పేసర్ల విజృంభణ

ABN , First Publish Date - 2020-02-16T10:00:38+05:30 IST

సన్నాహక మ్యాచ్‌లో రెండో రోజు భారత్‌ హవా సాగింది. పేసర్లు షమి (3/17), బుమ్రా (2/18), ఉమేశ్‌ యాదవ్‌ (2/49), సైనీ (2/58) కలిసికట్టుగా

పేసర్ల విజృంభణ

భారత బ్యాట్స్‌మెన్‌ విఫలమైన చోట పేసర్లు అదరగొట్టారు. పచ్చిక పిచ్‌పై తాము కూడా ప్రమాదకరమేనంటూ తొలి టెస్టుకు ముందు విలియమ్సన్‌ సేనకు సవాల్‌ విసిరారు. ముఖ్యంగా వన్డే సిరీ్‌సలో తేలిపోయిన జస్‌ప్రీత్‌ బుమ్రా తిరిగి ట్రాక్‌లోకి రాగా అతడికి మహ్మద్‌ షమి తోడవడంతో ఈసారి కివీస్‌ లెవెన్‌ బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. దీంతో ఆ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితం కాగా టీమిండియాకు ఆధిక్యం దక్కింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌ దూకుడుగా బదులిస్తున్నారు..


రాణించిన షమి, బుమ్రా

కివీస్‌ లెవెన్‌ 235  ఆలౌట్‌ 

ఆధిక్యంలో భారత్‌


హామిల్టన్‌: సన్నాహక మ్యాచ్‌లో రెండో రోజు భారత్‌ హవా సాగింది. పేసర్లు షమి (3/17), బుమ్రా (2/18), ఉమేశ్‌ యాదవ్‌ (2/49), సైనీ (2/58) కలిసికట్టుగా కదం తొక్కారు. వీరి ధాటికి కివీస్‌ లెవెన్‌లో ఒక్కరు కూడా అర్ధసెంచరీ చేయలేకపోయారు. ఈ నలుగురే తొమ్మిది వికెట్లు తీయగా, స్పిన్నర్‌ అశ్విన్‌కు ఓ వికెట్‌ దక్కింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ లెవెన్‌ 74.2 ఓవర్లలో 235 పరుగులకు కుప్పకూలింది. హెన్రీ కూపర్‌ (40), రచిన్‌ రవీంద్ర (34) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత 28 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ శనివారం ఆట ముగిసే సమయానికి 7 ఓవర్లలోనే 59 పరుగులు చేసింది. పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరిస్తుండడంతో ఓపెనర్లు పృథ్వీ షా (25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 35 బ్యాటింగ్‌), మయాంక్‌ (17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 23 బ్యాటింగ్‌) కివీస్‌ బౌలర్లపై బౌండరీలతో దాడికి దిగారు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరినీ అవుట్‌ చేసిన కుగెలిన్‌ను లక్ష్యంగా చేసుకుని అతడి మూడు ఓవర్లలోనే 34 పరుగులు సాధించారు. ప్రస్తుతానికి జట్టు 87 పరుగుల ఆధిక్యంలో ఉంది. 


పేస్‌ పదునుకు బెంబేలు

భారత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న ఆనందం కివీస్‌ లెవెన్‌కు లేకుండా పేసర్లు దెబ్బతీశారు. వీరి ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ నుంచే వికెట్ల పతనం ఆరంభమైంది. బుమ్రా తన రెండో ఓవర్‌లో ఓపెనర్‌ యంగ్‌ (2)ను అవుట్‌ చేసి షాకిచ్చాడు. అటు షమి తన మొదటి  ఓవర్‌ను మెయిడిన్‌గా వేయడంతో పాటు సీఫెర్ట్‌ (9) వికెట్‌ను కూడా తీసి ఆకట్టుకున్నాడు. ఉమేశ్‌ యాదవ్‌ పరుగులిచ్చినప్పటికీ క్రీజులో నిలదొక్కుకున్న రచిన్‌ రవీంద్రను దెబ్బతీశాడు. అయితే ఈ దశలో కివీస్‌ లెవెన్‌ మిడిలార్డర్‌ కాస్త పోరాడగలిగింది. ఆలెన్‌ (20), కూపర్‌, బ్రూస్‌ (31), మిచెల్‌ (32) జట్టును నిలబెట్టేందుకు ప్రయత్నించినా కూడా ఒక్కరూ భారీ స్కోరు సాధించలేకపోయారు. అటు ఎనిమిదో నెంబర్‌లో దిగిన జిమ్మీ నీషమ్‌ (1) నిరాశపర్చగా షమికి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. లంచ్‌ తర్వాత చక్కటి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో ఇబ్బందిపెట్టిన షమి తన కోటా 10 ఓవర్లలో 17 పరుగులే ఇవ్వగా.. బుమ్రా 11 ఓవర్లలో 18 పరుగులే ఇవ్వడం విశేషం.


స్కోరుబోర్డు


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 263

కివీస్‌ లెవెన్‌ తొలి ఇన్నింగ్స్‌: విల్‌ యంగ్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 2; రవీంద్ర (సి) పంత్‌ (బి) ఉమేశ్‌ 34; సీఫెర్ట్‌ (సి) పంత్‌ (బి) షమి 9; ఆలెన్‌ (బి) బుమ్రా 20; కూపర్‌ (సి) మయాంక్‌ (బి) షమి 40; బ్రూస్‌ (బి) సైనీ 31; మిచెల్‌ (సి) షా (బి) ఉమేశ్‌ 32; నీషమ్‌ (బి) షమి 1; క్లీవర్‌ (బి) సైనీ 13; కుగెలిన్‌ (నాటౌట్‌) 11; సోధీ (సి) పుజార (బి) అశ్విన్‌ 14; ఎక్స్‌ట్రాలు: 28; మొత్తం: 74.2 ఓవర్లలో 235 ఆలౌట్‌. బౌలింగ్‌: బుమ్రా 11-3-18-2; ఉమేశ్‌ యాదవ్‌ 13-1- 49-2; షమి 10-5-17-3; సైనీ 15-2-58-2; అశ్విన్‌ 15.2-2-46-1; జడేజా 10-4-25-0.

వికెట్ల పతనం: 1-11, 2-36, 3-70, 4-82, 5-133, 6-155, 7-161, 8-204, 9-213, 10-235.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బ్యాటింగ్‌) 35; మయాంక్‌ (బ్యాటింగ్‌) 23; 

ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 7 ఓవర్లలో 59/0.

బౌలింగ్‌: టిక్నెర్‌ 3-0-19-0; కుగెలిన్‌ 3-0-34-0; జాన్‌స్టన్‌ 1-0-6-0.

Updated Date - 2020-02-16T10:00:38+05:30 IST