సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2021-05-09T05:08:26+05:30 IST

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు మే 1, శనివారం నాడు ఘనంగా జరిగాయి. జూమ్, యూట్యూబ్ వేదికగా ఆనందోత్సాహాల మధ్య వినోద భరితంగా సాగిన ఈ కార్యక్రమం

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు

సింగపూర్ సిటీ: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు మే 1, శనివారం నాడు ఘనంగా జరిగాయి. జూమ్, యూట్యూబ్ వేదికగా ఆనందోత్సాహాల మధ్య వినోద భరితంగా సాగిన ఈ కార్యక్రమంలో సుమారు 800 మంది స్థానిక తెలుగు కార్మిక సోదరులు పాల్గొన్నారు. పూర్వ, ప్రస్తుత కార్యవర్గ సభ్యులతో పాటు సినీ హీరో మంచు విష్ణు ఇందులో పాల్గొని కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.



సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. సింగపూర్ తెలుగు సమాజం తెలుగు కార్మిక సోదరులకి ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కొవిడ్ పరిస్థితుల్లో సింగపూర్ ప్రభుత్వ తీసుకొంటున్న జాగ్రత్తలను కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లో అందరూ ధైర్యంగా, కలసికట్టుగా ఉండాలన్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి అండగా ఉండాలని పిలిపునిచ్చారు. సాధారణంగా కార్యక్షేత్రం బయట జరిగే ప్రమాదాలకు బీమా పొందే అవకాశం కార్మికులకు లేదని గుర్తు చేశారు. అందువల్ల ఓ ప్రణాళికను రూపొందించి సింగపూర్‌లోని భారత హైకమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. దీనిపై భారత హైకమిషన్ కూడా సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. సింగపూర్‌లో నివసించే ప్రవాస కార్మికులందరికీ ఉపయోగపడేట్లుగా భారత హైకమిషన్ నేతృత్వంలో వివిధ సంస్ధల సహకారంతో ఒక బృహత్తర ప్రణాళిక త్వరలో అందరిముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. సింగపూర్ భారత హైకమిషనర్ కుమరన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సింగపూర్ తెలుగు సమాజం చేపడుతున్న సామాజిక కార్యక్రమాలను ప్రశంసించారు. కార్మికుల శ్రేయస్సు పట్ల సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గం  చూపిస్తున్న శ్రద్ధను అభినందించారు. తెలుగు సమాజం కార్మికుల బీమా పథకం ప్రతిపాదనకు సంబంధించిన పలు విషయాలు చర్చించారు. 


స్థానిక రెస్టారెంట్ల సహకారంతో, కుటుంబాలకు దూరంగా ఉన్న సుమారు 800 మంది కార్మిక సోదరులకు ఆహారాన్ని అందించినట్టు సహనిర్వాహకులు నరసింహ‌గౌడ్ తెలిపారు. ఇందుకు సహకరించిన రెస్టారెంట్‌ల యజమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మే డే ని పురస్కరించుకొని, రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో ఆదివారం నాడు హెల్త్ సైన్సెస్ అథారిటి ప్రాగణంలో రక్తదాన శిబిరం నిర్వహించగా సుమారు 85 దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేసినట్టు సహ నిర్వాహకులు మేరువ కాశయ్య తెలిపారు. వారికి ఆయన  ధన్యవాదాములు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు వారికి, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన కార్యవర్గ సభ్యులకీ కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలిపారు.


Updated Date - 2021-05-09T05:08:26+05:30 IST