రాజన్న బిడ్డగా ఆశీర్వదించండి

ABN , First Publish Date - 2021-10-23T04:40:53+05:30 IST

షర్మిల పాదయాత్ర మూడోరోజు శుక్రవారం శంషాబాద్‌ మండలంలో

రాజన్న బిడ్డగా ఆశీర్వదించండి
శంషాబాద్‌ మండల పరిధిలో బస్సు ప్రయాణికులకు అభివాదం చేస్తున్న షర్మిల

  • ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల 
  • అడుగడుగునా ప్రజలతో పలకరింపు
  • దారిపొడవునా సమస్యలు వింటూ ముందుకు.. 
  • షర్మిలను చూసేందుకు ఆరాటపడిన స్థానికులు


షర్మిల పాదయాత్ర మూడోరోజు శుక్రవారం శంషాబాద్‌ మండలంలో కొనసాగింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ షర్మిల యాత్రలో ముందుకు సాగారు. గ్రామాల్లో మహిళలు, రైతులు, గీతకార్మికులు వివరించిన సమస్యలను ఓపికగా విని వారిని ఓదార్చారు.


శంషాబాద్‌ రూరల్‌ / మొయినాబాద్‌ / చేవెళ్ల : వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల నిర్వహిస్తున్న ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. మూడోరోజు శుక్రవారం శంషాబాద్‌ మండలం కాచారం గ్రామం పరిఽధి నుంచి ఉదయం 10.50 నిమిషాలకు పాదయాత్ర ప్రారంభ మైంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రజలతో మమేకమై కదిలిన షర్మిలకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. దారిపొడవునా మహిళలు, రైతులు, విద్యార్థులు, యువకులు షర్మిలను కలిసి తమ సమస్యలు తెలియజేశారు.  రాజశేఖర్‌రెడ్డి పాలనలో పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలు చేసి ఎంతో మేలు చేశారని ప్రజలు షర్మిలకు గుర్తు చేశారు. రాజన్న బిడ్డగా మీ ముందుకు వస్తున్నా.. దీవించండి.. అంటూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రెండు సంవత్సరాల్లో ఎన్నికలు వస్తాయని, మీరు ఆశీర్వదించాలని కోరారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని షర్మిల తెలిపారు. 

రాజన్నబిడ్డ షర్మిలను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. ఆమెతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. నర్కుడ గ్రామానికి చెందిన కళమ్మతోపాటు మరికొందరు మహిళలు షర్మిలను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. దివంగత వైఎస్‌ఆర్‌ హయాంలో 60 గజాల ఇంటి స్థలం, మహిళాసంఘాలకు వడ్డీ లేని రుణాలు, పింఛన్లు, అభయహస్తం బీమా సౌకర్యం కల్పించారని మహిళలు షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వం రుణమాఫీ చేయడం లేదని, సబ్సిడీ విత్తనాలు, డ్రిప్‌ పరికరాలు, వ్యవసాయ పనిముట్లు ఇవేమీ ఇవ్వడం లేదని పలువురు రైతులు తెలిపారు. 

కాచారం గ్రామానికి చెందిన గీత కార్మికుడు సిద్దులు షర్మిలను కలిసి గీతకార్మికుల సమస్యలను తెలియజేశారు. సుల్తాన్‌పల్లి గ్రామానికి చెందిన నర్సింలుతోపాటు పలువురు రైతులు భూసమస్యను పరిష్కరించాలని షర్మిలకు వినతిపత్రం అందించారు. నర్కూడ గ్రామానికి చెందిన మహిళలు, యువకులు షర్మిలకు స్వాగతం పలికారు. ఈ పాదయాత్రలో రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి దయా నంద్‌, పార్టీ చేవెళ్ల మండల అధ్యక్షుడు శివారెడ్డి, శంషాబాద్‌ మండల కన్వీనర్‌ ఆజామ్‌, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 

ప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న ఆధ్వ ర్యంలో నిర్వహించిన ధూంధాం కార్య క్రమం పలువురిని ఆకట్టుకుంది. తన ఆటపాటలతో కార్యకర్తలు, నాయ కుల్లో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగారు. బతుకమ్మ పాటలతోపాటు తెలంగాణ యాస భాసను ఉపయోగిస్తూ పాటలు పాడుతూ అందరిని ఆలరించారు. ప్రత్యేకంగా షర్మిలక్కపై పాటలు ప్రజల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. కళాకారులతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు డప్పు వాయిద్యాలకు స్టెప్పులు వేశారు. 



Updated Date - 2021-10-23T04:40:53+05:30 IST