురు గల్లంతు కాగా అందులో రవికాంత్‌ అనే బాలుడిని స్థానికులు కాపాడారు. మిగిలినవారి కోసం స్థానికులు ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టగా.. నిజామాబాద్‌ ఎల్లమ్మగుట్టకు చెందిన బొబ్బిలి శ్రీనివాస్‌(40), అతని కుమారులు బొబ్బిలి సిద్ధార్థ(16), బొబ్బిలి శ్రీకర్‌(14), మాక్లూర్‌ మండలం డీకంపల్లికి చెందిన జిలకర సురేశ్‌(40), అతని కుమారుడు జిలకర యోగేశ్‌(16)ల మృతదేహాలు లభించాయి. కొన ఊపిరితో ఉన్న దొడ్ల రాజు(24) అనే వ్యక్తిని బయటకు తీశారు. అతడిని నిర్మల్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా..మార్గమధ్యంలో మరణించాడు. కాగా.. సంఘటన స్థలాన్ని అడిషనల్‌ డీసీపీ రఘువీర్‌ పరిశీలించారు. ఆర్మూర్‌ ఏసీపీ రఘు, సీఐ విజయ్‌కుమార్‌, ఎస్సైలు శ్రీధర్‌రెడ్డి, హరిప్రసాద్‌, రాఘవేందర్‌, తహసీల్దార్‌ జనార్ధన్‌ సహాయక చర్యలు పర్యవేక్షించారు.


మృతులందరూ సమీప బంధువులే..

సూర సురేశ్‌కు బొబ్బిలి శ్రీనివాస్‌, జిలకర సురేష్‌ తోడల్లుళ్లు అవుతారు. బొబ్బిలి శ్రీనివాస్‌ ఇద్దరు కుమారులు, జిలకర సురేశ్‌ కుమారుడు ఈ దుర్ఘటనలో మరణించారు. అలాగే గుత్ప గ్రామానికి చెందిన దొడ్ల రాజు సూర సురేశ్‌కు బామ్మర్ది అవుతాడు. ఈ దుర్ఘటన తో బంధువులందరూ శోక సంద్రంలో మునిగిపోయారు. త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన రాజు.. ఈ దుర్ఘటనలో మరణించడం విషాదం. అదే గ్రామానికి చెందిన యువతితో అతనికి నిశ్చితార్ధం జరిగింది. యువతి తండ్రి గల్ఫ్‌లో ఉంటాడు. అతను వచ్చిన తర్వాత పెళ్లి చేయాలని నిర్ణయించారు. రాజు మృతితో తల్లి రాజుబాయి శోక సంద్రంలో మునిగిపోయింది. రాజుబాయికి ఒక్కడే కుమారుడు. కుమారుడితో పాటు ఇద్దరు అల్లుళ్లు, ముగ్గురు మనవలు మరణించడంతో తీవ్రంగా రోదిస్తోంది. ఈ దుర్ఘటన మూడు కుటుంబాలకు మగ దిక్కు లేకుండా చేసింది. సాధారణంగా గోదావరిలో వేసవికాలంలో ప్రవాహం ఉండదు. కానీ ప్రస్తుతం ఆ ఘాట్‌కు శ్రీరామసాగర్‌ నుంచి నీటిని విడుదల చేస్తుండడం వల్ల కొద్దిగా ప్రవాహం ఉంది. ప్రాజెక్టు ఎస్కేప్‌ గేట్ల ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో.. ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 


గవర్నర్‌ తమిళిసై దిగ్ర్భాంతి

నిజామాబాద్‌ జిల్లా పోచంపాడు పుష్కర్‌ ఘాట్‌ వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు  మరణించడం పట్ల గవర్నర్‌ తమిళిసై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన కేసీఆర్‌

పోచంపాడులో ఆరుగురు నీటిలో మునిగి మరణించడం పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. స్నానం చేయడానికి దిగిన వారు దురదృష్టవశాత్తు మృత్యువాతపడడం కలచి వేసిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ దుర్ఘటనపై ఎమ్మెల్సీ కవిత దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు.

Updated Date - 2021-04-03T08:07:35+05:30 IST