Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏప్రిల్ 9న ఖమ్మంలో షర్మిల సభ!.. నేడు జిల్లాలో వైఎస్ విగ్రహం ధ్వంసం

ఖమ్మం: వైఎస్ షర్మిల ఖమ్మం పర్యటనకు ముందే షాక్ తగిలింది. జిల్లాలోని శివాయిగూడెంలో వైఎస్‌ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో రఘునాథపాలెం పోలీసులకు వైఎస్ అభిమానుల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యం షర్మిల సలహాదారు పిట్టా రాంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం సభను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనలకు ఎవరు పాల్పడుతున్నారో తమకు అర్థం అవుతోందని చెప్పారు. షర్మిలకు వస్తున్న ఆదరణను తట్టుకోలేక ఇలా చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కూల్చివేసిన చోట మళ్లీ వైఎస్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 9న ఎట్టి పరిస్థితుల్లో సభ పెట్టి తీరుతామని రాంరెడ్డి స్పష్టం చేశారు.


ఏప్రిల్ 9న పార్టీ పేరును ప్రకటించాలని వైఎస్ షర్మిల నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాలో లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించాలని ఆమె నిర్ణయించారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా నేతలతో షర్మిల చర్చించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన టీటీడీ సలహా సంఘం సభ్యుడు, మొదటినుంచీ వైఎస్‌ కుటుంబంతో కలిసి పనిచేస్తున్న పిట్టా రాంరెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మం సభకు జన సమీకరణ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఫిబ్రవరి 21న భారీ ర్యాలీతో బయల్దేరి ఖమ్మం జిల్లాలో పర్యటించాలని షర్మిల నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement