Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేను చేస్తున్నది పవిత్రమైన పని!

కుటుంబ సభ్యులే పట్టించుకోకుండా వదిలేసిన కొవిడ్‌ బాధితుల మృతదేహాలకు ఆమె ఉచితంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. దీని కోసం నర్సు ఉద్యోగాన్ని సైతం వదిలేశారు. ‘‘మానవ సేవే మాధవ సేవ’ అన్నారు పెద్దలు. మరణించిన మనుషులకు గౌరవంగా తుది వీడ్కోలు ఇవ్వడం కన్నా గొప్ప దైవకార్యం ఏముంటుంది’’ అంటున్నారు భువనేశ్వర్‌కు చెందిన మధుస్మిత. 


‘‘మన మనసుకు మంచిది అనిపించిన ఏ పనినైనా చెయ్యడానికి సంకోచం అవసరం లేదు. ఎవరో ఏదో అనుకుంటారన్న ఆలోచన అక్కర్లేదు’’ అంటారు మధుస్మిత ప్రుస్టి(37). మహిళలు ప్రవేశించడానికే అంగీకరించని శ్మశానాల్లోకి ఆమె వెళ్ళడమే కాదు, సంప్రదాయం స్త్రీలను అనుమతించని అంత్యక్రియలను సైతం ఆమె స్వయంగా నిర్వహిస్తున్నారు. 


మధుస్మిత స్వస్థలం ఒడిశాలోని భువనేశ్వర్‌ అయినా, బాల్యం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గడిచింది. సంప్రదాయ కుటుంబంలో ఎన్నో కట్టుబాట్ల మధ్య ఆమె పెరిగారు. ‘‘ఎవరికైనా సాయం చెయ్యాలనే ఆలోచన నాలో కలిగింది ప్రదీ్‌పను కలిసిన తరువాతే’’ అంటారామె. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రదీప్‌, మధుస్మిత స్నేహితులయ్యారు. ప్రదీప్‌ భువనేశ్వర్‌లో ఉండేవారు. సొంత ఊరు వచ్చినప్పుడల్లా ప్రదీ్‌పను ఆమె కలిసేవారు.


ఆశయాలు నచ్చి...

ప్రదీప్‌ తల్లి ప్రమాదవశాత్తూ రైలు పట్టాలపై పడి మరణించారు. ఆమెకు అంత్యక్రియలు జరపడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సంఘటనతో ఎంతో ఆవేదనకు గురైన ప్రదీప్‌ మరెవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదనుకున్నారు. భువనేశ్వర్‌ కేంద్రంగా ప్రదీప్‌ సేవా ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. రైలు పట్టాలపైనా, ఆసుపత్రుల్లోనూ పడిఉన్న గుర్తు తెలియని మృతదేహాలకు, రోడ్డు ప్రమాదాల్లో మరణించినవారికి అంత్యక్రియలు చేయడం ప్రారంభించారు. 

ప్రదీప్‌ ఆశయాలు నచ్చిన మధుస్మిత ఆ కార్యక్రమాల్లో భాగమయ్యారు. 2010లో వాళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్ళయిన తరువాత నర్సింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసిన మధుస్మిత కోల్‌కతాలోని ఒక పైవ్రేట్‌ ఆసుపత్రిలో తొమ్మిదేళ్ళపాటు నర్సుగా పని చేశారు. ‘‘రెండేళ్ళ కిందట ప్రదీ్‌పకు ప్రమాదంలో కాలు విరిగి, కొన్నాళ్ళు మంచానికే పరిమితమైపోయారు. ట్రస్ట్‌ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆయన సేవా కార్యక్రమాలను కొనసాగించడానికి 2019లో ఉద్యోగం వదిలేసి భువనేశ్వర్‌కు తిరిగి వచ్చాను’’ అని చెప్పారు మధుస్మిత.


అన్నం వండే టైమ్‌ కూడా దొరకట్లేదు...

ఈలోగా కరోనా వైరస్‌ వ్యాప్తి, మరణాలు పెరగడం, కుటుంబ సభ్యులే మృతదేహాలకు స్వయంగా అంత్యక్రియలు చెయ్యడానికి విముఖత చూపించడంతో ఆ బాధ్యతలు తీసుకోవడానికి ఈ దంపతులు ముందుకు వచ్చారు. ‘‘గత పదేళ్ళలో ఇప్పటి వరకూ 1,500కు పైగా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాం. కిందటి ఏడాది నుంచి చేసినవి దాదాపు 500కు పైగా ఉంటాయి. వాటిలో ఎక్కువ శాతం కొవిడ్‌ మృతులవే!’’ అంటున్నారు మధుస్మిత. ‘‘కరోనా సెకెండ్‌వేవ్‌ మొదలయ్యాక రోజుకు ఇరవై వరకూ మృతదేహాలు వస్తున్నాయి. రాత్రనకా, పగలనకా కాల్స్‌ వస్తూనే ఉంటాయి. అన్నం వండుకోవడానికీ, వండుకున్నా తినడానికీ కూడా సమయం దొరకడం లేదు. కొన్ని సార్లు బిస్కట్లతోనే కడుపు నింపుకొంటున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి గుర్మీత్‌, అమ్మాయి జనసేని. మేము చేస్తున్న పనిని వారు అర్థం చేసుకున్నారు. వంటలో సాయం చేస్తున్నారు’’ అన్నారామె.రోజుకు ఇరవై మృతదేహాలు... 

ఏ సమయంలో ఫోన్‌ కాల్‌ వచ్చినా కొద్ది నిమిషాల్లో తయారై, అంబులెన్స్‌లో ఆమె బయలుదేరుతారు. ఈ దంపతుల అంకితభావం చూసి భువనేశ్వర్‌ నగర పాలక సంస్థ (బిఎంసి)... వారి ట్రస్టుతో కలిసి పని చేస్తోంది. నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన భరత్‌పూర్‌ క్రిమేషన్‌ గ్రౌండ్‌తో సహా అయిదు శ్మశానవాటికల్లో ట్రస్ట్‌ అంత్యక్రియలు చేస్తోంది. దీనికి అయ్యే ఖర్చంతా ట్రస్టే భరిస్తోంది. ‘‘మాది స్తోమత ఉన్న కుటుంబం కాదు. నా భర్త కూరగాయలు, పండ్లు అమ్మి తెచ్చే సంపాదనే మాకు ఆధారం. నేను నర్సుగా ఉన్నప్పుడు రూ.30 వేల జీతం వచ్చేది. ఇప్పుడు అది కూడా లేదు. ఇల్లు గడపడం కష్టమవుతోంది. మా ట్రస్టులో యాబై మందికి పైగా సభ్యులున్నారు. వారిలో కొందరు రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగులు. అందరూ తలా కాస్త సాయం చేస్తున్నారు. మృతదేహాలను తీసుకురావడం నుంచి కట్టెలు, పురోహితుడు, అంత్యక్రియలకు కావలసిన సామగ్రి వరకు అన్నీ నేనే సమకూరుస్తున్నాను. ఒక్కోసారి పిపిఇ కిట్లు కొనడం కూడా కష్టమవుతోంది. ప్రస్తుతం మా ట్రస్టుకు రెండు అంబులెన్సులు ఉన్నాయి. మరికొన్ని ఉంటే బాగుంటుందనుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని రోజులుగా రోజుకు ఇరవై వరకూ కొవిడ్‌ రోగుల మృతదేహాలు వస్తున్నాయి’’ అని చెప్పారామె. 


ఇదో గొప్ప అవకాశం.. 

‘‘సంప్రదాయం ప్రకారం మహిళలు శ్మశానాలకు వెళ్ళకూడదు. అంత్యక్రియల్లో పాల్గొనకూడదు. ఈ విషయంలో నాకు బాగా సన్నిహితులే అభ్యంతరం చెప్పారు. అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. కానీ అవేవీ నేను పట్టించుకోవడం లేదు. భయం వల్లో, మరే కారణం వల్లో అయినవాళ్ళకు ఆఖరి వీడ్కోలు చెప్పడానికి కూడా చాలామంది శ్మశానం వరకూ రావడం లేదు. ఈ పరిస్థితి చూసి ఎంతో బాధ కలుగుతోంది. అనాథలకు అంత్యక్రియలు చేసేవారికి ఉత్తమ గతులు కలుగుతాయంటారు. అది నిజమో కాదో నాకు తెలీదు. కానీ సమాజానికి సేవ చేయడానికి ఈ జన్మలో నాకు దొరికిన గొప్ప అవకాశంగా ఇది. నేను చేస్తున్నది ఎంతో పవిత్రమైన, గౌరవప్రదమైన పని అని నాకు తెలుసు’’ అంటున్నారు మధుస్మిత. 


Advertisement
Advertisement