Abn logo
Jul 5 2021 @ 00:19AM

సీమ మూలాల కోవిల్పట్టి కథకుడు

మానవజాతి చరిత్రలో మెజారిటీ జాతులు స్థిరంగా ఒక్కచోటనే ఉండి తరతరాలుగా తమ జీవనాన్ని అక్కడే కొనసాగించాయి అని రూఢిగా చెప్పలేం. బహుశా ఇందుకు కొన్ని ఆదివాసీ జాతులు మినహాయింపు కావచ్చు. కృష్ణన్‌ రాజనారాయణ -కీరా- పూర్వీకులు రాయలసీమకు చెందినవారు. కృష్ణన్‌ అనేది వారి తండ్రి పేరు. తమిళ సంప్రదాయంలో పేరుకు ముందు తండ్రి పేరు ఉండటం పరిపాటి. తమిళనాడు తెలుగువారు చాలామంది నాకు పరిచయం. అయితే, తమ మూలాలను కీరాలాగా ప్రేమించి నిరంతరం తలుచుకొనేవారు నాకు తెలిసినంతలో మరొకరు లేరు. స్వయంకృషితో ఆయన తెలుగు మాట్లాడటం బాగా నేర్చుకొన్నారు. అయితే, తాను తెలుగులో రాయలేకపోతున్నాననీ, చదవలేకపోతున్నాననే దిగులు మాత్రం ఆయనలో చివరికంటా ఉండేది. 


కీరా తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇడైచేవల్‌ గ్రామంలో జన్మించారు. ఆయన బాల్య మిత్రుడు, రచయిత అళగిరి స్వామిది కూడా ఈయన పొరుగిల్లే. కీరాది వ్యవసాయ కుటుంబం కాగా, అళగిరి స్వామిది స్వర్ణకారుల కుటుంబం. అళగిరి స్వామి జర్నలిస్టుగా, సోవియట్‌ భూమి తమిళ పత్రిక ఉద్యోగిగా, కథా రచయితగా పేరుపొందిన వ్యక్తి. సమకాలీనులైన వీరిద్దరూ కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతిని పొందడం, అదికూడా ఒక మారుమూల గ్రామానికి చెందినవారు కావడం, తెలుగువారు కావడం విశేషం. కీరాతో నా పరిచయం డాక్టర్‌ సుధారాణి, సుబ్ర హ్మణ్యం దంపతుల ద్వారా జరిగింది. డాక్టర్‌ సుధా రాణి తమిళనాడులోని తెలుగు సముదాయాల నాలుకలపై తరతరాలుగా ప్రాచుర్యంలో ఉన్న పల్లె కథల మీద దాదాపు నాలుగు సంవత్సరాలపాటు పరిశోధనచేసి ద్రావిడ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్‌ అందుకొన్నారు. ఈ కథల సేకరణ క్రమంలోనే వారికి కీరాతో పరిచయం ఏర్పడింది. డాక్టర్‌ సుధా రాణి, సుబ్రహ్మణ్యం ఒక టీవీ చానల్‌కోసం తమిళ నాడు తెలుగు ప్రజలమీద సిరీస్‌ తయారుచేస్తున్న ప్పుడు... వారితోపాటు నేను కూడా వెళ్లేవాడిని. ఇడైచేవల్‌ గ్రామానికి వెళ్లినప్పుడు కీరా కుమారుడు, ఇతర బంధువులను కలిశాం. వారంతా తెలుగు బాగానే మాటా ్లడుతున్నారు. కీరా ఇంటిపేరు అడిగితే రాయంగల్‌ అని చెప్పారు. కానీ, అది రాయంకుల. అలాగే అళగిరి స్వామి ఇంటి పేరు గుంటూరు అన్నారు. కానీ అది కొండూరు. తమిళ భాషలో క, ఖ, గ, ఘలకు ఒక్కటేఅక్షరం. దానివల్లే ఈ రకమైన ఉచ్చారణ. కీరా, అళగిరి స్వామి ఇద్దరూ కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా ఉండేవారు. కీరా రెండుసార్లు రైతు ఉద్యమాల్లోపాల్గొని జైలుకు వెళ్లివచ్చారు. తమిళనాడు పల్లె కథల సేకరణలో కీరా ప్రథముడిగా నిలుస్తారు. మరో విషయం ఏమిటంటే, తమిళనాడులో ఉన్న మాండలికాల్లో అత్యధికం ఆయనకు కొట్టిన పిండి. భాష పట్ల, మాండలికాల పట్ల ఆయనకు ఉన్న సాధికారికత వల్లనే ఏడోతరగతి వరకు మాత్రమే చదువుకొన్న కీరాను పుదుచ్చేరి విశ్వవిద్యాలయం డీన్‌ ఆఫ్‌ ఫోక్‌ స్టడీస్‌గా నియమించి గౌరవించింది. పదవీవిరమణ తర్వాత కూడా ఆయన పుదుచ్చేరి లోనే ఉండిపోయారు. 


