ఆ వాచ్‌...కోటిన్నరే!

ABN , First Publish Date - 2021-11-17T10:17:57+05:30 IST

తనకు సంబంధించిన రెండు విలువైన వాచ్‌లను ముంబై విమానాశ్రయంలోని కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారన్న ప్రచారాన్ని టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఖండించాడు

ఆ వాచ్‌...కోటిన్నరే!

  • రూ. 5 కోట్ల వాచ్‌ల సీజ్‌పై పాండ్యా వివరణ


ముంబై:
తనకు సంబంధించిన రెండు విలువైన వాచ్‌లను ముంబై విమానాశ్రయంలోని కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారన్న ప్రచారాన్ని టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఖండించాడు. దుబాయ్‌ నుంచి తాను తీసుకువచ్చిన వస్తువులను కస్టమ్స్‌ అధికారుల వద్ద స్వచ్ఛందంగా డిక్లేర్‌ చేయగా.. వాస్తవ విలువను లెక్కించేందుకు రూ. 1.50 కోట్ల వాచ్‌ను మాత్రమే స్వాధీనం చేసుకున్నారని తెలిపాడు. టీ20 వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత సోమవారం ఉదయం పాండ్యా భారత్‌ తిరిగి వచ్చాడు. తన లగేజీని తీసుకున్న తర్వాత కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించడం కోసం వాటిని అధికారుల వద్దకు తీసుకెళ్లినట్టు హార్దిక్‌ తెలిపాడు. అయితే, సరైన పత్రాలు లేకపోవడంతో.. అతడి వద్ద రూ. 5 కోట్ల విలువైన రెండు వాచ్‌లను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. ‘ముంబై రాగానే స్వచ్ఛందంగా వెళ్లి కస్టమ్స్‌ అధికారులను కలుసుకున్నా. కొని తెచ్చుకున్న వస్తువుల జాబితాను చూపి.. సుంకం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వారికి తెలిపా. ధ్రువీకరణ కోసం రసీదులు కూడా అందజేశా. ఓ వాచ్‌ విలువ రూ. 1.50 కోట్లు. అంతేకానీ రూ. 5 కోట్లు కాదు’ అని పాండ్యా ట్వీట్‌ చేశాడు. 

Updated Date - 2021-11-17T10:17:57+05:30 IST