Abn logo
May 5 2021 @ 00:00AM

ఆపద వేళ అన్నపూర్ణలై...

కొవిడ్‌ బారిన పడి సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్న వారి కోసం ‘మేమున్నాం’ అంటూ ముందుకొచ్చారు ముగ్గురు  మహిళలు. రోజూ దాదాపు వందమందికి ఇంట్లోనే ఆహారం తయారు చేసి, ఉచితంగా గుమ్మం దగ్గరే అందిస్తున్నారు. దీనికోసం ఏడాది కాలం అవసరాలకు దాచుకున్న సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. పాట్నాకు చెందిన కుందన్‌, ఆమె కుమార్తెలు అనుపమ, నీలిమా తమ సేవలతో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.


బీహార్‌ రాజధాని పాట్నా నగరంలోని రాజేంద్రనగర్‌లో ఉన్న ఆ మధ్య తరగతి ఇంట్లో ప్రతిరోజూ పొద్దున్నే హడావిడి మొదలవుతుంది. అనుపమా సింగ్‌, ఆమె తల్లి కుందన్‌ వంటింటి పనుల్లో నిమగ్నమైపోతారు. ఉదయం పదిగంటలయ్యేసరికి వంద మందికి పైగా సరిపడా ఆహారం సిద్ధమవుతుంది. దాన్ని అనుపమ, ఇరవయ్యారేళ్ళ ఆమె సోదరి నీలిమా సింగ్‌ ప్యాక్‌ చేస్తారు. సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్‌ రోగులకు చేరవేసే బాధ్యత నీలిమది.


రోజూ పదిహేను కిలోమీటర్లు వెళ్ళి...

సమాజానికి వీలైనంత సేవ చెయ్యాలనే తపన ఉన్న అనుపమ ఇంతకుముందు ‘యాక్షన్‌ ఎయిడ్‌’ అనే సంస్థలో పని చేశారు. ఆమె హిస్టరీ, ఉమెన్‌ స్టడీ్‌సలో ఎమ్మే చేశారు. రెండేళ్ళ బిడ్డ ఉన్న ఆమె సోదరి నీలిమ ఎకనామిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌. ఎంబిఎ, ఎంఎ్‌సడబ్ల్యూ కూడా చేశారు. ప్రస్తుతం నీలిమ యుపిఎ్‌ససికి ప్రిపేర్‌ అవుతున్నారు. ఫుడ్‌ ప్యాకెట్ల పంపిణీ కోసం ఆమె రోజుకు పదిహేను కిలోమీటర్ల దూరం వెళ్ళి వస్తున్నారు. ఈ కార్యక్రమం చేపట్టడం వెనుక కారణం గురించి చెబుతూ.... ‘ఈ మధ్య మా కుటుంబ సభ్యుల్లో ఒకరికి కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి. పరీక్ష చేయిస్తే పాజిటివ్‌ వచ్చింది. వైరస్‌ సోకిన వాళ్ళు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో కనీసం రెండువారాలు ఉండాలి. సమయానికి వాళ్ళకు ఆహారం అందించేవాళ్ళు లేనప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో మాకు స్పష్టంగా తెలిసింది. అలాంటి వాళ్ళకోసం ఏదైనా చెయ్యాలనిపించింది. సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్ల కోసం వారి ఇళ్ళ వద్దకే ఉచితంగా ఆహారాన్ని ప్యాకెట్లలో అందించాలన్న ఆలోచన వచ్చింది’ అంటోంది అనుపమ.


ఇది మాధవ సేవే!

ఇలాంటి సహాయక కార్యక్రమాలు తలపెట్టడం, కొనసాగించడం ఖర్చుతో కూడుకున్న పని. దీనికోసం తమ పెళ్ళి రోజులు, పుట్టినరోజుల కోసం, దుస్తులు, ఇంటికి కావలసిన ఇతర వస్తువుల కోసం ఏడాది కాలానికి దాచుకున్న డబ్బును ఉపయోగించాలని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. ఎవరి సహాయం లేకుండా ఆ అక్కాచెల్లెళ్ళు, వారి తల్లీ ఉచితంగా ఆహారాన్ని కొవిడ్‌ రోగులకు అందజేస్తున్నారు. ‘‘కష్టంలో ఉన్న వాళ్ళకు సేవ చేయడం మానవత్వానికి సేవ చేయడమే. మానవత్వానికి సేవ చేయడం అంటే మనల్ని అదృశ్యంగా నడిపించే దైవానికి సేవ చేయడమే. మన పెద్దలు ‘మానవసేవే మాధవ సేవ’ అన్నారు కదా! అని చెబుతున్నారు నీలిమ. ‘‘మేం చేస్తున్న సాయ గురించి తెలిసి కొందరు స్నేహితులు వారికి తీరిక ఉన్న సమయాల్లో ఆహారాన్ని డెలివరీ చెయ్యడానికి సాయం చేస్తున్నారు. అయితే చాలా సార్లు ఇంటికి పరిమితం అయితేనే సురక్షితంగా ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారు’ అంటారామె.


ప్రతి ఒక్కరూ హీరోలే!

‘మాకు విరాళాలు ఇవ్వడానికి ఎందరో ముందుకు వస్తున్నారు. అయితే వాటిని మేం తీసుకోకుండా వాళ్ళకు సమీపంలో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారికి ఇటువంటి సేవలు అందించాలని కోరుతున్నాం. ప్రీతీ కుమారి అనే మహిళ దీనికి స్పందించారు. ఆమె నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న కొవిడ్‌ పేషెంట్లకు ఉచితంగా ఆహారం అందజేస్తున్నారు. ఇక తమ బంధువులకూ, మిత్రులకూ ఆహారం అందించాలని సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞాపనలు వస్తున్నాయి. మాకు వీలైన సాయం చేస్తున్నాం’ అని చెబుతున్నారు అనుపమ. ‘ప్రతి ఒక్క వ్యక్తీ ఒక సోషల్‌ హీరో అని మేం నమ్ముతాం. మనం ఏడాదిలో చేసే అదనపు ఖర్చుల్ని తగ్గించుకుంటే, అవసరంలో ఉన్న ఎంతోమందికి సాయం చెయ్యవచ్చు. కొవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో ప్రజల్లో, ముఖ్యంగా రోగుల్లో భయం కలిగించకుండా సానుకూల దృక్పథం పెంచడం ప్రధానం. వ్యవస్థలూ, సామాజిక మాధ్యమాలూ ఆ బాధ్యత తీసుకోవాలి’ అంటున్నారీ అక్కాచెల్లెళ్ళు. వారి నిస్వార్థ సేవ మరింతమందికి ప్రేరణ కలిగిస్తుందనడంలో సందేహం లేదు.


Advertisement
Advertisement
Advertisement