సుధారాణి ఎలాగైనా కీరా రచనలను తెలుగువారికి పరిచయం చేయాలనే పట్టుదలతో చెన్నూరు ఆంజ నేయరెడ్డి, ఐపీఎస్‌ని సంప్రదించారు. కీరా గురించి విన్న వెంటనే ఆంజనేయరెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ లెటర్స్‌ ప్రచురణ సంస్థ ద్వారా గోపల్లె గ్రామం అనువాదం ప్రచురించారు. తమిళంలో తొలి మాండలిక నవలగా పేరొందిన ఈ నవలను నంద్యాల నారాయణరెడ్డి చక్కగా తెలుగులోకి అనువదించారు. ఈ కృషి వెనుక స.వెం. రమేశ్‌ పాత్ర అసాఽధారణం. గోపల్లె తెలుగు అనువాదాన్ని హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో 2013 ఆగస్టులో ఆవిష్కరించారు. ఆ తర్వాత ఒక వారంలో పుదుచ్చేరిలోని జయరామ్‌ హోటల్‌లో ఒక పండగలా జరిగిన గోపల్లె పుస్తక సభలో పుదుచ్చేరి తెలుగు సాహిత్య అభిమానులు వచ్చారు. డాక్టర్‌ నల్లం, మద్రాస్‌ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అధిపతి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ మూర్తి, ప్రొఫెసర్‌ రావెళ్ల రుద్రతులసీదాస్‌, తెలుగు, తమిళ సాహిత్యాల పట్ల సమాన అభిమానం కలిగిన పూలతోట లక్ష్మీనారాయణ రెడ్డియార్‌, పుదు చ్చేరి విశ్వవిద్యాలయానికి చెందిన హైదరాబాద్‌వాసి భూషణ్‌, మండలి బుద్ధప్రసాద్‌, అనువాదకుడు నంద్యాల నారాయణరెడ్డి సభలో పాల్గొన్నారు. గోపల్లె నవల పాఠకాదరణ పొందిన తర్వాత ఆంజనేయరెడ్డి కీరా రెండో నవల గోపల్లపురత్తు మక్కళ్‌ అనువాదాన్ని కూడా అచ్చేయాలని నిశ్చయించారు. మదురై విశ్వ విద్యాలయం తెలుగు శాఖ అధిపతి శ్రీపాద జయ ప్రకాశ్‌ ఈ నవలను గోపల్లె జనాలు పేరిట అను వదించారు. ఈ రెండో నవల ఆవిష్కరణను హోటల్‌ కన్నా తన ఇంట్లోనే సన్నిహిత మిత్రుల మధ్య జరిపితే బాగుంటుందని కీరా భావించారు. ఆ సమా వేశానికి కీరా కుటుంబ సభ్యులతోపాటు డాక్టర్‌ సుధారాణి, సుబ్రహ్మణం దంపతులు, అనువాదకుడు ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌, తమిళంలో కవితలు రాసిన ప్రొఫెసర్‌ రావెళ్ల రుద్రతులసీదాస్‌, పూలతోట లక్ష్మీ నారాయణ వంటి మిత్రులు హాజరయ్యారు. తెలుగు, తమిళ ప్రతులను పక్కనపెట్టుకొని లక్ష్మీనారాయణ.. కొన్ని పేరాలను రెండు భాషల్లోనూ చదివి విని పించడం ఒక ప్రత్యేక ఆకర్షణ. 


కీరా సేకరించిన కథల నేపథ్యంలో అక్కడక్కడా కొన్ని సంచనాత్మక వాస్తవాలు, నైతిక సాపేక్షం అని చెప్పదగిన ఉదాహరణలు కనిపిస్తాయి. కీరా రాసిన కీటై -పశువుల మంద- అనే నవలను ఉరుట్టి -ఒక్కతే- అనే పేరుతో డైరెక్టర్‌ అన్షున్‌ కుమార్‌ సినిమాగా తీశారు. నవతరం సినిమా వొరవడికి చెందిన ఈ చిత్రానికి ఎల్‌. వైద్యనాథన్‌ సంగీతం అందించారు. అంతా కొత్త నటీనటులతో నిర్మించిన ఈ సినిమా హిట్‌ కాకపోయినా మంచి సినిమాగా పేరు తెచ్చు కొంది. శివాజీ గణేషన్‌, రాధ నటించిన భారతీరాజా సినిమా ముదల్‌ మర్యాదై సినిమాలో గోపల్లె నవలలోని కొన్ని సన్నివేశాలు ఉపయోగించుకున్నారు. ఈ సినిమా డబ్‌ చేయబడి ఆత్మబంధువు పేరిట తెలుగులో విడుదలయింది.


