నేడే షర్మిల సంకల్ప సభ

ABN , First Publish Date - 2021-04-09T08:52:18+05:30 IST

దివగంత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో రాజకీయ సంకల్పం తీసుకోనున్నారు.

నేడే షర్మిల సంకల్ప సభ

ఖమ్మం పెవిలియన్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లు

లోటస్‌పాండ్‌ నుంచి భారీ కారు ర్యాలీ

వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాక


హైదరాబాద్‌/ఖమ్మం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): దివగంత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో రాజకీయ సంకల్పం తీసుకోనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌లో ఆమె తలపెట్టిన సంకల్ప సభ శుక్రవారం జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌నుంచి భారీ కాన్వాయ్‌తో షర్మిల బయలుదేరుతారు.


చౌటుప్పల్‌, సూర్యాపేట, పాలేరుల మీదుగా ఖమ్మం చేరుకుంటారు. వైఎస్‌ సతీమణి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి తన కుమార్తె వెంటే ఉండనున్నారు. ఖమ్మం పట్టణానికి సమీపంలోని పెద్దతండా వద్ద వైఎస్‌ విగ్రహానికి నివాళులు అర్పించి.. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో వీరంతా పెవిలియన్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. లక్ష మందితో సంకల్ప సభను నిర్వహించాలని షర్మిల భావించినా కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 6 వేల మందితో నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. అయితే, అభిమానుల ఉత్సాహం చూస్తుంటే సంకల్ప సభకు భారీగానే హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయని షర్మిల పార్టీ నేత ఒకరు తెలిపారు.


జూలై 8న పార్టీ ప్రారంభం

తెలంగాణ రాజకీయాల్లో తన పాత్ర ఏంటన్నదానిపై సంకల్ప సభ ద్వారా షర్మిల స్పష్టతను ఇవ్వనున్నారు. తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావాలన్నదే తన సంకల్పమన్న సంగతి ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీ సమీక్షా సమావేశాల్లో ఆమె వెల్లడించారు. ఖమ్మం సంకల్ప సభలో తన సంకల్పం ఏంటన్నది ప్రజలకు వివరించనున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీపైన విమర్శనాస్త్రాలూ సంధిస్తారని చెబుతున్నారు. తెలంగాణలో కొత్త పార్టీని ఏ తేదీన ప్రారంభించనున్నదీ ఆమె ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైఎస్‌ జయంతి రోజైన జూలై 8న పార్టీని ప్రారంభించనున్నట్లు ఆమె ఈ సభలో ప్రకటించే ఆస్కారమూ ఉన్నట్లు చెబుతున్నారు.


కాగా, షర్మిల ఎవరి బాణం కాదని, తెలంగాణ ప్రజల బాణమని ఈ బాణం రాకతో జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ముసలం తప్పదని షర్మిల పార్టీ ముఖ్యనేత కొండా రాఘవరెడ్డి స్పష్టం చేశారు. సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఆయన ఖమ్మంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో వైఎస్‌ సంక్షేమ రాజ్యం స్థాపించే లక్ష్యంతో షర్మిల సంకల్ప సభ జరుగుతుందని తెలిపారు.

Updated Date - 2021-04-09T08:52:18+05:30 IST