‘గోపల్లె’ నవల రాయలసీమ ప్రాంతం నుంచి కొన్ని ఒత్తిళ్ల వలన దక్షిణాదికి రైతు కుటుంబాలు భారీగా వలసలు సాగించడం నుంచి ఆరంభమ వుతుంది. ఆ కాలంలో మనుషులు నివసించే పెద్ద గ్రామాలు, కుగ్రామాలు తప్ప నాగరికత వెల్లివిరిసిన పరిసరాలు అంటూ లేవు. గ్రామగ్రామానికి మధ్య దట్టమైన అడవులు, ఇరుకైన కాలిబాటలు. ప్రభుత్వ మంటూ లేదు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు లేనేలేవని చెప్పనక్కర్లేదు. ఈ పరిస్థితుల్లో ఒక కుటుంబం ఎంతకష్టపడి ఏ మేరకు అడవిని నరికి సాగుచేయగలదో అదే వారి భూమి. ఈ విధంగా నల్లరేగడి భూముల్లో చెప్పుకోదగిన వ్యవసాయ విధానాలను దక్షిణాదిన ప్రవేశపెట్టిన ఘనత తెలుగువారిదే. తెలుగువారికి అక్కడి రాజులు, సామంతులు మరొక ప్రత్యేక బాధ్యతను లేక అధికారాన్ని అప్పగించారు. ఆ రోజుల్లో విచ్చలవిడిగా గ్రామాలపె ౖపడి హత్యలు, దోపిడీలు చేసే బంది పోట్లను అదుపు చేయడంలో తెలుగువారి పాత్ర చాలా ఉండింది. గోపల్లె కథాకాలం నామమాత్రం గానైనా ప్రభుత్వ వ్యవస్థలు లేని కాలంలో మొదలై, ఈస్టిండియావారు కాలూనే వరకు కొనసాగుతుంది. ఇక రెండో నవల ‘గోపల్లె జనాలు’ ఈస్టిండియా కంపెనీ సెలవు తీసుకొని బ్రిటిష్‌ గవర్నమెంట్‌ దేశాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడం నుంచి మొదలవుతుంది. స్వాతంత్య్ర పోరాటం, ముఖ్యంగా బొంబాయిలో నావికుల పోరాటం-ఐఎన్‌ఎస్‌ తల్వార్‌- గాంధీ సాగించిన ఉద్యమాల నేపథ్యంగా సాగిన ఈ కథ దేశానికి రాజకీయ స్వాతంత్య్రం రావడంతో ముగుస్తుంది. దేశ విభజన వల్ల జరిగిన రక్తపాతాన్ని తట్టుకోలేని గాంధీ, ‘సాధించిన స్వాతం త్య్రం పట్ల హర్షం వ్యక్తం చేయలేక బెంగాల్‌లో ఒకచోట నిర్వేదంగా ఉండిపోతాడు. దేశమంతా సంబరాలు చేసుకొంటున్న ఈ సమయంలో మీకెలా అనిపిస్తోందని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. చెప్ప డానికి ఏమీ లేదు అని గాంధీ నిర్లిప్తంగా జవాబు ఇవ్వడంతో ఈ నవల ముగుస్తుంది.


కీరా కోసం మేం జరిపిన పర్యటనల్లో అర్థమైన ఒక ముఖ్యాంశం ఏమిటంటే, దక్షిణ తమిళనాడు తెలుగు మాండలికం అనేది ఒకటి ఉంది. దీనిని పాండ్యనాడు తెలుగు అని కూడా అనవచ్చు. తొండ నాడు తెలుగుకి, కొంగు నాడు తెలుగుకు భిన్నమైన మరో మాండలికం ఇది. ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే, తమిళనాడులో ఉండే తెలుగు వారిని మన ప్రాంతంవారు పలకరిస్తే... తెలుగులో మాట్లాడటానికి వారు సంకోచిస్తారు. మా తెలుగే సరైన తెలుగు అని భావించే మనవాళ్లు వారి తెలుగును తక్కువగా చూడటమే దీనికి కారణం. ఈ సమస్య ఎదురయిన చోటల్లా డాక్టర్‌ సుధారాణి, సంస్కృత పదాలు లేకుండా ద్రావిడ పదాలతోనే నిండిన అచ్చ తెలుగు భాష మీదేనని వారికి నచ్చజెప్పి వారిమాటలు రికార్డు చేయడంతో వారు సంతుష్టులు అయ్యేవారు.


అకడమిక్‌ చదువులే కొలబద్దగా భావించే ఈ రోజుల్లో ఉన్నత విద్యార్హత ఏమీ లేకుండానే యావత్తు తమిళ పాఠకుల హృదయాల్లో అత్యంత గౌరవప్రదమైన స్థానం సంపాదించుకొన్న కీరా ధన్యజీవి. మే 19, 2021న కాలధర్మం చెందినా... మంచి సాహిత్యాన్ని ఆదరించే పాఠకుల హృదయాల్లో ఆయన చిరంజీవిగానే మిగిలిపోతారు.

సత్యకామ్‌